-(ఎం. శ్రీలత )

గోదానానికి గొప్ప సంకల్పమే ధ్యేయంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు శ్రీకారం చుట్టారు. ఏవుసంలో కల్తీ ఎరువుల వాడకం పెరిగి ప్రజానీకం ఇబ్బందిపడుతున్నారని గుర్తించారు. సేంద్రియ ఎరువులే మేలని రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌ రావు వినూత్నంగా ఆలోచన చేసి ఈ ఆదర్శ కార్యక్రమాన్ని చేపట్టారు.

సిద్ధిపేట నియోజకవర్గం నంగునూరు మండలంలో గల తిమ్మాయిపల్లి, వెంకటాపూర్‌, మైసంపల్లి, పాలమాకుల, చిన్నకోడూరు మండలం రామునిపట్ల, ఓబులాపూర్‌, సిద్ధిపేట రూరల్‌ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో సుమారు 300 మంది రైతులను గుర్తించారు. గతంలోనే నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో మిత్రుల సహకారంతో గోదానం కింద 100 మందికి దేశీయ ఆవులను ఉచితంగా అందజేశారు. మిగతా 200 మందికి కర్ణాటక రాష్ట్రం నుంచి హెచ్‌ఎఫ్‌, సాయ్వాల్‌ జాతికి చెందిన 300 ఆవులను దిగుమతి చేయించారు. మన ప్రాంత వాతావరణంలో ఇమడగలిగే ఈ ఆవులను మంత్రి హరీష్‌ రావు తన స్వంత ఖర్చులతో కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీచేశారు. సిద్ధిపేటలోని పత్తి మార్కెట్‌ యార్డులో పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ ఛైర్మన్‌ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌, డీఆర్వో చంద్రశేఖర్‌, పశు సంవర్థక శాఖ అధికారులతో కలిసి సిద్ధిపేట నియోజకవర్గంలోని అర్హులైన రైతులకు అందరి సమక్షంలో డ్రా పద్ధతిన పాడి ఆవులను అందజేశారు. ఈ మేరకు గోమాతకు పూజా కార్యక్రమాలను జరిపారు.

ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం: మంత్రి హరీష్‌ రావు

ఆరోగ్యవంతమైన సిద్ధిపేటగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యం. ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే సేంద్రియ పంటలపై దృష్టిపెట్టాను. గోమూత్రం, గోవుల పేడతో మంచి పంటలు పండించవచ్చు. దేశీయ ఆవుల పాలు ఎంతో శక్తిమంతమైనవి. కల్తీ ఆహారం, నాణ్యతలేని పాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్ని ఆస్తులున్నా, డబ్బున్నా మంచి ఆరోగ్యం ఉన్నవాడే అసలైన ఐశ్వర్యవంతుడు. అందుకే సేంద్రియ రైతులను ప్రోత్సహించడానికి నా వంతు సాయంగా గోవులను అందజేస్తున్నా. త్వరలోనే సిద్ధిపేటలో సేంద్రియ ఎరువులతో పండిన పంటలు, కూరగాయలు, దేశీయ ఆవుపాలు లభించే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే యోచిస్తున్నా. అని మంత్రి హరీష్‌ రావు చెప్పారు.

సిద్ధిపేటలో పశువులకూ వసతి గృహాలు

సామూహిక గొర్రెల హాస్టల్స్‌ అందరి దృష్టిని ఆకర్షించిన సిద్ధిపేటలో ఇక పశువులకూ హాస్టల్స్‌ ”వసతి గృహాలు” అందుబాటులోకి రానున్నాయి. పాడి పశువులు అనారోగ్యానికి గురికాకుండా చూడటం, పాల ఉత్పత్తి పెంచడంతో పాటు పల్లెల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌, ఇర్కోడ్‌, నర్మెట మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సాముహిక గొర్రెల పాకలు-హాస్టల్స్‌ నిర్మించడంతో సత్ఫలితాలు వచ్చాయి. గ్రామానికి చెందిన అన్ని గొర్రెలు ఒకేచోట ఉండటంతో కాపలా సులభమైంది. ఊర్లలోనూ పారిశుద్ధ్యం మెరుగైంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పశువులకూ ”వసతి గృహాలు” హాస్టల్స్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వచ్చే జనవరిలోపు నిర్మాణాలు పూర్తి చేసేలా కసరత్తు ప్రారంభించారు. పశువుల మేత కోసం తీసుకెళ్లి రావడం కష్టమని చాలా మంది భావిస్తూ.. ఒకరు పూర్తిస్థాయిలో వాటిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని.., ఇతరత్రా కారణాలతోనూ చాలా మంది పశుపోషణకు దూరమవుతున్నారు. ప్రతిపాదిత పశువుల హాస్టల్స్‌-వసతి గృహాలు ఆ సమస్యలకు పరిష్కారం చూపనున్నాయి.

ముందుగా, కర్నూలు జిల్లా తడకనపల్లి, గుజరాత్‌లోని అకోదరాలలో ఉన్న పశువుల వసతి గృహాలను అధ్యయనం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు వెళ్లి వివరాలను సేకరించారు. ఆ రెండు చోట్ల మహిళల భాగస్వామ్యంతోనే నడుస్తున్నాయని గ్రహించారు. హాస్టల్స్‌ లో ఉండటం, సమయానికి వైద్య సేవలు అందటం వల్ల ఒక్కో పాడి పశువు రోజూ దాదాపు 2 లీటర్ల వరకూ అధికంగా పాలు ఇస్తుందని గుర్తించారు. ఈ క్రమంలో సిద్ధిపేట నియోజక వర్గంలోని 8 గ్రామాల్లో ఒక్కో వసతి గృహాన్ని రూ.2కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఒక్కోదాని సామర్థ్యం 200 పశువుల పోషణకు వీలు ఉండేలా నిర్ణయించారు.

ఉపాధి హామీ పథకం ద్వారా కోటి రూపాయల వరకు వెచ్చించి, మిగతా సీఏస్‌ఆర్‌- కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సి బిలిటీ కింద నిధులను సమీకరించాలని నిశ్చయించారు. ఇందుకు గాను ఆరు గ్రామాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ఇప్పటికే రాష్ట్ర పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆమోదం లభించింది. ఒక్కో పశువుకు ప్రతి నెలా కొంత మొత్తం రైతు నుంచి డబ్బులు సేకరించి., ఆ డబ్బులను నిర్వహణకు ఉపయోగించనున్నారు.

గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి

రాష్ట్రంలోనే తొలిసారిగా మన సిద్ధిపేట నియోజకవర్గంలో గొర్రెల హాస్టల్స్‌ నిర్మించాం. ఇదే తరహాలో బర్రెలకు హాస్టల్స్‌ నిర్మించి ఆదర్శంగా నిలువాలన్నదే మన సంకల్పం. గొర్రెల హాస్టల్స్‌, బర్రెల హాస్టల్స్‌ కు రెండు ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఉన్నాయి. ఈ నిర్మాణాల వల్ల రైతులకు, గ్రామ ప్రజలకు మేలు జరగాలన్నదే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట విద్యుత్‌ గెస్ట్‌ హౌస్‌లో రెండున్నర గంటల పాటు సెర్ఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌. అనంతం, డీఆర్డీఏ పీడీ గోపాల్‌ రావు, పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈ కనక రత్నం, పశు సంవర్థక శాఖ జేడీ రామ్‌ జీ, సుడా ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, పశు వైద్యాధికారులు, వివిధ ఇంజినీరింగ్‌ శాఖాధికారులు, నియోజకవర్గం పరిధిలోని ప్రజా ప్రతినిధులతో, 8 గ్రామాల సర్పంచ్‌, ఎంపీటీసీలతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూల్‌ జిల్లా తడకనపల్లె, గుజరాత్‌ రాష్ట్రంలోని అకోదరాలో పశువుల వసతి గృహాలను సందర్శించి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులను అధ్యయనం చేసిన అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 8 గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని మంత్రి హరీష్‌ రావు పిలుపు నిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 686 జిల్లాలో మొదటి వందలో గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయని, గుజరాత్‌, తెలంగాణ మధ్య అభివృద్ధిలో ఆదర్శంగా తీసుకునే అంశాలపై పోటీ ఉన్నదని ఆ పోటీల్లో మన సిద్ధిపేట జిల్లా, నియోజకవర్గం ఉండాలన్నదే మన ధ్యేయంగా పని చేద్దామని కోరారు.

నియోజకవర్గ పరిధిలోని 8 గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసినట్లు వీటిలో ఇబ్రహీంపూర్‌, ఇర్కోడ్‌, గుర్రాలగొంది, మిట్టపల్లి, నర్మెట, పొన్నాల, జక్కాపూర్‌, గట్ల మల్యాల గ్రామాల్లో జనవరి నెలాఖరు లోపు బర్రెలకు హాస్టల్స్‌ నిర్మించి ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. ఇప్పటికే 8 గ్రామాలలోని మూడు గ్రామాల్లో ఇబ్రహీంపూర్‌, నర్మెట, ఇర్కోడ్‌లో సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించారు. ఇదే తరహాలోనే మిగతా గ్రామాల్లో కూడా నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఈ ప్రత్యేకమైన పథకంలో భాగంగా ఎంపిక చేసిన 8 గ్రామాల్లోని మహిళా సంఘాలను క్షేత్రస్థాయిలో భాగస్వామ్యం చేయాలని, ఈ విషయంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్‌ లు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. రైతులకు గొర్రెలు అయినా, పాడి పశువులైనా.. ఒక హాస్టల్‌ లో కట్టి వేస్తే ఎండా కాలం ఫ్యాన్‌, వాన కాలంలో తడవకుండా రూఫ్‌, చలి కాలం చలి పెట్టకుండా చుట్టుపక్కల గోడలు ఉంటాయని, ఓపెన్‌ ఉన్న వైపు చిన్న టార్ఫాలిన్‌ కడితే చలి పెట్టకుండా వెచ్చగా ఉంటుందని, పశువులైనా.., గొర్రెలైనా ప్రాణం ఉన్న జీవులేనన్నారు. మనుషులుగా మనం.. చలి పెడితే స్వెటర్‌, వానొస్తే ఛత్రీ, ఎండ కొడితే ఏసీ వేసుకుంటున్నామని., అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటారంటూ అదే తరహాలో జీవాల పరిస్థితి కూడా అంతే ఉంటుందని., మనిషి చక్కటి ఆహారం తిని చక్కగా నీడలో ఉంటారో.. జీవాలు కూడా సరిగ్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఆరోగ్యంగా ఉంటే పాడి పశువులైతే.. పాలు ఎక్కువగా ఇస్తాయని, గొర్రెలైతే.. బలంగా ఉంటే మాంసం ఒక జీవంపై మరో 4 కిలోలు ఎక్కువగా వస్తుందని., దీంతో వ్యాపారం లాభాలు కూడా ఎక్కువగా గడించ వచ్చన్నారు. పాడి పశువులైతే.. ఒక లీటరు లేదా రెండు లీటర్లు ఎక్కువగా పాలు ఇస్తే.. మొత్తంగా నెలలో 50 లీటర్లు ఎక్కువగా ఇస్తే 2 వేల రూపాయలు రైతుకు అదనపు ఆదాయం వస్తుందంటూ.. ఇలా పాడి, గొర్రెల రైతులకు జరిగే మేలు గురించి సవివరంగా వివరించారు. రెండో విషయంలో గ్రామానికి మేలు ఏలా అంటే.. ఊర్లో రోడ్లపై పేడ, మల మూత్ర విసర్జనలు చేయడంతో గ్రామంలో అపరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటం. అలాగే పాడి పశువులను ఇంటి ముందు, పెరట్లో దొడ్డి పెట్టి కట్టేస్తే వాటి మలమూత్రాల వల్ల వర్షాకాలం ఆ ప్రాంతమంతా దుర్వాసన, ఆ పశువుల పేడ, గొర్రెల మల, మూత్రాలతో అనేక రకాలుగా దోమలు కూడా బాగా పెరిగి వ్యాధి సమస్యలు ఉత్పన్నమవు తున్నట్లు వివరించారు.

గొర్రెలను తోడేళ్లు, కుక్కలు కరుస్తాయని రైతుకు నిద్ర కూడా సరిగ్గా ఉండదని.. గొర్రెలకు ఏదైనా వ్యాధి సోకితే.. మందను వదిలి డాక్టర్‌ వద్దకు వెళ్లాలంటే గొర్రె రైతుకు కష్టం.. అదే గొర్రెల హాస్టల్స్‌ తో ఆ టెన్షన్‌ ఉండదని డాక్టర్‌ అక్కడికే వచ్చి చూసి రికార్డులో సంతకం సైతం చేస్తారని పేర్కొన్నారు. గ్రామంలోని గొర్రెలు, పాడి పశువులకు వైద్యం అందించేందుకు డోర్‌ స్టెప్‌.. మన వద్దకే పశువుల డాక్టర్‌ వచ్చి మూగ జీవాలకు వైద్యం అందించే సౌకర్యం కలిగి రైతుకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు గడ్డి విత్తనాలు సబ్సిడీ పై ఇవ్వడం, మహిళలకు కుటీర పరిశ్రమలలో భాగంగా ఇర్కోడ్‌ లో చికెన్‌, మటన్‌ చట్నీలు, మిట్టపల్లిలో పప్పు దినుసులు, చిన్నగుండ వెళ్లిలో అల్లం పేస్ట్‌, బ్యాక్‌ యార్డ్‌ పౌల్ట్రీ, మదర్‌ యూనిట్‌- నాటుకోళ్లు, పౌడర్‌ తయారీ కేంద్రం.. ఇలా ఇదే విధంగా మిగతా 6 గ్రామాల్లో చేద్దామని ప్రజాప్రతినిధుల చొరవతోనే సాధ్యమని, ఇందుకు కావల్సిన పూర్తి సహకారం అందిస్తామని మంత్రి చెప్పారు. ఈ సమీక్షలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఏంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Other Updates