నిలువ నీడలేక, ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ పూరిపాకల్లో, పరాయి పంచలలో తలదాచుకున్న నిర్భాగ్యులు సయితం నేడు ఉన్నవారితో సమానంగా రెండు పడక గదుల ఇళ్ళకి యజమానులవుతున్నారు. అదికూడా ప్రభుత్వమే సర్వఖర్చులు భరించి, సకల సౌకర్యాలతో ఉచితంగా అందిస్తుందని ఎవరైనా ఊహించారా? కలత నిద్రలోనైనా కలగన్నారా?
కానీ, యావత్ దేశానికే ఆదర్శంగా తెలంగాణ స్వరాష్ట్రంలోనే ఇది సాకారమవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దత్తత గ్రామాలైన సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేటలలో గతనెలలో జరిగిన సామూహిక గృహప్రవేశాలు. ఈ రెండు గ్రామాలలో 600 డబుల్ బెడ్ రూం ఇళ్ళను సకల సదుపాయాలతో ఏకకాలంలో నిర్మించి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. చక్కటిరోడ్లు, రోడ్లకు ఇరువైపులా పచ్చదనం, మిరుమిట్లు గొలిపే వీధిలైట్లు, మిషన్ భగీరథ పథకం క్రింద ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, ఇంటర్ నెట్ వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. కన్నులపండుగగా జరిగిన ఈ గృహప్రవేశ వేడుకలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా పాల్గొని ఈ రెండు గ్రామాలను నగదురహిత లావాదేవీల గ్రామాలుగా కూడా ప్రకటించడం మరో విశేషం.
‘ఇలాటి ఇళ్ళు మాకూ ఉంటే ఎంతబాగు’ అని ఇతరులు సయితం కలలుగనే రీతిలో రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం సాగుతోంది. గతంలో బలహీనవర్గాలకు నిర్మించిన పిచ్చుకగూళ్ళవంటి ఇరుకు ఇళ్ళకు భిన్నంగా, నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శ్రీకారం చుట్టారు. రెండు,మూడు తరాలవరకూ చింతలేకుండా, ముందుతరాలవారు అవసరమైతే ఇంటిపైభాగంలో మరో ఇళ్ళు నిర్మించుకొనేవీలు కల్పిస్తూ, పిల్లర్లతోనే ఇళ్ళను నిర్మించాలని నిర్ణయించడం ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 2లక్షల 60 వేల గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. 1,217 గృహాల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు నివాసం వుంటున్నారు. మరో 9,588 ఇళ్ళు నిర్మాణంలో వుండగా, మరికొన్నింటికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ గృహాల నిర్మాణానికి అవసరమైన రూ.17,660 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం సిద్ధంగా వుంచింది. వీటిని పటిష్టంగా, పారదర్శకంగా నిర్మించడానికి, నిరుపేదల ఇంటికల సాకారం చేసేందుకు చక్కటి ప్రణాళికతో ప్రభుత్వం ముందడుగువేస్తోంది. కాంట్రాక్టర్లకు ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా సరఫరా చేయడం, సిమెంటును మార్కెట్ ధరకన్నా తక్కువకు అందించడం వంటి చర్యలు చేపట్టింది.
ఇంతేకాదు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన వేలాది గృహాల నిర్మాణం పూర్తికాకపోగా, లబ్ధిదారులు అప్పులపాలై అనేక అవమానాలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వారికి ఉపశమనం కల్గిస్తూ వరాలను ప్రకటించారు. అసంపూర్తిగా మిగిలిన గృనిర్మాణాలను పూర్తిచేయడంతోపాటు, 1983 నుంచి 2014 వరకూ బలహీనవర్గాల గృహనిర్మాణ లబ్ధిదారులు తిరిగి చెల్లించవలసి 3920 కోట్ల రూపాయల బకాయిలను రద్దుచే స్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది నిరుపేదలకు నిజమైన నూతన సంవత్సర కానుక.
ఈ నూతన సంవత్సర శుభవేళ రాష్ట్రం అన్నిరంగాలలో మరింత పురోగతి సాధించాలని కోరుకుందాం.