గోకుల్‌చాట్ బాంబు పేలుడు బాధితునికి ఆర్ధిక సహాయం
ఎనిమిదేండ్ల క్రితం గోకుల్ చాట్ బాంబు పేలుడు ప్రమాదంలో గాయపడి ఇప్పటి వరకు కోలుకోలేని స్థితిలో ఉన్న సదాశివరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కును అందజేసింది. సెప్టెంబర్ 3వ తేదీన సచివాయం సీ బ్లాకులో పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బాధితుడి తల్లిదండ్రులు జి. మోహన్‌రెడ్డి, వసంతలకు చెక్కును అందజేశారు.2007లో గోకుల్‌చాట్, లుంబిని పార్కుల్లో జరిగిన వరుస పేలుళ్లలో 49 మంది చనిపోగా, 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటనలో సదాశివరెడ్డి తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంలా మారారు. నాటి నుంచి నేటి వరకు కూడా కోలుకోలేదు. తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకుకు తామే చిన్నపిల్లాడికి చేసినట్లు సేలు చేయాల్సి వస్తోందని తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేశారు.
బాంబు పేలుళ్ళలో గాయపడిన వారిని ఆదుకుంటామని, వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వం ఆ సమయంలోనే వైద్యసేవలు చేయించి చేతులు దులుపుకుంది. నేటికి వైద్య ఖర్చుకు నెలకు 30 నుంచి 40వేల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నామని, తమ ఆర్థిక స్థోమత సరిపోక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కలిసి బాధితుడి తల్లిదండ్రులు తమ గోడును వెళ్ళ బోసుకున్నారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి 10లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన 10లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి తరపున కేటీఆర్ బాధిత కుటుంబానికి అందజేశారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం :
‘‘మన రాష్ట్రం వచ్చింది, మన వాళ్లు అధికారంలో ఉన్నారు… కాబట్టే మాకు సహాయం అందింది’’ అని సదాశివారెడ్డి తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరూ తమను అసలు పట్టించుకోలేదని, ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.