గృహ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలిరాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందేలా చూడడంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు టీమ్‌ స్పిరిట్‌తో పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. ఎంసిహెచ్‌ఆర్‌డిలో అక్టోబర్‌ 13న జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జాయింట్‌ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు, ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, డిజిపి అనురాగ్‌శర్మ, పోలీస్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభ ఉపన్యాసం చేశారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జరిగే గృహనిర్మాణ కార్యక్రమం ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా, నిరుపేదలకు రెండు తరాలకు పనికి వచ్చే విధంగా ఉండాలని చెప్పారు. గతంలో పేదలకు గృహనిర్మాణం అనగానే, ఊరికి దూరంగా విసిరేసినట్లు నిర్మించారని, డబ్బాల్లాంటి ఇండ్లలో ఎవరూ నివాసం ఉండడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గృహనిర్మాణం పేదల ఆత్మ గౌరవం కాపాడేలా ఉండాలన్నారు. ఈసారి పైలెట్‌ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 400 ఇండ్లు కట్టాలని, వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్యను పెంచుతూ పోవాలని చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమంలో కలెక్టర్లు చాలా కీలకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఒక కుటుంబానికి ప్రభుత్వం ఒకసారి ఇల్లు కట్టించిందంటేే, రెండు తరాల వరకు ఉపయోగపడాలన్నారు. అందుకే ఎక్కువ వ్యయం అవుతున్నా రెండు బెడ్‌రూమ్‌లు, హాల్‌, కిచెన్‌, రెండు బాత్‌రూములు ఉండేలా డిజైన్లు రూపొందించాలన్నారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ఎర్రవెల్లి గ్రామంలో నిర్మిస్తున్న గృహ నిర్మాణాల నమూనాలను ఈ సందర్భంగా అధికారులకు చూపించారు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల ఇండ్లు కడదాం. గ్రామీణ ప్రాంతాల్లో 36 వేలు, పట్టణ ప్రాంతాల్లో 24 వేల ఇండ్లు కడదాం. ఇండ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ జరపాలి. ప్రతీ నియోజకవర్గంలో 50 శాతం ఎమ్మెల్యే, 50 శాతం జిల్లా మంత్రి మంజూరు చేస్తారు. కాలనీలుగా గృహనిర్మాణం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వంద శాతం ప్రభుత్వ ఖర్చుతోనే ఇంటి నిర్మాణం చేస్తాం.”

గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల నాలుగు వేలు, పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షల 30 వేల ఖర్చు ఒక్కో ఇంటికి అవుతుంది” అన్నారు. గృహాల నిర్మాణం కోసం ఇసుక తెచ్చుకోవడానికి సులభంగా అనుమతి వచ్చేలా చూడాలని, పేదల గృహ నిర్మాణం విషయంలో నిబంధనలు నెపంగా చూపి, పని ఆపవద్దని, అవసరమైతే మినహాయింపులు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రభుత్వ పరంగా ఇప్పటికే మంజూరైన ఇండ్ల పట్టాలు, గృహ నిర్మాణం అవసరమైన వారి వివరాలు సేకరించాలి. మండల కేంద్రాలు, పట్టణాల పరిధిలో 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమిని వాడవద్దనే నిబంధనను సవరిస్తాం. ప్రభుత్వ భూమిని గృహ నిర్మాణం కోసం ఉపయోగించాలి. గృహ నిర్మాణంలో ఎస్టీలు, ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలి”.

గృహ నిర్మాణ కార్యక్రమం గతంలో అవినీతికి మారుపేరుగా ఉంది. ఒకే ఏడాదిలో 5 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 300 మంది అధికారులు సస్పెండ్‌ అయ్యారు. కొందరు జైలుకెళ్లారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు రావద్దు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా శిక్షిస్తాం. అందుకే చాలా జాగ్రత్తగా పనిచేయాలి”

లబ్ధిదారుడిని ఎంపిక చేసే విషయంలో అర్హులనే గుర్తించాలి. ఈ విషయంలో తహసిల్దార్లు ఇచ్చే సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండాలి. తప్పు దొర్లితే శిక్ష తప్పదు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సూపర్‌చెక్‌ చేయాలి”

ఈ ఏడాది ఇండ్ల నిర్మాణంలో వచ్చే అనుభవాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో మరింత పకడ్బందీగా పథకాన్ని అమలు చేయాలన్నారు.

ప్రాజెక్టుల కోసం భూసేకరణ

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూమిని సేకరించే విషయంలో కలెక్టర్లు బాగా చొరవ చూపాలని ముఖ్యమంత్రి చెప్పారు. భూసేకరణలో జాప్యం నివారించడం కోసం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నదన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు చాలా ఆలస్యంగా పూర్తి కావడానికి ప్రధాన కారణం భూసేకరణ అని సిఎం చెప్పారు.

భూ సేకరణ కోసం అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు నీటి పారుదల ప్రాజెక్టులపై ఎంతో ఆశతో ఉన్నారని, వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతుల భూమికి, ఇంటికి, పశువుల కొట్టానికి వెలకట్టి ఒకేసారి డబ్బులు చెల్లించి, భూ సేకరణ జరపాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయిస్తున్నందున డబ్బుల సమస్య లేదన్నారు.

ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే డబ్బులు (5 లక్షల 4 వేలు) ఇవ్వాలన్నారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ప్రాజెక్టుల కోసం భూ సేకరణ వేగంగా జరగడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

Other Updates