induruతెలంగాణ రాష్ట్రంలో నేడు ‘నిజామాబాద్‌’గా పిలవబడుతున్న ‘ఇందూరు’ది చాలా ప్రత్యేక స్థానం. సుమారు 1500 ఏళ్ళ చరిత్ర కలిగిన ‘ఇందూరు’ అన్ని రంగాలలో ప్రగతిని సాధించి నాటి చరిత్రాత్మక వైభవాన్ని నేటికీ నిలుపుకొని కాలంతోపాటు శరవేగంగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోంది. పలు విధాలైన జీవన విధానాలకు, మతాచారాలకు, సాంస్కృతిక వైభవాలకు, రాచరిక పాలనలకు నెలవు ఇందూరులో వెలసిన నిజామాబాద్‌ కోట.

నాగబాల సురేష్‌ కుమార్‌

ఇందూరు అంటే జైనుల, బౌద్ధుల బోధనశాల, విష్ణు కుండినులు ఏలిన నేల. ఇందూరు అంటే జిన వల్లభుడు, హరికేశరుడు, పంపకవి రచించిన బోధనలు మనకు గుర్తుకు వస్తాయి. ‘ఇందూరు’ పేరు వినగానే ఇంద్రపురి, కైలాస గిరి, బాల కొండ దుర్గాల స్ఫురణ కూడా కలుగుతుంది. ఈ నగరాన్ని పాలించింది రాష్ట్ర కూట సామ్రాజ్యానికి చెందిన మూడవ ఇంద్రుడు, ఆయన పేరుమీదుగానే ఈ ప్రాంతాన్ని ‘ఇంద్రపురి’గా పిలిచే వారు. నిజాం ప్రత్యేక రాజ్యంగా కొనసాగిన కాలం లో తెలంగాణ భారతదేశంలో విలీనమవకముందు ఈ ప్రాంతాన్ని అసఫ్‌జాహీలు పాలించడంతో ఆయా రాజుల పేర్ల మీదుగా నిజాం రాజ్యంలోని అనేక నగరాల పేర్లు మార్చబడ్డాయి. అదేవిధంగా నిజాం ఉల్‌ ముల్క్‌ పేరుమీదుగా వందల ఏళ్ళపాటు ‘ఇందూరు’గా పిలవబడ్డ నగరం ‘నిజామాబాద్‌’గా మార్పు చెందింది.

రాష్ట్ర కూట సామ్రాజ్యాన్ని స్థాపించింది దాంతీ దుర్గుడు. దక్షిణ గుజరాత్‌లో ప్రారంభించిన ఆయన సామ్రాజ్య విస్తరణ దక్షిణ భారతదేశంలోని తంజావూరు వరకు అప్రతిహతంగా కొనసాగింది. అంతటి సామ్రాజ్య విస్తరణ కలిగి, వారి సామ్రాజ్య విస్తరణను తెలంగాణ రాష్ట్రం వరకూ కూడా కొనసాగించారు. అలా వారు విస్తరించి స్థాపించిన కొత్త సామ్రాజ్యాలలో ఈ ఇందూర్‌ (నిజామాబాద్‌) సామ్రాజ్యం కూడా ఒకటి. వారి సామ్రాజ్య వ్యాప్తిలో భాగంగా అనేక నగరాలు నిర్మించారు, కోటల నిర్మాణం గావించారు. అలా మూడవ ఇంద్రుని కాలంలో వేసిన పునాది రాయే ఈ ‘ఇందూర్‌ ఖిల్లా’. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 177 కి.మీ. దూరంలో వున్న ‘ఇందూరు ఖిల్లా’ నిర్మాణానికి 10వ శతాబ్ద కాలంలో 3వ ఇంద్రుడి ద్వారా బీజం పడింది. రాష్ట్ర కూట రాజులచే నిర్మించబడిన ‘ఇందూర్‌ ఖిల్లా’ పట్టణ ప్రధాన కూడలి గాంధీ చౌక్‌ నుండి 2 కి.మీ. దూరంలో, నిజామాబాద్‌ పట్టణ ప్రాంతానికి దక్షిణ దిశలో వుంది.

ప్రధాన ద్వారం మొత్తం కూడా కోటను చుట్టి పెద్ద పొడవాటి రాతి గోడలతో చుట్టబడి వుండి, కోట గోడపై అనేక బురుజులు కనిపిస్తాయి. అయితే ఇక్కడి కోట బురుజులు పర్షియన్‌ ఆర్కిటెక్చర్‌ విధానంలో వుంటుంది. కోట లోపలి భాగంలో దర్గా, మసీదు వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. ఇందూరు కోట రాష్ట్ర కూటుల నుండి కాలక్రమేణా కాకతీయులు, బహిమనీలు, మొగలాయిలు, కుతుబ్‌ షాహీలు, అసఫ్‌జాహీల చేతుల్లో తీర్చిదిద్దుకోబడిందని తెలుస్తోంది. కోట ప్రవేశ ద్వారం మొదలుకొని పైకి వెళుతున్న కొద్దీ మనకు ఒక జైలు వంటి నిర్మాణం కనిపిస్తుంది. ఇది అసఫ్‌ జాహీల కాలంలో కట్టబడినదిగా మనకు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇలా కోట పైకి వెళుతుంటే నిజామాబాద్‌ పట్టణ ప్రాంత పరిధి మొత్తం మనకు కనిపిస్తుంది. అయితే కోట మొత్తంలో అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకునేది మాత్రం శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. దీనినే ఖిల్లా రామాలయంగా, రఘునాథ ఆలయాలుగా స్థానిక ప్రజలు పిలుస్తారు.

రాష్ట్రకూట రాజులలో ప్రసిద్ధి చెందిన ఇంద్రుడు క్రీ.శ. 914 – 928 సంవత్సర మధ్య కాలంలో ఇందూర్‌ను పాలించినప్పుడు పట్టణానికి నైరుతి దిశలో ఈ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. సుమారు 3900 చ.గజాల వైశాల్యంలో నిర్మింపబడి వుంది ఈ శ్రీ రఘునాథ ఆలయం. శ్రీ సమర్థ రాందాస్‌ జీ (ఛత్రపతి శివాజీ గురువు) గతంలో ఈ కొండపై రఘునాథ మందిరాన్ని నెలకొల్పారు. ఈ ఆలయం పట్టణ శివార్లలోని కోటపై వుండగా పక్కనే ఆనుకుని మనకు బొడ్డెమ్మ చెరువుగా పిలవబడే రఘునాథ చెరువులోని ప్రకృతి అందాలు పర్యాటకులకు నయనానందంగా దర్శనమిస్తాయి. వెయ్యి సంవత్సరాల క్రితం కోట నిర్మించినప్పటికీ ఇప్పటికీ కోట ఆనవాళ్ళు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇక్కడి 53 అడుగుల అఖండ శిలా ధ్వజ స్తంభంపై నాడు ప్రతినిత్యం ‘గరుడ దీపం’ వెలిగిస్తే చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రజలు దీపాలు వెలిగించేవారని ప్రతీతి. నిజామాబాద్‌ ఖిల్లా అత్యంత విశాలంగా శతృదుర్భేద్యంగా శక్తివంతమైన రాతి శిలలతో అత్యంత పటిష్టంగా నిర్మించారు. వివిధ రాజుల కాలంలో కోటలో చేపట్టిన కొన్ని నిర్మాణపు ఆనవాళ్ళు మనకు కోటలో అక్కడక్కడా కానవస్తాయి.ఖిల్లా లోపల నుండి డిచ్‌పల్లి, సారంగపూర్‌ ప్రాంతాలకు అత్యవసర సమయాల్లో వెళ్ళడానికి వీలుగా నిర్మించిన సొ రంగ మార్గాలను సూచించే గుర్తులు ఖిల్లా గోడలపై మనకు కనిపిస్తాయి. రఘునాథుడనే మహర్షి ఖిల్లాలోని ప్రత్యేక సొరంగ మార్గం గుండా బొడ్డెమ్మ చెరువులో నిర్మించిన శిలా కట్టడం వరకు వెళ్ళి అక్కడే స్నాన మాచరించి తిరిగి ఖిల్లాకు వచ్చేవారని పలు కథనాలు వినిపిస్తాయి. ఖిల్లాలో నిర్మించిన రఘునాథ మహర్షి జ్ఞాన మందిరం శిల్పుల ప్రతిభకు తార్కా ణంగా అద్భుతంగా నిర్మించిన మంది రం. ఇక్కడి విశిష్ఠమైన నిర్మాణం వల్ల సహజ సిద్ధమైన చల్లదనంతో ఈ మందిరంలోని ప్రాంతం ఎంతో హాయిగా… చల్లగా… వుంటుంది. కొండ క్రింది భాగంలో ఆంజనేయ స్వామి గుడి రాతి బండల మధ్య దారిలో వైభవంగా కనిపిస్తుంది. ఎంతో వైభవోపేతమైన చరిత్ర కలిగిన ఈ ఖిల్లా రాచరికపు చరిత్రతోపాటు అంతే స్థాయిలో ఆధ్యాత్మిక శోభను సైతం సంతరించుకుందనడానికి ఈ అంశాలే ఉదాహరణ. అయితే కాలక్రమేణ 1296 మధ్య కాలంలో ఈ కోట ఢిల్లీ సామ్రాజ్యానికి చెందిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ చేతుల్లోకి వెళ్ళి మహమ్మదీయ సేనల చేతిలో దాదాపు 1296 నుండి 1316 వరకు వారి పాలనను చవిచూసింది. వారి సేనలు కోటను స్వాధీనం చేసుకున్న తరువాత కోటలోని అనేక అద్భుత శిల్ప సంపద, మందిరాలు ధ్వంసం చేయబడ్డాయి. వారి ఆరాచకాలు మితి మీరటంతో కోటను కాకతీయ రాజులు స్వాధీనం చేసుకున్నారు.

‘ఇందూర్‌ ఖిల్లా’. అనంతర కాలంలో కుతుబ్‌ షాహీల నిజాముల పాలనను సైతం చవి చూసింది. వారి కాలంలో మసీదులు దర్గా నిర్మాణాలకు కూడా నెలవైంది. కోటను ఆనుకుని వున్న రఘునాథ ఆలయం ప్రక్కనే దర్గాల నిర్మాణాన్ని కూడా గమనించవచ్చు. సున్నీ మతస్తులు ఈ దర్గా వద్ద ప్రతి సంవత్సరం ప్రార్థనలు చేస్తారు. ప్రస్తుతం శిథిలావస్థలో వున్న ఈ కోట కారణంగా ఇప్పుడు ఆ పద్ధతి మారిందని స్థానిక ప్రజలు చెబుతుంటారు.

ప్రభుత్వం కోటలో కొన్ని మరమ్మతులు జరిపి సందర్శ కుల కోసం కొన్ని వసతి సౌక ర్యాలు కల్పిస్తే ‘ఇందూరు కోట’ పర్యా టకులతో కళకళలాడు తుంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుం దని ఆశిద్దాం.

Other Updates