గిరిజన మహామేళాఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు, అలవాట్లకు, దైవారాధన పద్ధతులకు అద్దం పట్టే మహాజాతర కోసం వరంగల్లు జిల్లాలోని మేడారం ముస్తాబవుతోంది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలం మేడారంలోని కీకారణ్యంలో సమ్మక్క సారలమ్మ రెండేళ్లకోసారి జాతర జరుగుతుంది. 2016 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జాతర జరుగుతుంది. మొదటి రోజు ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మలను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్ధరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజులును గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టిస్తారు. మరుసటి రోజు 18ఫిబ్రవరి గురువారం సమ్మక్కను చిలుకల గుట్ట నుంచి తెచ్చి ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు.

ఈ నాలుగు రోజులూ మేడారంలో ఒకటే సందడి. సమ్మక్క, సారలమ్మల ఆగమనం, దేవతలను గద్దెల వద్ద ప్రతిష్టించడం, వనదేవతల పూజలు, వనప్రవేశం లాంటి ఘట్టాలు పూర్తిగా గిరిజన సాంప్రదాయాలతో అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. వెయ్యేళ్ల క్రితం స్వయం పాలన కోసం పోరాడిన వీర వనితలైన సమ్మక్క, సారలమ్మలకు నివాళి అర్పించే కార్యక్రమం కాలక్రమేణా జాతరంగా మారింది. సమ్మక్క, సారలమ్మల మహిమ, గొప్పతనం, వీరత్వం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎక్కువ మంది విశ్వసించే కథనం మాత్రం వారు కాకతీయులతో జరిగిన యుద్దంలో నేలకొరిగారనే. దాదాపు వెయ్యేళ్ల క్రితం ప్రస్తుతం మేడారం ప్రాంతంలో మేడరాజులు కాకతీయులకు సామంతులుగా రాజ్యం చేస్తుండే వారు. ఓసారి నాలుగేళ్ల పాటు తీవ్ర కరువు కాటకాలు రావడంతో మేడరాజ్యంలో ప్రజలు పన్నులు కట్టలేకపోయారు. దీంతో సామంతులు కాకతీయులకు కప్పం చెల్లించలేదు. కప్పం చెల్లించడం లేదనే సాకుతో కాకతీయులు మేడరాజులపై యుద్దానికి దిగారు..

జంపన్న వాగులో స్నానాలు, తలనీలాల సమర్పణం, ఎదురుకోళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించడం, లక్ష్మి దేవర వేషాలు, శివసత్తుల పూనకాలు, వడిబియ్యం సమర్పణం, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, మండ మెలిగే ఉత్సవం, కోయదొరల భవిష్యవాణి, మహిళా వేషధారణతో ఉండే పురుషుల ఆటపాటల లాంటి దృశ్యాలు జాతరను కోలాహలంగా మారుస్తాయి.

వేద మంత్రోచ్ఛరణలు లేకుండా, విగ్రహారాధన చేయకుండా, ఏ మతం ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారుల సమక్షంలో గిరిజన పద్దతిలో ఈ జాతర జరుగుతుంది. జాతరకు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు కోటి మంది భక్తులు వస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం అయిన మేడారం జాతరకు తెలంగాణా ప్రభుత్వం స్టేట్‌ ఫెస్టివల్‌గా పరిగణించి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సారి స్వరాష్ట్రంలో దాదాపు వంద కోట్ల రూపాయలతో జాతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి అందచందాల తో అలరారే కీకారణ్యం మాఘశుద్ధ పూర్ణిమ వచ్చిందంటే జనారణ్యంగా మారుతుంది. తెలంగాణాలోనే అతిపెద్ద జాతరగా పేరొంది, భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రాశస్త్యాన్ని ఆపాదించింది. గిరిజన తండాల్లో ఉండే పట్టుదల, నమ్మకం, నీతి నిజాయితీలకు అద్దంపట్టే మేడారం జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా కేంద్రానికి 110కిలో మీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో మేడారం గిరిజన గ్రామంలో జరిగే ఈ జాతర గిరిజన సాంప్రదాయాల కంటే గిరిజనుల ఐకమత్యాన్ని కట్టుబాట్లను, ఆత్మగౌరవాన్ని ప్రస్ఫుటింప చేస్తుంది. గిరిజన సాంప్రదాయాలను, ఆచారాలను ఆధునిక ప్రపంచం క్రమేణా కబళిస్తున్నప్పటికి సుమారు 700 ఏళ్ళకు పూర్వం చరిత్రకల మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరపై ప్రజల నమ్మకం, విశ్వాసం ఏటా పెరగడమే తప్ప తరగడంలేదు. దీనికి నిదర్శనం ప్రతి జాతరకు దాదాపు 80లక్షలకు పైగా భక్తులు హాజరవడమే.

జాతర ప్రాశస్త్యం:

వివిధ రాష్ట్రాల నుండి గిరిజనులను, గిరిజనేతరులను విశేషంగా ఆకర్షిస్తున్న మేడారం జాతర ప్రాశస్త్యం, స్థల పురాణం ప్రకారం ఈ విధంగా ఉంది.

17వ శతాబ్దంలో తమ నివాస స్థలమైన మేడారం నుంచి కోయదొరలు ఒక రోజు దట్టమైన అడవుల్లోకి వేటకు వెళ్లగా పెద్దపులుల కాపలా మధ్య దేదీప్య మానంగా ఒక పసిపాప కనిపించింది. ఆ దృశ్యం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన కోయదొరలు గూడెం పెద్దలను రప్పించి పసిపాపను పల్లకిలో ఎత్తకొని మేళతాళాలతో మేడారానికి తీసుకువెళ్ళారు. గద్దె పందిళ్లలో కొండ దేవతను కొలిచారు. ఆ పసిపాప మేడారానికి వచ్చినప్పటి నుండి కోయదొరలకు అన్ని శుభ పరిణామాలే జరిగాయి. అడవుల్లోని విష సర్పాలు, క్రూర జంతువులు గుంపులు, గుంపులుగా వచ్చి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. వీటిని చూసిన కోయదొరలు కొండ దేవత సాక్షాత్తూ పాప రూపంలో అవతరించిందని భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క అని నామకరణం చేశారు. పులులు, సింహాల వంటి క్రూర జంతువులపై స్వారీ చేయడం, దీర్ఘ రోగాలను నయంచేయడం, వృద్దులకు సాయపడడం, గొడ్రాళ్లకు సంతానాన్ని అనుగ్రహించడం వంటి అతీతమైన మహిమల వల్ల సమ్మక్క కీర్తి నలుదిశలా వ్యాపించింది. కరీంనగర్‌ ప్రాంత రాజ్యాన్ని పరిపాలించే కోయ చక్రవర్తి, మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే ఆడ శిశువులతో పాటు జంపన్న అనే మగ శిశువు సంతానంగా జన్మించారు.

అయితే, మేడారం ప్రాంతాన్ని కోయరాజులు, కాకతీయ రాజులకు సామంత రాజులుగా పరిపాలిస్తుండేవారు. ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాధికారాన్ని చేపట్టేనాటికి అప్పటి కరీంనగరంను రాజధానిగా చేసుకొని కోయ చక్రవర్తి మేడరాజు పరిపాలించేవాడు. కాకతీయ సామంత రాజుగా గిరిజన గూడెం మేడారం పగిడిద్దరాజు స్వాధీనంలోకి వచ్చింది. పరిపాలనా కాలంలో వరుసగా నాలుగేళ్ళ పాటు అనావృష్టి సంభవించి, పంటలు పండక విలయతాండవం చేసింది. ఈ పరిస్థితులలో ప్రజలు కప్పం (పన్ను) కట్టని స్థితికి చేరారు. దాంతో కాకతీయులకు కప్పం చెల్లించడానికి పగిడిద్దరాజు నిరాకరించాడు. కోపోద్రిక్తుడైన ప్రతాపరుద్రుడు గిరిజన చక్రవర్తి పగిడిద్దరాజును అణచివేయడానికి ప్రధానమంత్రి యుగంధరుడి సారధ్యంలో సైన్యాన్ని పంపాడు. కాకతీయ సైన్యాలు సంపెంగవాగు వద్ద భీకర పోరాటం చేశాయి. యుద్ద నిపుణత గల కాకతీయ సైన్యంధాటికి కోయసేనలు నిలువలేకపోయాయి. పగిడిద్దరాజుతో పాటు అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ అల్లుడు గోవిందరాజు యుద్ధంలో వీర మరణం పొందారు. కాకతీయ సేనలు మేడారంలో ప్రవేశించకుండా నియమితుడైన పగిడిద్దరాజు కుమారుడైన జంపన్న పరాజయాన్ని సహించలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్నవాగుగా వాడుకలోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో సమ్మక్క స్వయంగా కాకతీయ సేనలతో యుద్ధానికి తలపడింది. పరాశక్తి అవతారమైన సమ్మక్క అపరకాళిలా విజృంభించి కాకతీయ సైన్యాలను అంతం చేయనారంభించింది. ఎక్కడ చూసినా చండిలా వీర విహారం చేస్తున్న సమ్మక్కను చూసి ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైనికుడొకడు దొంగచాటుగా వెనుక నుండి సమ్మక్కను బళ్లెంతో పొడిచాడు. వెంటనే సమ్మక్క యుద్ధభూమి నుండి వైదొలిగి మేడారానికి ఈశాన్య దిశవైపు గల ‘చిలకలగుట్ట’ దారికి వెళ్లింది. కొందరు కోయ సైనికులు ఆమెను అనుసరించినప్పటికీ, గుట్ట మలుపు తిరిగిన తర్వాత అదృశ్యమైన సమ్మక్క జాడ ఎంతకూ తెలియరాలేదు. అయితే గుట్టమీద గల నాగవృక్షం సమీపంలోని ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ గల భరిణె వారికి లభించింది. దానిని సమ్మక్కకు గుర్తుగా భావించి కోయదొరలు నిద్రాహారాలు మాని, సమ్మక్క తిరిగి వస్తుందన్న ఆశతో వేచి చూసినా ఫలితంలేకపోవడంతో, అప్పటి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రతి రెండేళ్లకోసారి కుంకుమ భరిణె లభించిన ప్రదేశంలోనే ముత్తయిదువలు పండుగ జరుపుకునేవారు.

అయితే మేడారానికి పది కిలోమీటర్ల దూరంలో గల బయ్యక్కపేట గ్రామానికి చెందిన గిరిజనుని చేత మొదటి జాతర జరుపబడింది. జాతరకు పూజలు జరిపించి రెండేళ్లకోసారి మేడారంలో నిర్వహిస్తున్నారు. జాతరలో ‘శివసత్తుల’ పూనకాలు ఉత్కంఠ కలిగిస్తాయి. దేవతల గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేసి వరాలు పడతారు. కలిగిన సంతానానికి తమ పేరు పెట్టుకుంటామని మొక్కుకుంటారు.

కరీంనగర్‌, వరంగల్‌, అదిలాబాద్‌, నిజా మాబాద్‌ జిల్లాల్లోని జనం, మహారాష్ట్రలోని తెలుగు ప్రజలు, మధ్యప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంత గిరిజన, గిరిజనేతరులకు సమ్మక్క, సారలమ్మ దేవతలు ఆరాధ్యదేవతలు. ఆయా ప్రాంతాలలోని జనం కనీసం 30శాతం ప్రజలు ఈ దేవతల పేర్లను కలిగి ఉన్నారు. వారిలో కొందరు సమ్మయ్య, సమ్మక్క, కొడుకైన జంపన్న పేర్లను కలిగి ఉన్నారు. జాతరకు ఆయా పేర్లుగలవారు తప్పనిసరిగా హాజరై మొక్కు బడులు చెల్లించుకుంటారు. కోరికలీడేరి భక్తులు జాతర ఉత్సవ సమయంలో మేడారానికి వచ్చి ధన, వెండి, బంగారు వస్తువులను కానుకల రూపంలో చెల్లిస్తారు. తమకు సంతానం కలిగిన పిల్లా పాపల పుట్టు వెంట్రుకలను కూడా సమర్పిస్తారు.

Other Updates