గతంలో ప్రభుత్వ పథకాలంటే… బ్యాంకులు మేనేజ్ చేసే వారికే అవి అందుతాయని ఉండేది…కానీ కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పద్ధతి మారింది. అదేవిధంగా ఊరికి ఒకటి, రెండు యూనిట్లు ఇచ్చి చేతులు దులుకుపుకునే గత ప్రభుత్వాల తీరును పూర్తిగా మార్చేసిందని మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో జరిగిన ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పథకం కింద 52 మంది డ్రైవర్లకు కార్లను ఆమె పంపిణీ చేశారు. త్వరలోనే మరో వందమంది గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఒప్పందం చేసుకున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ” నేను గిరిజన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన బిడ్డల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నుంచి డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ లబ్ధిదారులకు కార్లు అందించడం చాలా గొప్పగా ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ సహకారంతో, వారి సబ్సిడీతో, ఎస్.బి.ఐ రుణంతో వాహనానికి ఓనర్ గా అయ్యే చక్కటి అవకాశం ద్వారా నేడు 52 మంది మా గిరిజన బిడ్డలు ఓనర్లుగా మారుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు” అని మంత్రి తెలిపారు. ముందుగా ముఖ్యమంత్రి కేసిఆర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఒక గిరిజన బిడ్డ అయిన నాకు, ఒక తండాలో పుట్టి పెరిగిన నాకు, గిరిజన సంక్షేమ శాఖను ఇవ్వడం, గిరిజనులను అభివృద్ధిలోకి తీసుకురావడానికి వారి ఆలోచన క్రమం, బహుశా ఈమె తండాలో ఉంటుంది, వారి కష్టసుఖాలు తెలిసిన మనిషి కాబట్టి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందనే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండే గిరిజన బిడ్డలందరి విశ్వాసాన్ని చూరగొని, భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, కార్పోరేటర్ రుబీనా, గిరిజన శాఖ కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ట్రైకార్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శంకర్ రావు, ఎస్బీఐ అధికారులు, మారుతీ-సుజుకీ ప్రతినిధులు పాల్గొన్నారు.