dd‘శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ఉద్దండపిండం. ఉద్గ్రంథకర్త. సాహిత్య పరిశీలకుడేకాదు, చక్కని విమర్శకుడు. తెలుగు చదువే కరువైన దినాలలో నా సోదరులకు తెలుగు చదువుకునే హక్కున్నదని జబ్బచరిచి చెప్పిన గొప్పదనం. నిజాం నవాబు ఫర్మానాలకు నిలబడి యిదేమిటని తొలిసారి అడుగగలిగిన గుండె దిటవు ఆయనకే చెల్లింది. నిరంకుశ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ ‘గోలకొండ పత్రిక’ను నిర్వహించిన సాహసి ఆయన.’’ – సురవరం ప్రతాపరెడ్డి గురించి నార్ల వెంకటేశ్వరరావు

సురవరం ప్రతాపరెడ్డి అప్పటి గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉన్న బోరవెల్లి గ్రామంలో 1896వ సంవత్సరం మే 28 తేదీన తమ మాతామహుల యింట్లో జన్మించారు. కాని ఆయన స్వగ్రామం అలంపురం తాలూకాలోని ఇటిక్యాలపాడు. ‘మావూరు నీరులేని ఇటికాలపాడు’ అని చమత్కారంగా తమ వూరి గురించి ఆయన చెప్పుకునేవారు. హైదరాబాద్‌ నిజాం కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసిన ప్రతాపరెడ్డి అప్పటి మద్రాసు రాష్ట్రంలో బి.ఏ., బి.ఎల్‌. చదివారు. బి.ఏ. చదువుకునే రోజుల్లోనే వేదము వెంకటరాయ శాస్త్రి, వెల్లాలి రామకృష్ణ శాస్త్రి మొదలైన పండితుల ప్రభావం పడి సంస్కృతాంధ్ర భాషల్లో గొప్ప పాం డిత్యం సంపాదించారు. కర్నూలులో ప్రాక్టీసు ప్రా రంభిద్దామనుకునే సమయంలో హైదరాబాద్‌కు రావలసిందిగా రాజ బహదూర్‌ వెంకట్రామారెడ్డి నుంచి పిలుపు రాగానే హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. నాటినుంచి ఆయన కార్యరంగం హైదరాబాద్‌ నగరమే అయింది.1924లో ప్రారంభమైన గోలగొండ పత్రిక సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించారు.

ఆ సమయంలో సురవరం ప్రతాపరెడ్డి గారికి, ఓ పత్రిక ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కలిగింది. ప్రజానీకంలో జాగృతిని కలిగించడానికి ఒక ఉత్తమ పత్రిక అవసరమని ఆనాటి నగర కోత్వాల్‌ రాజ బహదూర్‌ వెంకట్రామారెడ్డిగారి అభిప్రాయంగా ఉండేది. ఇక విరాళాలకోసం ప్రయత్నాలు ప్రారంభమైనయి. రాజా బహదూర్‌గారిపై అభిమానంతో, పత్రిక అవసరాన్ని గుర్తించిన పెద్దల సహకారంతో ఆర్థిక సహాయం లభించింది.

1. రాజా రాజేశ్వరరావు బహదూర్‌గారు ` దోమకొండ సంస్థానాధీశులు
రూ. 1000 (వెయ్యి) కల్దార్‌
2. రాజా రామదేవ బహద్దూర్‌గారు ` వనపర్తి సంస్థానాధీశులు `
రూ. 1,000/` కల్దార్‌
3. కోదండ రామ్‌రెడ్డిగారు ` దేశ్‌ముఖ్‌ ` రూ. 1,000/` కల్దార్‌
4. రావు బహదూర్‌ ముస్త్యాల వెంకట కృష్ణయ్యగారు `
రూ. 1000/` కల్దార్‌
5. రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి ఓ.బి.ఇ.
రూ. 500/` కల్దార్‌
6. శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారు రూ. 250/` కల్దార్‌
7. కైలా బల్వంత రెడ్డిగారు రూ. 100/`హాలీ
8. రాజా రాజేశ్వరరావు బహదూర్‌గారు దోమకొండ
రూ. 100/` హాలీ (వ్యక్తిగతం)

బేతవోలు మఖ్తేదారు సీతారామచంద్రరావు గారు, అక్కినేపల్లి జానకీరామారావు గారు, రాజ భూపాలరావు బహదూరు గారు (అమరచింత సంస్థానం), చక్రహరి నరసరాజుగారు (వకీలు జటప్రోలు), పి.నరసింహారావుగారు (వకీలు కోటపల్లి) రాజారెడ్డి గారు (అల్లీపురం), కేశవరెడ్డిగారు (అమరచింత సంస్థానం), నడికుడ లక్ష్మారెడ్డిగారు దేశ్‌ముఖ్‌, కృష్ణాజీనాయక్‌గారు కాంట్రాక్టరు, బి. వెంకటకృష్ణారెడ్డిగారు (నిజాం సాగర్‌), రాజపోషకులు, పోషకులు, అభిమానులుగా తోడ్పడ్డారు.

ఈ మూల ధనంతో ప్రతాపరెడ్డిగారు స్వయంగా బెజవాడ, మద్రాసు నగరాలకు వెళ్ళి అచ్చు యంత్రాలను, టైపును కొని తెచ్చారు. మొదట యీ పత్రికను రెసిడెన్సీ బజారు (కోఠీ)లో స్థాపించాలనుకున్నారు. కానీ రెసిడెంట్‌నుంచి అనుమతి లభించలేదు. అప్పుడు నిజాం ప్రభుత్వం అనుమతిచ్చింది. కొన్ని సందర్భాలలో ఆనాటి నిజాం ప్రభుత్వమే మేలు అనిపించింది.

మొదట్లో గోలకొండ పత్రికను వారపత్రికగా తీద్దామని నిర్ణయించారు ప్రతాపరెడ్డిగారు. అప్పటికే రాష్ట్రంనుంచి రెండు వారపత్రికలు రావడంతో మరొకటి పోటీ ఎందుకని తన పత్రికను ద్వైవార పత్రికగా తీయడానికి పూనుకున్నారు.
పత్రిక ప్రారంభోత్సవం జరపడానికి ఫలాన శుభసమయమని ప్రతాపరెడ్డి నిర్ణయించలేదు. రాజ బహదూర్‌కు ఏ రోజు విరామం దొరికితే అదే శుభ సమయమనుకున్నారు. 1926 మే 5వ తేదీన 10 గంటలకు పత్రికను ప్రారంభిద్దామని రాజా బహదూర్‌ హుకుం అయింది. అదే రోజు అదే సమయంలో పత్రిక ప్రారంభోత్సవం జరిగింది. ఈ విధంగా పంచాంగంతో సంబంధంలేని శుభ ముహూర్తంలో గోలకొండ ద్వైవార పత్రిక ప్రారంభమైంది.

తెలుగు పత్రికలపై ఆదరణలేని రోజుల్లో దాన్ని సవాల్‌గా తీసుకొని ప్రతాపరెడ్డిగారు పత్రికను నడిపారు. ఆ రోజులలో పత్రిక నడపడమంటే మామూలు విషయంకాదు. ఈనాటి సౌకర్యాలు పత్రికలకు ఆనాడు లేవు. తానే సంపాదకుడు. తానే ప్రూపు రీడరు. పైగా పత్రికని నిషేధిస్తామని ప్రభుత్వం బెదిరింపులు. ఏమైనా ప్రతాపరెడ్డిగారు దీన్నొక అగ్నిపరీక్షగా ఎదుర్కొని పత్రికని నడిపారు. అది అడుగుపెట్టనివూరు తెలంగాణలో లేదు. 1947 వరకు ఆయనే ఆ పత్రిక సంపాదకుడు. 1934లో ఒక ప్రబుద్ధుడు తెలంగాణాలో కవులే లేరని ఒక వ్యాసం రాసి గోలకొండకు పంపారు. దీనిని చూసి ప్రతాపరెడ్డిగారు మండిపడ్డారు. తెలంగాణలో గాలించి 354మంది కవుల సంస్కృతాంధ్ర రచనలను సేకరించి ‘గోలకొండ కవుల సంచిక’ను ప్రచురించారు. ఆయన రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషములు, హిందువుల పండుగలు, పరిశోధకుడుగా ఆయన స్థానాన్ని తెలుగు సాహిత్య ప్రపంచంలో సుస్థిరం చేశాయి. తెలుగులో మొదటి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ఆయనకే లభించింది. ఆయన గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషించారు.విజ్ఞానవర్థని వంటి సంస్థలను స్థాపించి వైజ్ఞానిక, సాహిత్యరంగంలో గ్రంథాలని ప్రకటించారు. గోలకొండ పత్రిక తర్వాత ప్రతారెడ్డిగారు ‘ప్రజావాణి’ అనే పత్రికను కొన్నాళ్ళు నడిపారు.

ఆంధ్ర మహాసభ స్థాపకుల్లో సురవరం ప్రతాపరెడ్డిగారొకరు. ప్రథమాంధ్ర మహాసభకు ఆయనే అధ్యక్షుడు. ఆంధ్ర సారస్వత పరిషత్తూ, రెడ్డి హాస్టల్‌, శ్రీకృష్ణ దేవరాయంధ్ర భాషానిలయం మొదలైన సంస్థలకు ఆయన తన సేవలందించారు. 1952లో హైదరాబాద్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. 1953 ఆగస్టు 25వ తేదీన ఆయన కన్నుమూసారు. ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రికను ప్రారంభించడంతో తెలంగాణాలో కవుల చైతన్యం ప్రసారమైనది.

Other Updates