అత్యంత ప్రాచీనకాలం నుంచి శైవ క్షేత్రాలకు ప్రసిధ్ధి గాంచిన నల్లమల కొండలే భూలోక కైలాసమన్నది భక్తుల విశ్వాసం. దేశంలోని జీవనదులలో ఒకటైన పవిత్ర కృష్ణవేణి ఈ పర్వత సానువులలోంచి ప్రవహిస్తోంది. దీనితో నల్లమల కొండలలో క్రీస్తుపూర్వానికే అనేక శైవక్షేత్రాలు వెలిశాయి.అనేక కోటలకు, ప్రాచీన ఆదివాసి జాతి, తెలుగు మాట్లాడే చెంచు తెగకు ఈ అడవిప్రాంతం అలవాలం కావడంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ అడవులు, కొండలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. దేశంలో హిమాలయ పర్వతాల తర్వాత నల్లమల కొండలు అతి పవిత్రమన్నది భక్తుల విశ్వాసం.
ఇంతటి ప్రాధాన్యం గల అడవుల్లో మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్ గుట్టల్లో ఒక వింత లోయ ఉన్నది. దాన్ని స్థానికులు లొద్ది, అని గుండం అని వ్యవహరిస్తారు. ఈప్రాంతంలో వెలిసిన మల్లన్న స్వామి పేరుమీద లొద్దిమల్లయ్య గుడి అని కూడా ఇక్కడి దేవాలయాన్ని పిలుస్తారు.ఈ గిరి సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తున ఉండటంతో వాతావరణం చల్లగా ఉంటుంది.హైదరాబాద్కు 145 కి.మీ, శ్రీశైలానికి 60 కి.మీల దూరంలో ఉంటుంది.
హైదరాబాద్ శ్రీశైలం రోడ్డులో అటవీ కార్యాలయం నుంచి ఒక పావు కిలోమీటర్ దూరం నడవగానే ఒక కిలోమీటరు లోతైన లోయలు,కొండలు, అడవుల మధ్య అందంగా కనిపిస్తుంది. ఇంతలోతైన లోయ కావడంతో పైనుంచి చూస్తే కళ్లు తిరగడం ఖాయం. కిందికి దిగిన తర్వాత పైకి ఎక్క గలుగుతామా అని అనుమానం రావడం ఖాయం`పైనుంచి అరగంట పయనించాక లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. అక్కడికి చేరుకున్నాక మనకు అరకిలోమీటరు లోతైన కుండ అడుగున ఉన్న అనుభూతి కలుగుతుంది. ధారవాగు నుంచి తూర్పు వైపుకు తిరుగగానే మనకొక అద్భుతమైన విశాలమైన గుహ కనిపిస్తుంది. అరకిలోమీటరు ఎత్తైన గుట్ట నుంచి గొడుగు లాగా ఒక దరి పడమటి వైపుకు పొడుచు కొచ్చినట్టు ఉంటుంది. ఆ దరికింద రెండువేల మంది వరకు మెసల వచ్చు. ఆ దరి ముందట విశాలమైన గుండం ఉంది. గుండం ఒక పెద్ద బండరాయి మీద ఏర్పడడంతో వందల మంది అందులో స్నానం చేసినా అందులోని నీళ్లు మురికి కావు.
మల్లిఖార్జున లింగం: గుండంలో స్నానం చేసి ఉత్తరం వైపు సాగితే అక్కడే మల్లికార్జున ఆలయం దర్శనమిస్తుంది. అక్కడికి త్వరగా చేరుకోవడానికి వీలుగా అచ్చంపేట పట్టణ ప్రముఖులు 1953లో రైలు పట్టాలతో చేసిన 20 మెట్ల నిచ్చెనను గుట్ట నుంచి గుహలోకి జారవేశారు.
గుహలో గుహ: సాధారణంగా భక్తులందరూ లింగస్వామిని దర్శించుకుని వెనుతిరిగి వెళ్తారు. కాని అక్కడి వింత ప్రకృతిని కొద్దిసేపు ఆస్వాదిద్దామని చుట్టూ చూస్తూంటే స్వామికి ఉత్తరాన మరో గుహ కనిపిస్తుంది. అందులోకి ధైర్యంగా ముందుకెళ్లాలి. మరో చీకటి గుహ కనిపిస్తుంది. సెల్ ఫోను లైటు వేసుకుని ముందుకు వెళితే చీకటి గుహలో దారి కనిపిస్తుంది. అక్కడకొంత వెలుతురులో ఒక అద్భుతం కనిపిస్తుంది. అది మరోశివలింగం.
చారిత్రిక ప్రశస్తి: ఈ భూ ప్రపంచం మీద తొట్టతొలి సూక్ష్మజీవులు మూడున్నర వందల కోట్ల సంవత్సరాల కింద జీవించాయని తెలిపే ఆనవాళ్లు ఆస్ట్రేలియాలో లభించాయి. మన దేశంలో కర్ణాటకలోని షిమోగా జిల్లాలో 260 కోట్ల సంవత్స రాల కింద సాధారణరాళ్లతో పాటు రాతి పొరలను గుర్తించారు. అంతే పురాతనమైన గుహ ఈ లొద్ది గుహ. అందుకు నిదర్శనంగా త్రిభుజాకారంలో ఉన్న రాతి ముక్క ఒకటి దేవుడికి సమీపంలోనే ఉన్నది. దాని మీద జీవావశేషాలను స్థానికులు బ్రహ్మరాత అంటారు.సూక్ష్మజీవులే కాదు, ఆదిమానవులు గుహల్లో, అడవుల్లో తలదాచు కున్నారని తెలియజేసే ఆనవాళ్లైన వారి రాతి పనిముట్లు ఈ గుహ చుట్టు పక్కల పదేసి ప్రాంతాలలో లభించాయి. అటువంటి పనిముట్లను పురావస్తు నిపుణులు సేకరించి ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం శ్రీశైలం ప్రాంగణానికి తరలించారు.
లొద్దికి తూర్పున కొన్ని కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల పొడవు, వెడల్పులతో నిర్మించబడిన చంద్రగుప్తి పట్టణం శిథిలాలున్నాయి. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని కాలానిది. అంటే ( క్రి.పూ. 300) నాటిది. మరికొందరి ప్రకారం విక్రమాదిత్య బిరుదాంకితుడైన రెండవ చంద్ర గుప్తుని కాలానిది (క్రీ.పూ400). శ్రీశైలఖండం, పండితారాధ్య చరిత్ర, శ్రీపర్వత పురాణం మొదలైన ప్రాచీన గ్రంథాలలో వర్ణించిన‘గుప్త మల్లి ఖార్జున క్షేత్రం ’ ఇదేనని కొందరు పండితుల అభిప్రాయం. ఇక్కడికి 15 కి.మీ.ల దూరంలో శ్రీశైలం ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమామహేశ్వరాలయం ఉంది. లొద్దిలోని లోపలి గుహలోని లింగానికి, గుప్తమహేశ్వరాలయంలోని లింగానికి పోలికలున్నాయి. రెండూ చతురస్రాకార పానవట్టంలో ఉన్నాయి. రెండిరటికీ ఊర్ధ్వ పుండ్రాలు
( నామాలు- మధ్యది ఎత్తుగా) ఉన్నాయి.
కృష్ణానది ఎడమ ఒడ్డున ఉన్న మహబూబ్ నగర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో పైన విశేష పరిశోధన (తవ్వకాలు) చేసిన ఐ.కె శర్మ , డి.ఎల్.ఎన్.శాస్త్రి తదితర చరిత్రకారులు ఈ ప్రాంతంలో మలి శాతవాహనుల కాలం ( క్రీ. శ 1,2 శతాబ్దాలు) నాటికే కృష్ణాతీరం పొడవునా ఇటుకలతో నిర్మించిన శివాలయాలు వెలిశాయని నిర్థారించారు. ఇక్కడి మల్లిఖార్జునా లయం కూడా ప్రాచీన ఇటుకలతో నిర్మించినదే. లొద్ది వైపు ప్రారంభమయ్యే దారి మధ్యలో కూడా ప్రాచీన ఇటుక నిర్మాణాలున్నాయి.. ఐతే వాటి సైజును రికార్డు చేస్తే ఎన్నో ఆసక్తికరమైన చారిత్రక విశేషాలు వెల్లడవుతాయి. క్రీస్తు శకారంభ కాలం నాటి శివలింగాలు పురుషలింగాలను పోలి ఎత్తుగా ఉండేవి. ఇలాంటి లింగాలే మనకు చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో . విశాఖజిల్లాలోని శంకరం దగ్గర కనిసిస్తాయి. అలాంటి ఎత్తైన లింగమే ఇక్కడి గుహలోని మరో గుహలో ఉన్నది. ఇక్కడికి సలేశ్వరం ఆలయం ముందరి గోడపై ‘ సర్వే శ్వరం అని రాసి ఉంది. కనుక శ్రీపర్వత పురాణంలో సర్వే శ్వర తీర్థంలో కలిపి పేర్కొన్న పుష్కరతీర్థం ఈ లొద్దిలోని గుండమే. ఇక్కడి గుండంలోని బండపై నిలబడి వాటర్ ఫాల్ (జలధారల) కింద నిల్చుని ఉంటే ఆ నిలుచున్న వాళ్లు పాపాత్ములైతే ఆ జలధారలు పక్కకు తొలగిపోతాయని ఆ పురాణంలోని ఈ క్రింది పద్యంలో ఉన్నది..
మనుజ శ్రేణులు తానమాడను శిలామధ్యంబుపై నిల్చినన్
ఘన దుర్కర్మఠులైన పై బడక త ద్గ్రాహొప కంఠంబునన్
జన లంఘించి తొలంగు, పుణ్యుల పయిన్ సంధిల్ల వర్షించు ని
ద్దిన కృత్యంబు పవిత్ర ‘పుష్కర మహా తీర్థాంబు’ ధారావళుల్.
ఇంతటి పవిత్రత, ప్రకృతి సౌందర్యం కలిగిన లొద్ది మల్లన్న గుడికి ఏటేటా భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతున్నది. శివభక్తులు, సాహస పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, పరిశోథకులు తప్పకుండా దర్శించవలిసిన స్థలం లొద్ది.