maga

గోపి గీసే గీతలలో జీవితం తొణికిసలాడుతుంది. సృజన కుదురువేసుకుని కూర్చుంటుంది. అందం-ఆటవిడుపులా అంతా తానై ఆక్రమిస్తుంది.

పైగా ఆయన ఎప్పుడూ కదిలే బొమ్మలే వేస్తుంటాడు. అవి తప్పకుండా అందరినీ కదిలించి వేస్తుంటాయి. సహజంగా వేయడం, సౌందర్యంగా తీర్చిదిద్దడం ఆయన నైజం.

”బాపురే” అనిపించే బొమ్మలు వేసిన బాపే, ”భేష్‌” అని ఆయన్ని మెచ్చుకున్నాడు. ”గోపి ఏది గీస్తే అదే బొమ్మ” అన్నాడు. బాపు మాటకు మించిన ”యోగ్యతా పత్రం” మరొకటి లేదంటాడు గోపి.

నిజానికి బాపు గీతలో, గోపి గీతలోపైకి సారూప్యత కనిపించినా, లోన విభిన్నత ఉంది. కథలకు, సీరియల్‌ నవలలకు ఆర్షణీయమైన బొమ్మలు వేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ ప్రక్రియలో సుప్రసిద్ధ చిత్రకారుడు బాపు ఎక్కని ఎత్తులు లేవు. కథ ఆసాంతం ఆకళింపు చేసుకొని ఆయన బొమ్మ వేసేవారు. చాలా సందర్భాల్లో కథకుడికి అందని సంగతి కూడా బాపు బొమ్మలో కన్పించేది. దీనితో కథ అంత బాగా లేకపోయినా బాపు బొమ్మ మాత్రం ప్రేక్షకులకు లేదా పాఠకులను కట్టిపడేసేది. వీరి తీరు ఇట్లా ఉండగా, గోపి ఆయా కథలకు, నవలలకు వేసే చిత్రాలు ఆయా కథలను ఆమూలాగ్రం చదివి కథను మింగేయకుండా, కథలో కలిసిపోయేలా బొమ్మ వేయడం గోపిలోని గోప్యం.

పైగా ఒకటిరెండు బొమ్మలువేసి జాతీయస్థాయిలో చిత్రకారుడుగా గుర్తింపు పొందుతున్న వారున్న ఈ తరుణంలో పోల్చుకోలేని వేలాదిమంది. చిత్రాలు, రకరకాల భంగిమలలో గోపి వేశాడు. ముఖ్యంగా సమూహ చిత్రాలు, వాటి కూర్పులో గోపి రేఖావిన్యాసం ప్రేక్షకులను విస్మయపరుస్తుంది.

1972 నుంచి వేసిన బొమ్మ వేయకుండా వేలాది చిత్రాలు వేశాడు గోపి. తొలుదొలుత ”అపరాధ పరిశోధన” పత్రికలో కథలకు తగిన చిత్రాలు వేయడంతో ప్రారంభమైన గోపి చిత్రకళాయాత్ర గత నాలుగున్నర దశాబ్దాలుగా అనేక ఎత్తుపల్లాలు దాటి ధాటిగా సాగుతున్నది.

పరిశీలన, సాధనకే ఎక్కువ సమయం వెచ్చించే గోపి కొత్త నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లూరు సమీపంలోని ఎనమట్ల గ్రామంలో నారాయణమ్మ-హన్మంత గౌడ్‌ దంపతులకు 1952లో జన్మించాడు. తల్లిదండ్రులు గోపాలు గౌడ్‌ అని పేరు పెట్టారు. కానీ ఆయన ఇవ్వాళ ‘గోపి’గా గుర్తింపు పొందాడు. తండ్రి ఇచ్చిన స్వేచ్ఛవల్ల సినిమాలపట్ల గోపాలుకు ఆకర్షణ పెరిగింది. అప్పట్లో కొత్త సినిమావస్తే ఎడ్లబండి కట్టుకుని కొల్లాపూర్‌ వెళ్ళి టూరింగ్‌ టాకీస్‌లో సినిమాచూసి, పాటల పుస్తకం కొనుక్కుని వచ్చి పాటలు పాడుకునేవారు. ఎనమట్లలో ప్రాథమిక విద్య చదివే రోజుల్లో పట్టిన సినిమా పిచ్చి, సింగోటం ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు మరింత ముదిరిపోయింది.

ప్రాథమిక పాఠశాలలో బాలకిష్టయ్యసారు తరగతిలోకి రాగానే బోర్డు మీద చాక్‌పీస్‌తో రోజూ పిట్టబొమ్మ వేసేవాడు. ఆయన ఎట్లా పిట్టను వేస్తున్నాడో కన్నార్పకుండా చూసేవాడు గోపాలు. ఆ బొమ్మ చూస్తే ”ఓ పుల్లా, ఓ పుడక, ఎండుగడ్డి, సిన్నకొమ్మ, పిట్టగూడు, పిట్టబతుకు ఎంతో హాయి” అన్న గోరటి వెంకన్న గీతం మదిలో మెదిలేది. ఒక్కోసారి ఉమ్మెత్తపూవు తెప్పించి, దాన్ని చూసి పిల్లలందర్నీ బొమ్మ వేయమనేవాడట. అప్పుడు ఎనిమిది, తొమ్మిదేండ్ల ప్రాయంలో ఉన్న గోపాలు గీసింది బాగుందని చాలాసార్లు మెచ్చుకునేవాడు. ఆ సారు మెప్పుల కోసమే శ్రద్ధగా బొమ్మలు వేయడం ప్రారంభించాడు గోపాలు.

ఆ తర్వాత హైస్కూలులో చేరేనాటికి గోపాలు మేనమామ పుల్లయ్యగౌడ్‌ ప్రభావానికి లోనయ్యాడు. పుల్లయ్యగౌడ్‌కు ప్రఖ్యాత చిత్రకారుడు వడ్డాది పాపయ్య బొమ్మలంటే ప్రాణం. ‘చందమామ’ పత్రికలో ఆయన వేసే బొమ్మలు చూసి, వాటి ప్రతికృతులు వేసేవాడు, గోపాలును వేయమనేవాడు.

అట్లా అమ్మాయిల బొమ్మలు, ఆ తర్వాత జంతువులు, పక్షుల బొమ్మలు వేయడం అలవాటైంది. అప్పట్లోనే ఒకసారి సాధారణ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి కాడెద్దుల గుర్తు ఉండేది. ప్రచారం నిమిత్తం ఊరంతా గోడలపై కాడెద్దుల బొమ్మలు గోపాలుతో వేయించారు. ఈ విధంగా సాధనతో ఏ బొమ్మంటే అది గీసే నేర్పరితనం గోపాలుకు వచ్చేసింది.

హైస్కూల్‌ చదువు పూర్తి కాగానే ప్రధానోపాధ్యాయుడు అచ్యుతరెడ్డి సలహా మేరకు హైదరాబాద్‌ వచ్చి జవహర్‌ లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తాలూకు లలితకళల కళాశాలలో చేరిపోయాడు. ఒక వంక కళాశాలలో అప్లైడ్‌ ఆర్ట్స్‌ చదువుతూ చిక్కడపల్లి రోడ్‌లో ఉండే ప్రసాద్‌ యాడ్స్‌లో అప్పుడు చిత్రకారుడుగా పనిచేసే అంబాజీ ప్రేరణతో ‘యాడ్స్‌’ రూపొందించడంలో నైపుణ్యం సాధించాడు. చదువు ముగియగానే ఫ్రీలాన్స్‌ కళాకారుడై వారపత్రికలలో ప్రచురితమయ్యే కథలకు, సీరియళ్లకు చూడచక్కని బొమ్మలు వేయడం ప్రారంభించాడు. ఈ శ్రేణిలో ”అపరాధ పరిశోధన”తో మొదలుపెట్టి ”ఆంధ్రపత్రిక” సచిత్ర వారపత్రిక, ”జ్యోతి” మాసపత్రిక తదితర పత్రికలన్నింటిలో బొమ్మలువేశాడు. ఈనాటికి ఆయన నిరంతరం బొమ్మలు వేస్తూనే ఉన్నాడు. ఎన్నో నవలలు, కథా సంకలనాలకు ముఖ చిత్రాలు వేశాడు. కార్టూన్లు గీశాడు. తెలుగు సమాచారం పేరున ఉమ్మడి తెలుగు ప్రభుత్వం ప్రారంభించిన ‘యాడ్స్‌’ సంస్థలో ఎన్నో చక్కని డిజైన్లు రూపొందించాడు. అక్షరాలను అందంగా, అపురూపంగా, అర్థవంతంగా డిజైన్‌ చేయడంలోనూ దిట్ట గోపి. ఈనాటికి అందరి కళ్ళలో కనిపించే ”ఉదయం”, ఆ తర్వాత ”వార్త” దినపత్రికల మాస్ట్‌ హెడ్‌ను రూపకల్పన చేసినది ఈయనే. విజయవాడలో మూడేండ్లు ఉండి ఎన్నెన్నో నవలలకు, కథా సంకలనాలకు ముఖ చిత్రాలు వేశాడు. యాడ్స్‌ డిజైన్‌ చేశాడు. సృజనాత్మక సినీ దర్శకుడు కె. విశ్వనాథ్‌ ”సిరిసిరిమువ్వ” కోసం మద్రాసు వెళ్ళి, అది కుదరక ఆ తర్వాత ‘రారా కృష్ణయ్య’, ‘ఊర్వశి నా ప్రేయసి’, ‘దొంగల దోపిడి’, ‘మా భూమి’, ‘రంగులకల’ చిత్రాలకు ప్రచార చిత్రాలు తయారు చేశారు. ‘మీడియా డైరీ’లో కొంతకాలం డిజైనర్‌గా ఉన్నారు. నదుల పుట్టు పూర్వోత్తరాలను కళ్ళకుకట్టే విధంగా గోపి వేసిన చిత్రాలను, గ్రాఫిక్‌ డిజైన్‌ కంపెనీ చక్కని క్యాలెండర్‌గా ప్రచురించింది.

ఏ బొమ్మ వేయాలన్నా, ఏ నమూనాను చూడకుండా అలవోకగా బొమ్మ వేయడం గోపి ప్రత్యేకత. బొమ్మ వేసేముందు ఒకసారి కళ్ళు మూసుకుంటే చిత్రంగా చిత్రం మొత్తం ఆయన కనుపాపపై ప్రత్యక్షమవుతా యంటారాయన.

ప్రస్తుతం’గోపిక’శీర్షికన పురాణ కథలలోని గోపికలు, గోపాలుడి తాలూకు సుమారు రెండు డజన్ల చిత్రాలు స్కెచ్‌లు వేయడంలో ఆయన నిమగ్నమయ్యారు. ఈ స్కెచ్‌లు, కొన్ని పూర్తయిన క్యాన్వాసులు చూస్తే రకరకాల భంగిమలు, వారి శరీరభాష, రేఖా విలాసం, సంప్రదాయ, జానపద సంగమం కనువిందు చేస్తాయి.

లోగడ ఆయన ‘మయూరి’ శీర్షికన వేసిన అనేక చిత్రాల్లో ఒకవంక నెమలి, దాని పింఛం, మరోవంక- నెచ్చలి, ఆమె అందచందాలు చూపరులను ఆకట్టుకుం టాయి. ఇవికాకుండా, ఆయన ‘బతుకమ్మ’, ‘బోనాలు’, ‘శ్రామికులు’లాంటి శీర్షికల వేసిన చిత్రాలు చెప్పుకోదగినవి.

వీరు హైదరాబాద్‌ ఆర్ట్స్‌ సొసైటీ 2015, 2016, 2017లో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొని తన ఉనికిని చాటారు. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ 2015లో ఏర్పాటు చేసిన ‘స్తవనీయ తెలంగాణ’ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ నిర్వహించిన ‘వర్ణ సమ్మేళనం’, శివోహంవారి చిత్ర కళా శిబిరాల్లో పాల్గొని అక్కడికక్కడే చిత్రాలు వేశాడు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2015లో రాష్ట్ర ప్రభుత్వం గీతే గమ్యంగా గీతే గమనంగా సాగుతున్న గోపిని సత్కరించింది.

టి. ఉడయవర్లు

Other Updates