చుట్టూ దట్టమైన అడవి. కొండకోనల మధ్య ప్రకృతి ఒడిలో జనప్రవాహం. భక్తిభావం ఉరకలేస్తుంది. భక్తులు పూనకంతో ఉగి పోతారు. అక్కడ దేవుళ్ళ విగ్రహాలు లేవు. గుడిగోపురాలు లేనే లేవు. కానీ, ఇంతగా పుట్టలు పగిలినట్టు తండోపతండాలుగా జనం ఎందుకు తరలివస్తున్నారు?
వరంగల్ జిల్లా మేడారం పేరు చెపితే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది అక్కడ రెండేళ్ళకొకసారి జరిగే సమ్మక్క – సారలమ్మ జాతర. గిరిపుత్రుల్లో ఉండే సడలని పట్టుదల, చెక్కుచెదరని నమ్మకం, దేవతల పట్లగల అపార విశ్వాసం, నిష్కల్మష భక్తికి ఈ జాతర నిదర్శనం. సుమారు కోటి మందికిపైగా హాజరయ్యే ఈ గిరిజన జాతర ఆసియాలోనే పెద్దది. ఈ జాతర వెనుక ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. స్వేచ్ఛాయుత పాలనకోసం ఉద్యమించి వీరమరణం పొందిన గిరిజన బిడ్డల వీరగాథ ఉంది.
భరిణె రూపంలో వున్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించడంతో ప్రారంభమయ్యే ఈ జాతర అమ్మవార్ల వన ప్రవేశంతో ముగుస్తుంది. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరలో వంశపారం పర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం విశేషం. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవారికి బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పిస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా ఈ ఫిబ్రవరి 17 నుంచి 20 వరకూ జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సకల చర్యలు చేపట్టింది.
ఈ జాతరకు తెలంగాణ ప్రాంతంవారేగాక ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు, ముఖ్యంగా గిరిజనులు తరలివస్తారు. ఇంతటి ప్రాశస్త్యం గల ఈ జాతర నిర్వహణకు ఉమ్మడి రాష్ట్రంలో అరకొర నిధులు, చాలీచాలని సౌకర్యాలు కల్పించేవారు. కానీ, స్వరాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి ఘనంగా నిర్వహిస్తోంది.
తొలినాళ్ళలో గిరిజనులకే పరిమితమైన ఈ జాతరకు నేడు అన్నివర్గాల ప్రజలు తరలివస్తుండటంతో మరో కుంభమేళాను తలపిస్తోంది.