అర్జునుడు, ద్రోణాచార్యుల సంబంధం… ఇప్పటికీ ఎంతోమందిని స్ఫూర్తిమంతం చేస్తుంది… విశ్వామిత్రుడు, రాముడు… కలాం, అయ్యంగార్ల.. సచిన్, అచ్రెకర్‌ల గాఢమైన గురు శిష్య పరంపర గురించి మనకు… నిరంతరం మనల్ని చైతన్యవంతంగా నిలపడానికి.. ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి సరిపోయే ఇంధనాన్ని మన మస్తిష్కాలలో జనింపచేస్తుంది… గురువు శిష్యుల సంబంధం… టీచర్, విద్యార్థుల సంబంధాన్ని ఎవరైతే నిరంతరం కొనసాగిస్తారో… వాళ్ళ జీవితం చాలా అర్థవంతంగా, నిరంతరం కొత్తకొత్తగా అనుభూతి చెందుతూ వుంటుంది.
‘గూగుల్’ తల్లికాలంలో కూడా ఈ అనుబంధాలకు ఇంకా అవకాశం వుందా! అనే ప్రశ్న నా చుట్టూర వున్న అసంఖ్యాకులు వేస్తుంటారు…. ‘గూగుల్’ మీరడిగిన ప్రశ్నకు మాత్రమే తన దగ్గరవున్న సమాచారాన్ని ఇస్తుంది. మళ్ళీ మీరే వెతుక్కోవాలి… అదొక తెలివైన సమాచారాన్నిస్తుంది తప్ప ‘ఎమోషన్’ను అర్థం చేసుకోలేదు. ప్రజలకు, పిల్లలకు కావలసింది… ఎప్పుడు సమాచారం ఒక్కటే సరిపోదు. వాళ్ళ ‘ఎమోషన్’ను అర్థం చేసుకోవాలి. అది ఒక్క గురువు మాత్రమే విజ్ఞానాన్ని + దూరదృష్టి + ఉద్వేగాలను అర్థం చేసుకుని దానికి సరిపోయే మార్గదర్శనం చేయగలుగుతారు. ఏది అవసరమో.. ఎంత అవసరమో.. ఎప్పుడు అవసరమో చెప్పగల నేర్పును నిరంతరం టీచర్లలో వున్న అనుభవమే చెప్పగలుగుతుంది. మనము ఎంతో గొప్పగా ఎదగడానికి పనికివస్తుంది. పి.వి. సింధు ఒలింపిక్ విజేత.. గురువు పుల్లెల గోపీచంద్… తను ఆడేముందు మొబైల్ ఫోన్ వాడకుండా వుండడంవలన తను మొత్తంగా ‘గేమ్’పైనే ఫోకస్ పెట్టడంవలన ‘విజయం’ సిద్ధించిందని చెప్పాడు. వినడానికి చాలా చిన్న విషయంగానే అన్పించవచ్చుకానీ.. అది వారి అనుభవం, విజయం చెప్పిన సూత్రం.. గురువులతో తప్పకుండా సత్సంబంధాలను పాటించాలి. వారితో మన సంబంధం వారిని ‘మెంటార్’గా అంగీకరించాలి. అప్పుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ నేను కె.వి. రమణాచారి, ప్రభుత్వ సలహాదారు వారిని నా ‘మెంటార్’గా భావిస్తాను. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటాను… ఇప్పటి విద్యార్థులు పాటించాలి.. క్లాసురూమ్ టీచింగ్‌వేరు ‘లైఫ్ క్లాస్ రూమ్’ గైడెన్స్ టీచింగ్ వేరు… విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు తప్పకుండా ఎవరైనా ఒక టీచర్‌ను (లెక్చరర్, ప్రొఫెసర్ మొ||) మెంటార్‌గా అంగీకరించి వారితో మీ సమస్యలను చర్చించి సరియైన సలహాలను పాటించడం నేర్చుకోండి. లెక్చరర్ సలహాలు, సూచనలు, సంప్రదింపులు సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి సాయపడతాయి. సక్సెస్‌కు చక్కటి సాధనాలవుతాయి.
చాలామంది అభ్యర్థులు టీచర్లకు ఎందుకు దూరంగా వుంటారు?
సబ్జెక్టుపై పట్టులేని వాళ్ళు… టీచర్లను సంప్రదిస్తే.. వాళ్ళను విమర్శిస్తారేమో! అనే భయం
నేను తెలివైన వ్యక్తిని కాను, నాతో మాట్లాడరేమో!
నేను ఆకర్షణీయంగా ఉండను… నాతో సంబంధం కొనసాగించరేమో
టీచర్లతో ఎందుకు సంబంధం, ఏం అవసరం… దాని గురించి అవగాహన లేనివాళ్ళు
సబ్జెక్ట్ సరిగ్గా చెప్పలేని వాళ్ళతో ఎందుకు సంబంధం కొనసాగించడం అనవసరమని అనుకోవడం…
(సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చుగాని కొన్నివేల మంది విద్యార్థులతో అనుబంధం, కొన్ని సంవత్సరాల అనుభవం..
ఇవ్వన్ని ఎన్నో విలువైన సూచనలు వచ్చే అవకాశం)
టీచర్లతో అనుబంధం. మిగతా అభ్యర్థులు… ‘కాకాపడుతున్నాడు’ అంటారేమో! అనే భయం
కొందరి టీచర్ల ప్రవర్తన, భాష సానుకూలంగా అనిపించకపోవడం
టీచర్లకు దగ్గరైతే…
పోటీ పరీక్షల్లోకానీ, ఆటల్లోకానీ… చదువులో ప్రథమస్థానం సాధించిన ఎవరినైనా చూడండి, వారి ఇంటర్వ్యూలు చదవండి.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చెప్పే మాట ‘అధ్యాపకుల ప్రోత్సాహం, సూచనలతో” అంటారు.. ఇది అక్షరాల వారి అనుభవం…
సబ్జెక్ట్స్ క్లిష్టంగా వున్నప్పుడు.. ఒకటికి రెండుసార్లు అడిగి చెప్పించుకునే అవకాశం ఉంటుంది.
ఏ సమస్యనైనా.. ధైర్యంగా అడిగే అవకాశం మీకు మాత్రమే దక్కుతుంది.
మనకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు ధైర్యం తగ్గుతున్నప్పుడు వారు చెప్పే విషయాలు.. పద్ధతులు ఆత్మవిశ్వాసం మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎంతో అవసరం.
టీచర్లతో పలు అంశాలు చర్చించడం వలన మనపై మనకు ఎంతో విశ్వాసం, పట్టుదల.. ఎన్నో కొత్త విషయాలు బోధపడతాయి.
వారిచ్చే సలహాలు, ఎక్కడా పుస్తకాలలో దొరకవు.. అవి వారి అనుభవంలో వున్న ఆచరించదగే విషయాలు.. అవి మీకు మాత్రమే స్వంతమౌతాయి.
టీచర్లు.. మీరు అడిగిన సమస్యలపట్ల వారు చూపే శ్రద్ధ… వాటిని విశ్లేషించే తీరు, మీరు కూడా అలా మాట్లాడడానికి, విశ్లేషించడానికి ఒక అవకాశం కలుగుతుంది…
ఇది మీకు మాత్రమే కలిగే గొప్ప జీవితావకాశం.
నేను ఇప్పటికీ ప్రొఫెషనల్ సలహాలకోసం ప్రొఫెసర్ నిరంజన్‌రెడ్డిని, డాక్టర్ భాస్కర్‌నాయుడుని సంప్రదిస్తూనే వుంటాను.
అనుబంధం ఏర్పరచుకోవడం ఎలా?
క్లాసురూంలో పాఠాన్ని శ్రద్ధగా వినడం, అర్థమైన విషయాలపట్ల తలాడించడం
అర్థం అయిన పాఠ్యాంశాలపట్ల, మీ సంతృప్తిని… టీచర్లకు తెలియజేయాలి. అది టీచర్లకు ఇంకా బాధ్యతతో మీకు పాఠాలు చెప్పాలని నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తుంది.
ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోండి, వాటిని విపులీకరించడానికి వివిధ పుస్తకాలను చదవండి… నోట్స్ వ్రాసుకొని టీచర్లతో సలహాలు తీసుకోండి.. మీకు, టీచర్‌కు ఒక స్నేహపూర్వక అనుబంధం ఏర్పడుతుంది.
క్లాసుకు వచ్చేముందు ‘పాఠ్యాంశాన్ని’ నేర్చుకోండి.. ఒక్కసారి క్లాసులో జరుగబోయే పాఠం గురించి చూసుకొని రండి.. అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. క్లాసు జరుగుతున్నప్పుడు… నేను నేర్చుకోవడానికి వస్తున్నాను అనే ‘ఆటో సజెషన్’ ఇచ్చుకోండి… తప్పకుండా ఆ రోజు మీరు ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారు.
చదువు నేర్చుకునే వారిపట్ల టీచర్లు ఎప్పుడు ఉత్సాహంగానే వుంటారు.. సహాయం చెయ్యాలనే ఉత్సాహం ఉంటుంది. అదే… ‘టీచర్-స్టూడెంట్’ పరంపర.. అదొక జీవ నదిలాంటిది… కొన్నివేల సంవత్సరాలనుంచి కొనసాగుతూనే ఉంటుంది. ఎంతోమందిని స్ఫూర్తిమంతంగా తయారు చేస్తూనే వుంటుంది… ఆల్ ది బెస్ట్…
డాక్టర్ సి. వీరేందర్