magaభారతదేశ చరిత్రలో మౌర్యులు, గుప్తులు, పీష్వాలు, మరాఠాలు, కాకతీయులు, పల్లవులు. చాళుక్యులు, రాష్ట్రకూటులు. విష్ణు కుండినులు, మొఘలాయిలు, శాతవాహనులు మొ|| రాజ వంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదేస్థాయి ప్రాధాన్యత గోండురాజులకు కూడా ఉంది. 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు సుమారు ఆరు రాష్ట్రాలలో విస్తరించింది ”గోండ్వానా” సుమారు 280 సంవత్సరాల పాటు అప్రతిహతంగా మహావైభవోపేతంగా పలువురు గోండు చక్రవర్తులు ఖేర్లా, మాండ్లా, నాగపూర్‌, దేవ్‌ఘర్‌, చంద్రపూర్‌, సిర్పూర్‌, జున్‌గాం, కేంద్రాలుగా తమ పరిపాలన కొనసాగించారు. ఆ సమయంలో ”జున్‌గాం” రాజ్యాన్ని బీర్‌షా, పాలించేవాడు.

సిర్పూర్‌ కోటనుండి కొంత కాలం పాటు పాలన కొనసాగించిన బీర్‌షా అనంతరం రాజధానిని ”జునుగాం”కు మార్చాడు. ఆ తర్వాత ”బల్లాల్‌షా” చంద్రపూర్‌ నదికి దక్షిణం వైపు కొత్త రాజధానిని నిర్మించాడు. ప్రస్తుతం ఆ నగరమే ”బల్లార్‌షా” గా పిలవబడుతోంది. భీంబల్లాల్‌షా గోండ్వానా రాజ్య విస్తరణలో భాగంగా పలు చోట్ల కొత్త నగరాలు నిర్మించాడు. కోటలు కట్టించాడు ఎక్కడికక్కడ అడవుల్లో తండాలుగా ఉన్న గోండు వీరులను ఏకం చేసి స్వతంత్య్ర గోండ్వానా రాజ్యాన్ని దేశంలోని ఇతర రాజ్యాల మాదిరి విస్తరించడానికి నడుంబిగించాడు. ఈయన కాలంలోనే రాజ గోండులు చిన్న చిన్న రాజ్యాలను, మండలాలను స్థాపించారు.

ఆయా ప్రాంతాలలోని చిన్న చిన్న రాజ్యాలను, మండలాలను, కలిపి ఒక పెద్ద రాజ్యాన్ని పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అలాంటి రాజ్యాలే తాండూర్‌, ఉల్లిపిట్ట, కోట పరందోలి, ఉట్నూర్‌, గోయెన, ఉండుంపూర్‌, మానిక్‌ఘడ్‌, నార్నూర్‌, కోట రుద్రంపూర్‌, దేవదుర్గం మొ||లైనవి. జున్‌గాం రాజ్యంలో 16 చిన్న రాజ్యాలు ఉండేవి. దేవదుర్గం క్రింద 6 రాజ్యాలు, 9 మండలాలు ఉండేవి. రాజూరా రాజ్యంలో 22 మండలాలు 8 రాజ్యాలు ఉండేవి. ఉట్నూర్‌ క్రింద 6 రాజ్యాలు 12 మండలాలు ఉండేవి. 900 సంవత్సరాల క్రితం ”జున్‌గాం” అంటే ఆసిఫాబాద్‌లోని ప్రాంతం దట్టమైన అడవులు కొండలతో నిండి ఉండేది.

ఇక్కడ మైదాన ప్రాంతం చాలా తక్కువ. కేరామేరి, ఝరి, జోడేఘాట్‌ కొండల్లో విస్తరించిన అలనాటి గోండు రాజ్యం ”దేవదుర్గం”. ”దేవదుర్గం” క్రింద సుమారు 180 గ్రామాల పాలన సాగేది. 900 సంవత్సరాల క్రితం ”భీంబల్లాల్‌షా” ఇక్కడ పటిష్ఠమైన కోటను ”జున్‌గాం” లోని కంచు కోటకు ధీటుగా 1600 అడుగుల ఎత్తయిన కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు. ”దేవదుర్గం” ఎత్తయిన కొండపై నిర్మించటం వల్ల శత్రు రాజులకు ఈ దుర్గాన్ని జయించాలంటే చాలా కష్ఠంగా ఉండేది. ఇప్పటికి ఈ కొండను చేరుకోవాలంటే చాలా కష్ఠం. ఆసిఫాబాద్‌ నుండి 32 కిలో మీటర్ల దూరంలోని మొవాడ్‌కు వెళ్ళి అక్కడి నుండి 12 కిలో మీటర్లు నడక ద్వారా అడవిలో ప్రయాణిస్తే ఈ కొండ వస్తుంది. కొండపైనున్న వనదేవతకి ఇప్పటికి దసరా సమయంలో మొవాడ్‌ చుట్టు ప్రక్కల గోండులు 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. కోటకు రక్షణగా ఈ వనదేవతను ప్రతిష్ఠించారని గిరిజనుల నమ్మకం. నిలువైన కొండపైకి ఎక్కటం అంత సులువు కాదు. దట్టమైన అటవీ ప్రాంతం. కొండకి తూర్పువైపున ”సవతుల గుండం” జలపాతం కన్నుల పండుగగా ఉంటుంది. ఉత్తరాన పెద్ద వాగు ఉధృతి విపరీతంగా ఉంటుంది. కనీసం 10 నుండి 15 మంది బృందంగా కొండపైకి ఎక్కితే అపూర్వమైన రీతిలో నిర్మించిన రాతి కోట ఆనవాళ్ళు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తాయి. సాంకేతికంగా ఇంత ప్రగతి సాధించిన ఈ రోజుల్లోనే అత్యంత కష్ఠ సాధ్యంగా భావించే ప్రయాణం ఆ రోజుల్లోని వారు ఎలా సుసాధ్యం చేశారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంత ఎత్తయిన కొండపైకి వాళ్ళు కోట గోడలకు. ఇతర నిర్మాణాలకు కావాల్సిన రాళ్ళు ఎలా మొసారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ”దేవదుర్గం” కోటని ”వోటే ఘడ్‌” అని ప్రస్తుతం స్థానికులు పిలుస్తారు. ఎందుకంటే మొఘలాయిల కాలంలో ఇంతటి దట్టమైన అటవీ ప్రాంతంలోకి కూడా వేలాది మంది ముస్లీం సైనికులు ప్రవేశించి అమాయక గోండు వీరులను పాశవికంగా చంపి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇష్టారీతిన దౌర్జన్యాలు కొనసాగించారు. 16,17 శతాబ్దాలలో గోండ్వానాలో ముస్లిం రాజుల దండయాత్రల దరిమిలా గోండు ప్రాంతంలో ముస్లింలు ప్రవేశించి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఇక్కడి నుండి పారిపోయిన కొంత మంది గోండు రాజులు అనంతర కాలంలో చిర్ర కుంట సమీపంలో సరికొత్త ”దేవదుర్గాన్ని”, మరి కొంత మంది గోండులు రాజురా సమీపంలో ”మానిక్‌” ఘడ్‌”ని నిర్మించుకొని పాలన కొనసాగించినట్టు చెప్తారు.

మరొక కథనాన్ని అనుసరించి దేవదుర్గాన్ని అంటే వోటేఘడ్‌ని పాలించిన రాజు రతన్‌షా పెద్ద భార్య, చిన్న భార్య తగవులాడుకొని కొండ క్రింద జలపాతంలో పడి చని పోవటంతో ఆ జలపాతానికి ”సవతుల గుండం” అని పేరు వచ్చింది. భార్యలు చనిపోయిన దుఃఖంలో రాజు రాజ్యాన్ని వదిలి పిచ్చి వాడిలా తిరిగి తిరిగి తానూ ఆత్మాహుతి చేసుకున్నాడని అందువల్ల ”దేవదుర్గం” మరోచోటికి మారిందని మరో కథనం. గోండు రాజుల సమగ్ర చరిత్ర లిఖిóత పూర్వకంగా అందుబాటులో లేకపోవటం వల్ల వారి పాలనా సమయంలో సరి అయిన సారూప్యత సాధించటం కష్టసాధ్యమే. భీం బల్లాల్‌షా తర్వాత ఖర్జాబల్లాల్‌ సింగ్‌, హీర్‌ సింగ్‌, ఆండియా బల్లాల్‌ సింగ్‌, తల్వార్‌ సింగ్‌, కేసర్‌ సింగ్‌, దిన్‌ కర్‌ సింగ్‌, రాం సింగ్‌, సూర్జాబల్లాల్‌ సింగ్‌, ఖండ్యకా బల్లాల్‌షా, హీర్‌షా, భూమాలతోపాటు లోకాబా, కొండ్యాషా,బాబ్జీ బల్లాషా, దుండియా రాంషా, క్రిష్ణషా, బీర్‌షా-2, రాంషా-2, నికంత్‌షా చక్రవర్తుల పాలనలో 870 నుండి 1751 వరకు దేవదుర్గం రాజ్యాన్ని ”మడావి రాజులు” అవిచ్ఛిన్నంగా పాలించారు.

దేవదుర్గం కోటలో అక్కడక్కడా పడి ఉన్న రాతి శిలలు, కొన్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్న శిల్పాలు ఎన్నో విపత్తులను ఎదుర్కొని నేటికి నిలిచి ఉన్న రాతి దర్వాజాలు మనల్ని గొప్ప ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొండపై నిర్మించిన కోటలో చాలా చోట్ల మనకు అనేక రాతి శిథిóలాలు కనిపిస్తాయి. కోటపై సమగ్ర పరిశోధన కొనసాగిస్తే మరెన్నో అమూల్యమైన విషయాలు బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. ఇక్కడికి రావటానికి స్థానిక గోండులే భయపడతారు. దసరా, సంక్రాంతి పర్వదినాలలో వచ్చి ”దండారి” జరిపి వెళ్ళిపోతారు. మడావి వంశానికి చెందిన రాజ వంశీకులు దసరా సమయంలో దండారి జరిపి నాటి ”తల్వార్‌కి” పూజ చేస్తారు. అపూర్వమైన గిరి దుర్గం ”దేవదుర్గంలో” మిగిలిన కోట మొత్తంగా సేకరించి అవశేషాల్ని స్మృతివనంగా చేయాలని ఈ కొండపైకి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని స్థానికుల కోరిక, వివిధ కోటలపై పరిశోధనలు కొనసాగిస్తున్న చరిత్ర పరిశోధకులు తెలంగాణా రాష్ఠ్రంలో పరిఢవిల్లిన గోండ్వానాం కోటపై కూడా సమగ్ర పరిశోధన కొనసాగిస్తే ఎంతో ఆసక్తికరమైన గోండు రాజుల చరిత్ర వెలుగులోకి వస్తుంది. ఆదిశగా తెలంగాణా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆకాంక్షిద్దాం.

నాగబాల సురేష్‌ కుమార్‌

Other Updates