sheeps

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు గొర్రెల పెంపకమే వృత్తిగాగల గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలను అందించేందుకు పథకం రూపొందించింది. ఇందుకు అవసరమైన నిధులను కూడా బడ్జెట్లో కేటాయించింది. పథకం అమలుకు నియమ నిబంధనలతోపాటు, అవసరమైన చర్యలను తీసుకొంటోంది.

ఈ సందర్భంగా గొర్రెల పెంపకం వల్ల ఒనగూడే ప్రయోజనాలు, తీసుకోవలసిన మెలకువలగురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.

ఉన్ని, మాంసం, పాలు, చర్మాలు, ఎరువు ఇలా బహుళ ప్రయోజనాలను అందించే గొర్రెల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా నీటి వనరులు, వర్షపాతం తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉంటుంది. ఇవి గొర్రెల కాపరులకు నమ్మకమైన ఆదాయ వనరుగా ఉంటాయి.

ఇతర పశుగణాలతో పోల్చినప్పుడు గొర్రెలను ఉంచడానికి ఖరీదైన భవనాలు అవసరం లేదు, తక్కువ మానవ వనరులు సరిపోతాయి. తొలి విడత మంద ఏర్పాటు కూడా ఇతర పశుగణాలతో పోల్చినప్పుడు చాలాచౌక. మంద చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇతర జంతువులతో పోల్చినప్పుడు గొర్రెలు అనేకరకాల మొక్కలను తింటాయి. కనుక ఇవి చక్కటి కలుపు మొక్కల నాశకాలుగా పని చేస్తాయి. గొర్రెల పెదవుల నిర్మాణ విశిష్టత వల్ల పంట కోత, నూర్పిడి సమయంలో పొలంలో రాలిపడిపోయిన గింజలను కూడా తినగలవు. దీనివల్ల వృధా అయిన పంట గింజలు విలువైన పశుగ్రాసంగా మారతాయి.

ఉన్ని, మాంసం, ఎరువుల ఉత్పత్తి గొర్రెల కాపరులకు మూడు రకాల ఆదాయ వనరులను సమకూరుస్తుంది.

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మాంసం ఉత్పత్తికి మెరుగైన జాతుల అభివృద్ధికి చాలా మంచి అవకాశాలున్నాయి.

మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 3.50 లక్షల మంది రైతులు ప్రస్తుతం గొర్రెల పెంపకంలో ఉన్నారు. గ్రామ స్థాయిలో 3380 ప్రాథమిక స్థాయి గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో 9 జిల్లా గొర్రెల ఉత్పత్తి దారుల సహకార యూనియన్లు, రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సమన్వయ సంస్థగా తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య గొర్రెల పెంప కం రంగంలోని రైతులకు వివిధ రకాల సేవలందిస్తున్నాయి.

సహకార సంఘాలలో సభ్యత్వం పారదర్శకంగా, ప్రజాస్వామికంగా ఉంటుంది కనుక 5 లేదా 6 గొర్రెలను కలిగి ఉండి, 18 సంవత్సరాల వయసు దాటిన వారు ప్రాథమిక స్థాయి గొర్రెల పెంపకందారుల సంఘంలో సభ్యులు కావచ్చు. కనీసం 11 మంది సభ్యులతో మీరే కొత్త గొర్రెల పెంపకందారుల సహకార సంఘం స్థాపించుకోవచ్చు. అలా స్థాపించు కొనేందుకు పూర్తి వివరాల కోసం మీ ప్రాంతపు పశువైద్యుని సంప్రదించండి.

ప్రాథమికస్థాయి గొర్రెల కాపరుల సహకార సంఘాలలో సభ్యులు కావడం వల్ల ప్రయోజనాలు

ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత

జాతీయ సహకార అభివద్ధి సమాఖ్య నుంచి రాయితీతో కూడిన రుణసౌకర్యం

సమష్టి భూయాజమాన్యం

సమష్టి జీవాల ఆరోగ్య యాజమాన్యం

సమష్టి మార్కెట్‌ సౌకర్య యాజమాన్యం

ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం

సమాఖ్య ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలు

75శాతం రాయితీతో కూడిన 20ం1 గొర్రెల యూనిట్టు పథకం

ఈ పథకం కింద 20ం1 గొర్రెల యూనిట్టు సరఫరా చేయబడుతుంది

20 గొర్రె పిల్లలను , ఒక గొర్రె పొట్టేలు పిల్లను ఒక యూనిట్టుగా సరఫరా చేస్తారు.

గొర్రెల బీమా:

66 1/3 శాతం రాయితీతో గొర్రెల బీమా అందించబడుతోంది.

చనిపోయిన గొర్రెకు రూ . 3000, చనిపోయిన పొట్టేలుకు రూ .1500 చొప్పున బీమా పరిహారం ఇస్తారు.

గొర్రెల పెంపకందారు మరణిస్తే వారసులకు రూ . 1.00 లక్ష పరిహారం ఇస్తారు.

ఏడాదికి రెండుసార్లు ఉచితంగా నట్టల వ్యాధి నివారణ టీకాలు వేస్తారు.

అమలులో ఉన్న గొర్రెల మేపు పద్ధతులు

సాంద్ర మేపు పద్ధతి: ఇది ప్రాచీనకాలం నుంచి అమలులో ఉన్న మేపు పద్ధతి. ఈ పద్ధతిలో రైతు గొర్రెలను పశుగ్రాసం అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాలలో మేపుతాడు. ఆహారం కోసం జీవాలు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అందువల్ల అవి వేగంగా బరువు పెరగలేవు, తేలికగా రోగాల బారిన పడతాయి.

అర్థ సాంద్ర పద్ధతి : ఈ పద్ధతిలో రైతు గొర్రెలను పశుగ్రాసం అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాలలో మేపడమే కాక వాటికి ఒక పాక కింద ఆవాసం కల్పించి, పాకలో కూడా పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచుతాడు. ఇది సాంద్ర మేపు పద్ధతి కన్న మెరుగైన పద్ధతి.

పూర్తి సాంద్ర పద్ధతి (శూన్య మేపు పద్ధతి): ఈ పద్ధతిలో రైతులు గొర్రెలను బహిరంగ ప్రదేశాలలో మేపరు. పూర్తిగా పాకలోనే ఉంచి, ప్రశుగ్రాసాన్ని, శుభ్రమైన నీటిని పాకలోనే అందిస్తారు. సక్రమమైన వైద్య జాగ్రత్తలు, గొర్రెపిల్లల సంరక్షణ తదితర చర్యలు చేపడతారు. ఈ పద్ధతి అత్యుత్తమమైనది, లాభదాయ కమైనది. దొంగతనాల నుంచి, వ్యాధుల నుంచి రక్షణ పొందడం, సులువుగా టీకాలు వేయడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

గొర్రెల నివాసం: సాధారణంగా గొర్రెలకు విస్తృతమైన నివాస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని కనీస స్థాయి సౌకర్యాలు ముఖ్యంగా ఎండ, వాన, ఈదురుగాలులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నుంచి, వేట జంతువుల నుంచి రక్షణ కల్పించడం ద్వారా ఉత్పాదకత పెంచవచ్చు. గొర్రెల పాకను వెదురు కర్రలతో నిర్మించి, గోనెసంచులతో లేదా ఇతర తేలికపాటి పదార్థాలతో చుట్టూ ఆచ్ఛాదన ఏర్పాటు చేయవచ్చు. సిమెంటు రేకులతో పైకప్పు నిర్మించవచ్చు, లేదా తాటాకులు, తదితర పదార్థాలతో చేసి దోమతెరలతో రక్షణ కల్పించిన పైకప్పు అయినా సరిపోతుంది. ఉత్తమ మైన, పొదుపైన షెడ్లనిర్మాణానికి ఈ కింది వెబ్‌ సైటును సందర్శించండి

http://www.youtube.com/user/
sheepngoatbreeding

మంచి లక్షణాలు లేని జీవాల తొలగింపు: మంచి మందను అభివృద్ధి చేయడానికి తగిన ప్రమాణాలు లేని గొర్రెల తొలగింపు చాలా ముఖ్యమైన పని. మంచి లక్షణాలు లేని జీవాల నుంచి ఇతర జీవాలకు నష్టం జరగకుండా, కేవలం ఉత్తమ లక్షణాలు గల జాతి మాత్రమే కొనసాగేలా ఇది సహాయపడుతుంది. మంచి మంద అభివృద్ధికి ప్రతి యేటా మందలో ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి, ఎదుగుదలపరంగా హీనంగా ఉన్న 10-20 శాతం గొర్రెలను తొలగించాలి. మందలో పుట్టిన గొర్రెపిల్లలతో ఆ ఖాళీని భర్తీ చేసి మంద పరిమాణం తగ్గకుండా చూసుకోవాలి.

గొర్రెలను గుర్తించడం ఎలా: గొర్రెలను గుర్తించడానికి అవి పిల్లలుగా ఉన్నప్పుడు వాటి చెవులకు రంధ్రాలు చేయడం సాధారణంగా గొర్రెల కాపరులు చేసే పని. పచ్చబొట్లు పొడిపించడం కూడా మంచి పద్ధతే. కానీ ఖరీదైనది. అంకెలు లేదా అక్షరాలతో కూడిన ప్లాస్టిక్‌, లోహపు బిళ్లలను చెవులకు రివిట్‌ చేయడం చాలా అనుకూలమైన పద్ధతే కానీ, కొద్దిగా ఖరీదైనదే కాక, బిళ్లలు చిన్నవిగా ఉండే దేశవాళీ గొర్రెల చెవులకు బరువుగా కూడా ఉంటాయి. గొర్రెల మెడ చుట్టూ కట్టిన నైలాన్‌ తాడుకు ప్లాస్టిక్‌ నంబరు బిళ్ల వేలాడేయడం అనే పద్ధతిని మేం ప్రతిపాదిస్తున్నాము.

ఆరోగ్య నిర్వహణ: పశువైద్యుల సలహాకు అనుగుణంగా ఆరోగ్య నిర్వహణా కాలెండరును అనుసరించడం ద్వారా మంద ఆరోగ్యాన్ని మెరుగ్గా సంరక్షించుకోవచ్చు. గొర్రెలకు తాగు నీరు , గొర్రెలను కడగడానికి నీరు, పశుగ్రాస క్షేత్రానికి సాగునీరు అవసరమౌతుంది. కావున తగు నీటి ఏర్పాటు చెయ్యాలి.

పశుగ్రాస రకాలు

స్వల్పకాలిక పశుగ్రాస రకాలు: పశుగ్రాస జొన్న, మొక్కజొన్న, న్యూట్రిఫీడ్‌

బహువార్షిక పశుగ్రాస రకాలు: కో3, కో4 , కో5 , నేపియర్‌ హైబ్రిడ్‌, గినియా గ్రాస్‌, పారాగ్రాస్‌,

పశుగ్రాస పప్పుధాన్యాలు: స్టైలో, హెడ్చ్జ్‌ లూసర్న్‌, పశుగ్రాస వేరుశనగ

మేకల పెంపకం: మానవులు ప్రాచీన కాలం నుంచీ ఉన్న పెంపుడు జంతువులలో మేక కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మేకలను వాటి పాలు, మాంసం, ఉన్ని, చర్మాల కోసం పెంచుతున్నారు. భారతదేశంలో మేకను పేదవాడి ఆవుగా పిలుస్తారు. ఇవి మెట్ట వ్యవసాయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆవులు, గేదెల పెంపకానికి అనుకూలంకాని చిన్న కమతాలు, నీటి వసతి తక్కువగా ఉన్న భూములలో పెంచేందుకు మేకలు మంచి ప్రత్యామ్నాయం. చిన్న, సన్నకారు రైతులకు తక్కువ పెట్టుబడులతో చేయగల లాభదాయకమైన వ్యాపకంగా మేకల పెంపకాన్ని చెప్పవచ్చు.

మేకల పెంపకం ప్రయోజనాలు

ఉన్ని, మాంసం, పాలు, చర్మాలు, ఎరువు ఇలా బహుళ ప్రయోజనాలను అందించే మేకల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా నీటి వనరులు, వర్షపాతం తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో ముఖ్యమైన ఆర్థిక వనరుగా ఉండగలదు. ఉన్ని అమ్మకం, మేకల అమ్మకం మేకల కాపరులకు నమ్మకమైన ఆదాయ వనరుగా ఉంటాయి.

మేకల పెంపకం సానుకూలతలు ఇలా ఉన్నాయి.

ఇతర పశుగణాలతో పోల్చినప్పుడు మేకలను ఉంచడానికి ఖరీదైన భవనాలు అవసరం లేదు, తక్కువ మానవ వనరులు సరిపోతాయి.

తొలివిడత మంద ఏర్పాటు కూడా ఇతర పశుగణాలతో పోల్చినప్పుడు చాలా చౌక. మంద చాలా వేగంగా వద్ధి చెందుతుంది.

ఇతర జంతువులతో పోల్చినప్పుడు మేకలు అనేక రకాల మొక్కలను తినగలవు, కనుక ఇవి చక్కటి కలుపు మొక్కల నాశకాలుగా పని చేస్తాయి.

ఉన్ని, మాంసం, ఎరువుల ఉత్పత్తి మేకల కాపరులకు మూడు రకాల ఆదాయ వనరులను సమకూరుస్తుంది.

భారతదేశం యొక్క అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మాంసం ఉత్పత్తికి మెరుగైన జాతుల అభి వద్ధికి చాలా మంచి అవకాశాలున్నాయి.

గొర్రెలు, మేకల పెంపకానికి మార్గదర్శకాలు

మొదటగా అనుభవం కోసం కనీసం ఒక నెలపాటు తమకు దగ్గర్లోని గొర్రెలు, మేకల పెంపక కేంద్రంలో పని చేయాలి లేదా శిక్షణ పొందాలి.

ప్రారంభంలో పాకల నిర్మాణంపై తక్కువ పెట్టుబడి పెట్టాలి

మీరు గొర్రెలు, మేకల పెంపక కేంద్రం స్థాపించ దలచు కున్న ప్రాంతంలోని ప్రజల మాంసాహార అభిరుచులకు అనుగుణంగా జీవులను ఎంపిక చేసుకోవాలి. అంటే మీ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా గొర్రె మాంసాన్ని ఇష్టపడితే గొర్రెలను, మేక మాంసాన్ని ఇష్టపడితే మేకలను ఎక్కువగా పెంచాలి. దాని వల్ల అమ్మకం సులువవుతుంది.

మీ ప్రాంతంలో ఎక్కువగా ఏ జాతి గొర్రెలు, మేకలను పెంచుతున్నారో పరిశీలించి ఆ జాతి గొర్రెలు, మేకలనే పెంచాలి.

మొదట్లో 100ం5 మందతో ఉత్పత్తి ప్రారంభించి అక్కడ నుంచి క్రమంగా మంద పరిమాణాన్ని పెంచుకోవాలి.

రెండో దశలో అచ్చంగా గొర్రె, మేక పొట్టేలు పిల్లల పెంపకం చేపట్టవచ్చు(మగ గొర్రె పిల్లల).

బంధువుల మీదా, కార్మికుల మీదా ఆధారపడవద్దు, కూలీలను ఉపయోగించుకోండి కానీ స్వయంగా పని చేయడానికి సిద్ధమై ఉండండి. గొర్రెలు, మేకలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

ఒక ఎకరంలో లభించే పశుగ్రాసంతో సుమారు 50 గొర్రెలు లేదా మేకలను పెంచుకోవచ్చు.

మీ ఇష్టాన్ని బట్టి గొర్రెల పెంపకందారుల సహకార సంఘంలో నమోదు చేసుకోవడం తప్ప గొర్రెలు, మేకల పెంపక కేంద్రం ప్రారంభానికి ఎలాంటి అనుమతులూ, రిజిస్ట్రేషన్లు అవసరం లేదు.

కొంత మంది రైతులు, వ్యక్తులు బక్రీదు పండుగ వ్యాపారం కోసం మాత్రమే ప్రయత్నిస్తారు. అది అంత అనుసరణీయం కాదు. అది కేవలం 3 రోజుల వ్యాపారం మాత్రమే. దాని కన్నా 365 రోజుల వ్యాపారమే ఎప్పుడూ మెరుగైనది.

ముహమ్మద్‌ జహీరుద్దీన్‌

Other Updates