స్వంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పర్యటించారు. ములుగులో నిర్మించిన ఫారెస్ట్‌ కాలేజీ, రీసెర్చ్‌ కేంద్రాన్ని ప్రారంభించారు…

స్వంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ములుగులో నిర్మించిన ఫారెస్ట్‌ కాలేజీ, రీసెర్చ్‌ కేంద్రాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫారెస్ట్‌ అధికారులతో, విద్యార్థులతో కేసీఆర్‌ ముచ్చటించారు. సుమారు రూ.175 కోట్ల వ్యయంతో ఈ కాలేజీని నిర్మించారు. ఫారెస్ట్‌ కాలేజీలో ఎమ్మెస్సీ ఫారెస్ట్‌, బీఎస్సీ ఫారెస్ట్‌, పీహెచ్‌డీ ఫారెస్ట్‌ కోర్సులు ఉండనున్నాయి. ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులు చదువుకునేలా ఫారెస్ట్‌ కాలేజీ భవనాన్ని తీర్చిదిద్దారు. విద్యార్థులు మొక్కలపై పరిశోధనలు చేయడానికి సుమారు 200 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

తమిళనాడు స్ఫూర్తితో.. అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం:
తమిళనాడులోని మెట్టుపాళ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ పరిశోధన కళాశాలను ఏర్పాటు చేసింది. అక్కడ చదువుకున్న వారిలో 120 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులుగా ఎంపికయ్యారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని 2016లో తెలంగాణ అటవీ పరిశోధన కళాశాలను ములుగులో నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు తీసుకుంది.

  • నిర్మాణ వ్యయం – రూ.75 కోట్లు
  • 26 ఎకరాల్లో కళాశాల, వసతి గృహాలు, సిబ్బంది నివాసాలు
  • పరిశోధనలకు 178 ఎకరాల కేటాయింపు
  • పారెస్ట్రీ కోర్సుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీలలో కలిపి మొత్తం 104 సీట్లు

ఉద్యానవన విశ్వవిద్యాలయాలను సీఏం కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం రాజేంద్రనగర్‌ లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం ఆవరణలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వ విద్యాలయం ఉంది. దీన్ని ములుగు తరలిస్తూ ఇక్కడ భారీ భవన సముదాయాన్ని నిర్మించారు.

ములుగులో నిర్మించిన ఉద్యాన యూనివర్సిటీని కేసీఆర్‌ ప్రారంభించారు.
ఉద్యాన పంటలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటి ఏర్పాటు చేసింది. రూ.135 కోట్ల వ్యయంతో 16 ఎకరాల్లో ఉద్యాన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా పండ్ల తోటల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను కూడా ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సీఏం, మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులు పరిశీలించారు.


ఉద్యాన విశ్వ విద్యాలయం:

  • నిర్మాణ వ్యయం: రూ.135 కోట్లు
  • 16 ఎకరాల్లో విశాలమైన ప్రాంగణం

గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ మార్కెట్‌లో మొత్తం ఆరు బ్లాక్‌లు ఉన్నాయి. ఆరున్నర ఎకరాల్లో నిర్మించిన ఈ మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, మాంసాహారం లభిస్తాయి. సూపర్‌ మార్కెట్‌తో పాటు 16 షాపులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన పార్క్‌తో ఈ మార్కెట్‌ను తీర్చిదిద్దారు.

సమీకృత మార్కెట్‌

  • నిర్మాణ వ్యయం: 22.85 కోట్లు
  • 6.24 ఎకరాల్లో విశాలమైన ప్రాంగణం
  • పండ్లు, కూరగాయలతో పాటు మాంసాహారం విక్రయించేలా 246 దుకాణాలు
  • సూపర్‌ మార్కెట్‌ తో పాటు దుకాణ సముదాయం
  • రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా చూడటం.

గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన సమీకృత కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. మొత్తం 42 కార్యాలయాలు ఒకేచోట కార్యకలాపాలు నిర్వహించే వీలున్న ఈ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆర్డీఓ విజయేందర్‌ రెడ్డిని తన సీటు పై కూర్చోబెట్టి విధులు మొదలుపెట్టించారు. ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు అన్నీ ఒకేచోట నుంచి ఉండాలన్నదే లక్ష్యమని సీఎం చెప్పారు.

  • సమీకృత కార్యాలయ భవన సముదాయం
  • నిర్మాణ వ్యయం రూ.42.7 కోట్లు
  • ఆరున్నర ఎకరాల ప్రాంగణం
  • మొత్తం 42 కార్యాలయాలు ఒకేచోట కార్యకలాపాలు నిర్వహించే వీలు
  • ప్రజలకు ఒకే చోట అన్ని సేవలు అందుబాటులో ఉండాలన్నదే లక్ష్యం.

గజ్వేల్‌ పట్టణంలో రూ.19.85 కోట్లతో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. సీఎంతో మంత్రులు ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, హరీశ్‌ రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు ఉన్నారు.

  • మహతి ఆడిటోరియం
  • నిర్మాణ వ్యయం – రూ.19.47 కోట్లు
  • 2 ఎకరాల విస్తీర్ణంలో సమావేశ మందిరం
  • సభలు, సమావేశాల నిర్వహణతో పాటు సాంస్కృతిక కేంద్రంగా మార్చాలన్నదే లక్ష్యం.
  • 1200 మంది కూర్చునే విధంగా ప్రధాన హాల్‌, 200 మంది కూర్చేనేలా మినీ హాల్‌

గజ్వేల్‌ నియోజకవర్గానికి కాళేశ్వరం నీరు
ఈ సందర్భంగా గజ్వేల్‌ నియోజకవర్గంలోని మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. జనవరి చివరి నాటికి గజ్వేల్‌ నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు అందిస్తామన్నారు. త్వరలోనే ఇక్కడి చెరువులను నింపుతామని, గోదావరి జలాల పండగను ఘనంగా చేసుకుందామని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్ర ఆరోగ్య సూచిక గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని మంత్రి ఈటల రాజేందర్‌ను కోరుతున్నానని సీఎం అన్నారు. తెలంగాణలో సాహితీ సౌరభం మహతి ఆడిటోరియమన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఇలాంటి కాంప్లెక్స్‌లు రావాలన్నారు. తను ప్రతిసారీ నియోజకవర్గానికి రావడం కుదరదని, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ రెడ్డినే ఎమ్మెల్యే అనుకోవాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌ పనులు ఉండొద్దని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటి ప్రొఫైల్‌ రెడీ చేద్దామని, ఏ కుటుంబానికి ఏం చేయాలో నిర్ణయించుకుందామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

గజ్వేల్‌లో ఇల్లులేని నిరుపేద ఉండకూడదన్నారు. పార్టీలతో సంబంధంలేకుండా అందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అందిస్తామన్నారు. అలాగే నియోజకవర్గ సమస్యలపై ఒక రోజంతా చర్చించుకుందామన్నారు. గజ్వేల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ప్రతిమనిషికీ చేతినిండా పని ఉండేలా ఉపాధి కల్పిస్తాం. దేశమే ఆశ్చర్యపోయే విధంగా గజ్వేల్‌ నియోజకవర్గంలో అటవీ పునరుద్ధరణ జరిగింది. రాష్ట్ర ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ కూడా గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే మొదలుపెడతాం. మల్లన్నసాగర్‌ భవిష్యత్‌ లో అద్భుత పర్యాటక ప్రాంతం అవుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మిడ్‌ మానేరు వరకు ఎక్కడ చూసినా అద్భుత జలదృశ్యమే కనిపిస్తున్నది. నీళ్లను చూసి ప్రజలు సంతోషపడుతున్నారు. జనవరిలో గోదావరి జలాల పండుగ చేసుకుందాం. అటు స్వయం సమృద్ధ గజ్వేల్‌ తయారు కావాలని ఆకాంక్షించారు. ఊరు పచ్చబడే బాధ్యత ప్రతీ ప్రజాప్రతినిధి తీసుకోవాలని సీఏం కేసీఆర్‌ కోరారు. గజ్వేల్‌ ముఖచిత్రం సమూలంగా మారాలి. దేశ విదేశాల నుంచి వచ్చి గజ్వేల్‌ను చూసిపోవాలి. హార్టికల్చర్‌ యూనివర్సిటీ, ఫారెస్ట్‌ కాలేజీ దేశానికి ఆదర్శం. తమిళనాడు మెట్టు పాళ్యం ఐఎఫ్‌ఎస్‌ కాలేజీ నుంచి 120 మంది ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ నుంచి ఐఎఫ్‌ఎస్‌ అధికారులు తయారు కావాలని ఆకాంక్షించారు.


ఎలా చేసుకోవాలో.. నేను చెబుతా..
అన్నా హాజారే, ప్రొఫెసర్‌ బండార్కర్‌, మోహన్‌ దారియా.. వీళ్లంతా చాలా అద్భుతాలు చేశారు. అవన్నీ మనం 15 రోజుల్లో సమావేశాల్లో చర్చిద్దాం. గ్రామాలూ పచ్చబడేలా చేసే బాధ్యతను ప్రజా ప్రతినిధులు తీసుకోవాలి. తమిళనాడులోని మెట్టుపాళ్యంలో ఓ కళాశాల నుంచి 125 మంది ఐఎస్‌ఎఫ్‌లయ్యారు. దీనినే స్ఫూర్తిగా తీసుకుని మనవద్ద అందుబాటులోకి తెచ్చాం. మన పిల్లలు ఐఎఫ్‌ఎస్‌ లుగా ఎదగాలి.

ప్రతి గ్రామాన్నీ ఎక్స్‌ రే తీయండి
గజ్వేల్‌ లో చేసుకోవడానికి పని లేదనే వ్యక్తి ఉండకూడదు. ప్రతి ఇంటికీ పాడి పశువులు ఇద్దాం. ఇళ్లు లేని నిరుపేదలు ఈ నియోజకవర్గంలో ఉండకూడదు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం మనల్ని పట్టి పీడిస్తున్నదని మంత్రి హరీశ్‌ రావు, సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ రెడ్డిలకు విజ్ఞప్తి చేస్తున్నానని.. ప్రతి గ్రామాన్ని ఎక్స్‌ రే తీయండి. ఒక్కో కుటుంబం పరిస్తితులేంటనే విషయాలను గుర్తించాలి. ఏ గ్రామంలో ఎంతవరకు పనులు పూర్తయ్యాయో చూడండి. ఆదర్శ నియోజకవర్గం ఎలా ఉండాలి అనే మోడల్‌ ను చేద్దాం. ఇది కేవలం గజ్వేల్‌ తోనే పరిమితం కాదు. రాష్ట్రమంతా విస్తరిద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇద్దాం. ఉపాధి చూపుదాం. రెండు పడకల గదుల ఇళ్ల విషయంలో పైరవీలకు ఆస్కారం ఉండకూడదు. గజ్వేల్‌ నుంచి ఆరోగ్య సూచిక మొదలు పెడతారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు రక్త నమూనాలు ఇవ్వాలి. వైద్య పరీక్షలు చేసి, ఫోటోలు తీస్తారు. మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మొదట గజ్వేల్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేస్తే రాష్ట్రమంతటా దీనిని అమలు చేయడానికి తోవ దొరుకుతుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు ఈ కార్యక్రమంలో సేకరిస్తారు. దీనివల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది.


పర్యాటక కేంద్రంగా మల్లన్న సాగర్‌
మల్లన్న సాగర్‌ జలాశయం పక్కనే 7500 ఎకరాల అటవీ భూమి ఉంది. ప్రాజెక్టు పూర్తి అయితే అక్కడ చాలా నీళ్లు ఉంటాయి. ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ ఆరోమాటిక్‌ పార్కును అభివృద్ధి చేయాలి. తెలంగాణలో ఒక సామెత ఉండేదని ”వికారాబాద్‌ కా హవా… లాఖో మరీజోంకో దువా..” అనే వారని మల్లన్న సాగర్‌ నూ అలా తీర్చిదిద్దుదామని కోరారు. ఇక సీఎం కేసీఆర్‌ రాక సందర్భంగా గజ్వేల్‌ ప్టణవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్‌ ప్రసంగాన్ని వినేందుకు జనాలు భారీగా తరలివచ్చారు.


నీ కడుపు సల్లగుండ..!
గజ్వేల్‌లో సమీకృత మార్కెట్‌ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూరగాయల దుకాణాల వద్దకు వెళ్లి ”మార్కెట్‌ ఎలా ఉంది. సౌలత్‌ లు మంచిగున్నాయా..?” అని రైతులను ఆరా తీశారు. అడివమ్మ అనే మహిళా రైతు ‘సంబురంగా ఉంది సార్‌’నీ కడుపు సల్లగుండ.. మంచి పని చేయించినవు’ అంటూ పొంగిపోయింది. సీఏం కేసీఆర్‌ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆమె వద్ద కూరగాయలు కొన్నారు. కేసీఆర్‌ రూ.2వేలు ఇస్తుండగా.. డబ్బులోద్దు సార్‌ మీరు మా దగ్గర కొనడమే అదృష్టం అని ఆమె కుమారుడు తెలుపగా.. ”బోణి నాదే కదా తీసుకో ” అంటూ సీఎం వారికి డబ్బులు అందజేశారు.

మామిడాల రామాచారి

Other Updates