ఏ రైతు పొలంలోనైనా
గొర్ల మంద ఆగితేనే
పంటలకు కల్తీ లేని ఎరువు
గజగజ వొణికే చలికాలంలో
వెచ్చని గొంగళ్లు గొర్ల ఉన్నివే!
గొర్రెను గోడ మీద కొయ్యందే
ఏ ఇల్లు ఫలమందదు
పొటేలు నెత్తురు పారందే
ఏ సైదుల్‌కు పాతేహాలెక్కవు
తుంకలు లేని పెండ్లిల్ల
సప్పడి తిండంటు తిట్టెటోళ్లే !
ఈర నాగమ్మ, ఎల్లమ్మ
పోలేరమ్మ, ముత్యాలమ్మ
గ్రామదేవతలెవరైనా
జీవాల త్యాగం లేనిది
ఏ కార్యం పొద్దెక్కదు
మ్యాక మరక బలికాకుండా
ఏ జాతర పొలెక్కదు !
కుర్చీ మీదికెవరొచ్చినా
బుజ్జి పిల్లను ఖుషిగా ఇస్తే
గొంగడి కొప్పెర్ల మడ్సుకొని పోయినోళ్లే
మల్లిసూసిన మారాజెవ్వడూ లేడు!
ఒకప్పుడు
ఇంటి ముంగిట మేకలు, గొర్లు
ఎచ్చిడి బతుకులు
ఇయ్యాళ గొర్లు
స్వయంపోషక సగౌరవాలు
మమ్మల్ని నిలబెట్టే జీవగర్రలు!
కాకతీయులు చాళుక్యులు
రెడ్డి రాజులు బ్రహ్మనాయుళ్లు
ఆధునికులెవరైనా
గొర్లను విందుగా చూసినోళ్లే
బతుకుదెరువుగా
చూయిస్తున్నది మొదటిసారి!
గోసి గొంగడి గాడు
గొల్లోనికేం తెలుసు మల్లెపువ్వు
ఎత్తి పొడుపులతో అహంకారంగా
ఊరు నోరు తెరుస్తది
గెట్టున మేస్తే
పర్యావరణానికి ముప్పని
మ్యాకల్ని నిర్మూలించాలనే కుట్రలెన్నో..
నిషేదపు ఉత్తర్వులెత్తేయాలంటే
రోడ్డు మీద పిర్రలు పగిలే!
ప్రపంచ కార్మిక చట్టాలు
మా పనిగంటల మధ్య బలాదూర్!
గొర్రె కోసం
దేశదేశాలు తిరిగినం
గొర్లే వాకిట్లకొస్తున్నవి
మనది మనకైనందుకేమో
గొర్లను, మ్యాకల్ని,
పొటేళ్లను చేతికిస్తున్నది
భూ చరిత్రలో మొదటిసారి!
నాలుగురోజులు
నాలుగు కిలోమీటర్లు నడిసినోల్లందరు
మహాత్ములైతే
మున్నూటరవై ఐదు దినాలు
భూమంతా తిరిగే గొర్లకాపర్లు
మహాత్ములు కారా!
గొర్రెపిల్లల్ని ప్రభుత్వం పంపిణీ చేసిన సందర్భంగా…
– వనపట్ల సుబ్బయ్య