ములుగు జిల్లాలో ఏర్పాటుచేయ తలపెట్టిన గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో తాను చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో రాజ్ భవన్ లో జరిగిన సమావేశంలో గిరిజన సంక్షేమ పథకాలపై ఆమె సమీక్షించారు.
గిరిజనులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు, ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో లభించే వనమూలికల ఔషధాల తయారీలో (హెర్బల్ మెడిసిన్స్) యువతను ప్రోత్సహించాలని గవర్నర్ అధికారులకు సూచించారు. కేవలం స్థానిక గిరిజన వర్గాలకు మాత్రమే తెలిసిన వనమూలికలు, చెట్ల వ్రేళ్ళలో కలిగిన ఉన్న ఔషధ గుణాలను నమోదుచేయాలని అధికారులకు ఆమె సూచించారు.
తాను కొన్ని గిరిజన ప్రాంతాలలో పర్యటించి గిరిజనులను స్వయంగా కలుసుకోవాలని భావిస్తునట్టు చెప్పారు.” నేను గిరిజన గ్రామాన్ని సందర్శించి, అక్కడే ఓ రాత్రి బసచేసి, వారి సంస్కృతి, సాంప్రదాయాలు, స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నాను”’. అని గవర్నర్ చెప్పారు. గతంలో తాను ఒక వైద్య విద్యార్థినిగా తన స్నేహితులతో కలసి స్వచ్ఛంద సేవలు అందించేందుకు అండమాన్ దీవులలోని మారుమూల గిరిజన ప్రాంతాలను సందర్శించినట్టు డాక్టర్ తమిళిసై తెలిపారు.
రాష్ట్రంలో గిరిజనుల సాంఘిక, సామాజిక, విద్యాపరమైన అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బి.ఎం.డి. ఎక్కా గవర్నర్‌కు వివరించారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలలో 2.25 లక్షల మంది గిరిజన విద్యార్థులు చదువుకొంటున్నారని, ఐ.ఐ.టి, ఎన్.ఐ.టి, తదితర కేంద్ర విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి కూడా గిరిజన విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. కొంతమంది గిరిజన విద్యార్థులు సివిల్ సర్వీసులకు కూడా సిద్ధమవుతున్నారని, ఇటీవల జరిగిన పరీక్షలలో ఇద్దరు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని కూడా గిరిజన కార్యదర్శి గవర్నర్‌కు వివరించారు.
అంతకుముందు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి వచ్చిన కోయ, లంబాడీ గిరిజన సాంస్కృతిక బృందాల నృత్యంలో గవర్నర్ పాల్గొన్నారు. తాము రాజ్ భవన్ ను సందర్శించడం ఇదే మొదటిసారని ఆ గిరిజనులు సంతోషం వ్యక్తంచేశారు.
గిరిజన సంక్షేమ పాఠశాలల సొసైటీ (టి.డబ్ల్యు.ఆర్.ఎస్.ఎస్.) కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రమీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా చెంగతన్, తదితర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.