గద్వాల పట్టణం లోని సంఘాల చెరువు లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోట్లను రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో పట్టణాలు , పల్లెలు సమగ్రంగా అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు.
అందులో భాగంగా గద్వాల పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించారని, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు గద్వాల పట్టణానికి సమీపంగా ఉన్న సంగాల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మూడున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించామన్నారు.
గద్వాల పట్టణం తలమానికంగా ఉన్న సంఘాల చెరువును హైదరాబాదులోని ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. సంఘాల చెరువు కట్టమీద మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేస్తామన్నారు. పచ్చని పార్కులో సుందరంగా ఉండేలా రూపొందిస్తామన్నారు. సుమారు 350 ఎకరాలు పైచిలుకు ఉన్న ఈ పెద్ద చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్, పార్కులు, లైటింగ్ సౌకర్యంతో సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేందుకు, చెరువు కట్ట పై కూర్చొని సేదతీరేందుకు అవసరమైన బెంచీల ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
గద్వాల పట్టణంలో ఎక్కువగా విద్యావంతులు, ఉద్యోగస్తులు సాయంత్రం వేళలో కుటుంబంతో బయటకి వచ్చి ఆనందంగా ఆహ్లాదకరంగా గడిపేందుకు ఈ చెరువు చుట్టూ పర్యాటకంగా, సాంస్క తికంగా అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యాటకంగా మౌలిక వసతుల ఏర్పాటు చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గ్రామాలలో, పట్టణాలలో ఎంతో మార్పు వచ్చిందని, ప్రజలు అభివృద్ధిని, సంక్షేమ పథకాలను కోరుకుంటున్నారని మంత్రి అన్నారు. గద్వాల జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, ప్రతి ఎకరానికి నీరు అందిస్తామన్నారు. గద్వాల పట్టణ అభివృద్ధికి శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పలు ప్రతిపాదనలు సమర్పించారని వాటిని ఎంత తొందరగా వీలైతే అంతే తొందరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.