యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ హోదాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు డిసెంబరు 17న దేవాలయ అతిథి గృహంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులు డిసెంబరు 18నుంచే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.
యాదగిరిగుట్ట అభివృద్ధికి కావలసిన రెండువేల ఎకరాల భూముల సేకరణ విషయంతోపాటు, అక్కడ నిర్మించతలపెట్టిన ధర్మశాలలు, అభయారణ్యం, జింకలపార్కు, ఉద్యానవనాలు, కల్యాణ మంటపాలు, రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకూ రోప్‌వే, రాయగిరి చెరువు కట్టను మినీటాంక్‌ బండ్‌గా తీర్చిదిద్దడం వంటి పలు అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
ప్రస్తుతం 20 అడుగులుగా ఉన్న ఆలయ గాలిగోపురాన్ని మరో 19 అడుగుల ఎత్తు పెంచి, స్వర్ణతాపడం చేయాలని, గర్భగుడిని మరింతగా విస్తరించాలని, యాదగిరిగుట్టపై భారీ ఎత్తున ఆంజనేయస్వామి, గరుడ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు.
యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్‌ అథారిటీ సీఈవో కిషన్‌రావు, దేవాలయ ఈవో గీతారెడ్డి, ప్రధాన అర్చకులు నల్లం తీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, తదితరులతో ఆలయం లోపల, వెలుపల చేపట్టగల అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Other Updates