భాషల విషయానికొస్తే ఈ భిన్నత్వం కొట్టవచ్చినట్లు కనబడుతుంది.ఉత్తరాది భాషలకు ఇండో యూరపియన్/ఆర్యన్ భాషలకు దగ్గర. సంస్కృత భాషలోనైతే పదాలకు ఏక, ద్వి, బహు అనే మూడు వచనాలున్నాయి. ఆయా మాటలకు స్త్రీ, పురుష, నపుంసక లింగాల నిర్ధారణ కూడా చాలా తికమక పెడుతుంది. ఈ లింగ సందిగ్ధత ఉత్తరాదిలోని అన్ని భాషలకూ వర్తిస్తుంది. దక్షిణాది భాషల్లో ఈ లింగ నిర్ధారణ చాలా సులువుగా ఉంటుంది. ఇంకా ఉత్తరాది భాషల్లోని కర్మణి వాక్యాలూ,
యుత్తదర్థక వాక్యాలూ దాదాపుగా ఉండవు. అనేక కారణాలరీత్యా భాషలమధ్య ఈ భిన్నత్వం మనకు గోచరిస్తూ వుంది.
ఇట్లా భిన్నత్వం కలిగిన భాషల్లో సామెతలూ, పొడుపుకథలు ఆయా భాషలకు ఒక ప్రత్యేకతను కలిగిస్తాయి. విచిత్రమైన సొగసును ఆపాదిస్తాయి. కొత్త అభివ్యక్తి సామర్థ్యాన్ని కలిగి వుంటాయి. ఏ భాషకైనా జవజీవాలూ, బగీబిగులు సామెతలూ, పొడుపు కథలే! భాషకు గొప్ప అందాన్ని సమకూర్చే పొడుపు కథలు తెలుగులో ఎలా వున్నాయి మరి? బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే తెలుగులోని మూడు ప్రాంతాల భాషల్లో లేదా యాసల్లో పొడుపు కథలన్నీ ఒకే తీరుగా లేవు. అంటే ఈ పొడుపు కథల్లోనూ కొన్నింటిలోనైనా ప్రాంతాలవారీగా తేడాలు కనిపిస్తాయి. అది అక్షరాల కూర్పులో కావచ్చును, అభివ్యక్తీ కరణలో కావచ్చును, ఊహాశక్తిలో కావచ్చును. అసలు పొడుపు కథలు ఏం చేస్తాయి? మన తెలివిని ప్రశ్నిస్తాయి? ప్రశ్నవల్ల జవాబుకోసం అన్వేషిస్తాము-ఆలోచిస్తాము. పొడుపు కథ అట్లా మన మేథాశక్తిని పొడిస్తే మనం సమాధానంతో దానికి విడుపు చెప్పాలె. ముఖ్యంగా పొడుపు కథలు పిల్లల్లో జిజ్ఞాసనూ, జ్ఞానపి పాసనూ, ఆలోచనాశక్తిని, చిత్రమైన ఉత్కంఠనూ కలిగిస్తాయి. పైగా ఇవి జానపదులవి కనుక సహజ ప్రతిభతో రాణిస్తాయి.
తెలుగు భాషలో ‘గట్టు కాలంగా బట్టలు ఆరవేస్తారు’ అని ఒక పొడుపు కథ ఉంది. గట్టు అంటే ఏమిటి? కొండలూ, కోనలూ కలిగిన అరణ్యం. కొండ గట్టు. ఇక్కడ తీరం అనే అర్థం రాదు గట్టుకి. ముఖ్యంగా పర్వతాలు అని అర్థం. ‘గుట్టలు కాలుతూ వుండగా బట్టలు ఆరవేస్తారు, ఏమిటవి?’ అని ప్రశ్నించినపుడు తెలివైన వాళ్ళు రొట్టెలు అని జవాబిస్తారు. గట్టు కాలుతూ వుండగా బట్టలు ఆరవేస్తే, నిజానికి ఆ బట్టలు ఏం కావాలి? కాలిపోవాలి. కానీ ఈ బట్టలు అట్లా దగ్ధమయ్యేవి కావు. అవి రొట్టెలు, పెనమూ, పెనం కింద మంటా గట్టు అన్నమాట. పెనమ్మీది రొట్టెలే బట్టలు. ఇంక దీనికి వివరణ అవసరం లేదు. మరి ఇదే పొడుపు కథ తెలంగాణలో ‘గుట్టలు కాలంగ బట్టలు ఎండేస్తరు’ అని వుంది. తెలుగు పొడుపు కథలోని గట్టు… బట్టలులో ఉన్న ప్రాస ‘గుట్టలు.. బట్టలు’లో ఉన్నా, గుట్టలు.. బట్టలులో సరిసమానమైన మాత్రలు వుండి ఒక రకమైన శబ్ధసౌందర్యాన్ని సాధించినట్లు అయ్యింది. తెలుగులో ఆరవేస్తారు అని వుంటే తెలంగాణలో ఎండేస్తరు అని వుంది.
‘పుట్టెడు శనగలలో ఒకటే రాయి’ అని మరొక పొడుపు కథ. ఇక్కడ శనగలు, చుక్కలు, రాయి, చంద్రుడు. ఈ పొడుపు తెలంగాణలో ‘పుట్టెడు శెనిగలల్ల ఒక్కటే బొడిగె రౌతు’ అని వుంది. ఇక్కడే ప్రత్యేకత. బొడిగె రౌతు అనడం ద్వారా అది పెద్ద రాయి అనే అర్థమేకాక ‘పుట్టెడు’లోని ‘పు’ అక్షరానికి, బొడిగెలోని ‘బొ’ అనే అక్షరానికి యతిమైత్రి కుదిరింది. ఇది పద్య పాదం కాకపోవచ్చు యతి కుదరడానికీ, ప్రాస కలవడానికీ. తెలంగాణలో మామూలు మాటల్లో కూడా ఈ యతి ప్రాసలు అతి ప్రయాసలేకుండానే అమరుతాయి. ఇక రాయికి బదులు ‘రౌతు’ అనడంలో ప్రత్యేకత వుంది. ప్రాదేశిక ముద్ర ఉంది. సహజాభివ్యక్తి వుంది.
తెలుగులో అంటే తెలంగాణేతర ప్రాంతాల్లో ‘అల్లుడు వచ్చాడు. చొక్కా విప్పాడు. బావిలో దూకాడు’ అని ఒక ప్రహేళిక ఉంది. ఆలోచిస్తే అరటిపండు అని తేలుతుంది. అరటిపండు అల్లుడు అన్నమాట. వాడు తన పైని తొక్క (అదే చొక్కా)ను వదిలించుకుని మన నోట్లో (బావిలో) దూకాడు అని అర్థం. ఇక మనం తినేస్తాం. ఇది తెలంగాణలో ‘బట్టలిప్పి బాయిల దుంకుతడు’ అని వుంది. అల్లుడూ గిల్లుడూ లేడిక్కడ. వాడు ఎవడైనా కావచ్చు. చొక్కాకు బదులు బట్టలు. విప్పాడుకు బదులు ఇప్పి. అక్కడ దూకాడంటే ఇక్కడ దుంకుతడు. బట్టలు.. బాయిల అనడంలో మళ్లీ యతిమైత్రి వుంది. దూకడానికి బదులు దుంకుతడు అనడంలో ఇందాకటి ప్రాంతీయ ముద్ర వుంది.
‘ఇల్లంతా నాకి మూలన కూర్చుంటుంది’ తెలుగు పొడుపు కథ. అంటే చీపురు అనే కదా అర్థం. చీపురుతో ఇల్లంతా శుభ్రం చేస్తాం. అట్లా శుభ్రం చేస్తుంటే ఇంటిని చీపురు నాకుతున్నట్లు ఉందట! ఇదీ పల్లీయుల ఊహాశబలత! ఇంటిని ఊడ్చడానికి బదులు నాకడం అనడం జానపదులు కళాత్మకంగా చెప్పిన కవిత్వం. అట్లా ఊడ్చి చివరికి ఓ మూలకు కూర్చుంటుంది. మరి తెలంగాణలో ఇది ఎట్లా వుంది? ‘నేలను/న్యాలెను నాకి మూలకు కూచుంటది’ అనే విధంగా ఉంది. ఇక్కడ మరలా ‘నేలను.. మూలకు’ అనడంలో ప్రాస నియమం పాటించినట్లయింది? పైగా నేల అనడంలో ఒక్క ఇల్లే అని కాదు, అది వాకిలీ కావచ్చును, పెరడూ అవచ్చును అన్న విస్తృతార్థమూ వుంది.
‘ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే’ ఇది తెలంగాణేతర పొడుపు కథ. కాస్త ఆలోచిస్తే ‘కుక్క’ అనే సమాధానం స్ఫురిస్తుంది. తెలంగాణలో ఈ పొడుపు కథ ‘కుక్కకు యిరాం (విరామం) లేదు, కూసుండ తీరది’ అని సామెత రూపంలో వుంది. ఇక దానిమ్మ పండ్ల గురించి తెలుగులో ‘పెట్టెనిండా పగడాలు-పెట్టెకు తాళం’ అని వుంటే, తెలంగాణలో ‘డబ్బ నిండ ముత్యాలు- డబ్బకు తాళం’ అని పొడుపు కథ. అదనంగా తెలంగాణలో ‘పాతగోడలల్ల పండ్లు ఇగిలిస్తది’ అని కూడా వుంది. ‘వేయవచ్చు గానీ తీయలేము, అది ఏంటి? అనే పొడుపు కథకు విడుపు ముగ్గు. తెలంగాణలో ‘ఎయ్యంగ ఎయ్యస్తది గని తియ్యంగ తియ్యలేం, అది ఏంది?’ అనే రూపంలో వుంది. మొత్తానికి కొన్ని పొడుపు కథల్లోనైనా తెలంగాణ ముద్ర కనిపించడం తెలంగాణ పొడుపు కథల ప్రత్యేకత. తెలంగాణ ప్రహేళికల్లో శబ్ద సౌందర్యమూ, వాద మాధుర్యాలకూ కారణం యతిప్రాసలు మొదలైనవి అని చెప్పుకోవచ్చు.