కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా డయాలసిస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకొచ్చింది. వ్యాధితో బాధపడుతున్న పేదవారు డయాలసిస్ చేయించుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవల కొరకు పట్టణాలకు వెళ్లాల్సి రావడంవలన విలువైన సమయంతోపాటు ప్రయాణం చేయాలంటే నరకయాతనలు అనుభవించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటువంటి వారికి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి. అదీ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి వైద్య, ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సేవలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొచ్చారు.
భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజలు డయాలసిస్ చేయించుకోవాలంటే ఖమ్మం, హైదరాబాద్ నగరాలకు వెళ్లాల్సిందే. భద్రాచలంనుండి ఖమ్మంకు దాదాపు 120 కి.మీ., హైదరాబాద్ నగరానికి దాదాపు 320 కి.మీ. వెళ్లాల్సి రావడంతో వ్యాధిగ్రస్తులు అంతంత దూరం ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
గిరిజనులు అధికసంఖ్యలో నివసించు ప్రాంతం అయిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే డయాలసిస్ అవసరం ఉన్నవారికి కూతవేటు దూరంలోనే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్న సంకల్పంతో ప్రభుత్వం కోటి రూపాయల నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన అధునాతన పరికరాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వారానికి రెండు లేదా మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాలంటే దాదాపు 10వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. డబ్బులు ఉన్నా లేకపోయినా బ్రతికించుకోవాలన్న ఆశతో వేలకు వేలు ఖర్చులు చేసి వైద్య సేవలు చేయిస్తే బ్రతుకు సంగతి దేవుడెరుగు కానీ ఇల్లు, ఒళ్లు గుల్లయి చాలా కుటుంబాలు అప్పుల పాలయ్యేవి. ఇటువంటి పరిస్థితులనుండి ప్రజలను కాపాడాలంటే వారికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందుబాటులోనికి తేవాలని, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో డయాలసిస్ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 40 కేంద్రాలను ఏర్పాటు చేసింది. అవసరాన్నిబట్టి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు ప్రకటించారు.
ఈ కేంద్రాలలో ప్రజలకు సురక్షితమైన ఫిల్టర్లు ఉపయోగించి డయాలసిస్ చికిత్సలు అందజేయనున్నారు. డయాలసిస్ కొరకు వినియోగించే ఫిల్టర్లు గతంలో 3 నుండి 5 సార్ల వరకు వినియోగించడంవలన వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు ఎదురయ్యేవని, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకసారికి మాత్రమే ఫిల్టర్లు వినియోగించే విధంగా పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు అత్యంత ప్రాధాన్యతనిస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్. శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం