కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌజులను సదవకాశంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్‌, కాళేశ్వరం ఇఎన్సి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజి వల్ల వందల కిలోమీటర్ల మేర గోదావరి నదిలో నిత్యం జలకళ ఉట్టి పడుతుంది. ఏడాది పొడవునా నదుల్లో, కాల్వల్లో నీరు నిల్వ ఉంటుంది. నదికి రెండు వైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. నదిలో బోటింగుకు అవకాశం ఉంది. నదికి రెండు వైపులా దాల్‌ లేక్‌ మాదిరిగా ఆకర్షణీయమైన చెట్లు పెంచవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, రిజర్వాయర్లు, పంపుహౌజుల వద్ద కావాల్సినంత స్థలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అక్కడ బృందావన్‌ గార్డెన్‌ లాంటి ఫౌంటేన్‌ మ్యూజికల్‌ వాటర్‌ పార్కు ఏర్పాటు చేయవచ్చు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు తుపాకులగూడెం, దుమ్మగూడెం బ్యారేజిలు కూడా నిర్మితమవుతున్నాయి. వీటికి ఆనుకునే అనేక ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, గూడెం సత్యనారాయణస్వామి, కోటి లింగాల, పర్ణశాల, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలున్నాయి. రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో బొగ్గు గనులున్నాయి. ఓపెన్‌ కాస్ట్‌, అండర్‌ గ్రౌండుల్లో బొగ్గు ఉత్పత్తి ఎలా అవుతుందో పర్యాటకులకు చూపించవచ్చు. పంపుహౌజుల పనితీరును చూపించవచ్చు. రామగుండం, జైపూర్లో (ఆదిలాబాద్‌ జిల్లా) విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను కూడా సందర్శనీయ ప్రాంతాలుగా తీర్చిదిద్దవచ్చు. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పర్యాటక కేంద్రా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Other Updates