హైదరాబాద్ నగరం నిర్మాణం ఇంకా జరగని సమయంలోనే శత్రుదుర్భేద్యంగా నిర్మాణమై కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, మొగలులు, అసఫ్‌జాహీలు పాలించిన అద్భుతమైన కోట గోల్కొండ కోట. దాదాపు 8 శతాబ్ధాల ఘన చరిత్రను తనలో ఇముడ్చుకున్న కోట. మన భాగ్యనగరం హైదరాబాద్ నడిబొడ్డులో స్వర్ణ కవచంలా నేటికీ ఠీవీగా నిలబడి వున్న కోట ‘గోలకొండ కోట’.
సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ కోట కాకతీయ చక్రవర్తుల ఆధీనంలో వుండేది. అంతకంటే ముందు అంటే సుమారు 9వ శతాబ్ధ సమయంలో రాష్ట్ర కూటుల ఆధీనంలో వుండేది. ఆ సమయంలో కాకతీయులు రాష్ట్ర కూటుల దగ్గర సేనానులుగా పనిచేశారు. తరువాతి కాలంలో అంటే 1083వ సంవత్సరంలో కాకతీయులు స్వతంత్ర రాజులుగా ఏర్పడ్డారు. తమ రాజ్య విస్తరణను గోలకొండ నుండే ప్రారంభించి తెలుగు జాతిని ఒక్కతాటిపైకి తెచ్చి తమ రాజ్య విస్తరణను విస్తృతపరచడం ప్రారంభించారు. 1083వ సంవత్సరం నుండి 1323వ సంవత్సరం వరకు కాకతీయ రాజులు గోలకొండ ప్రాంతాన్ని అప్రతిహతంగా పాలించారు. ఈ సమయంలోనే కాకతీయ రాజులు తమ రాజ్య విస్తరణతోబాటు తమ ప్రజా సంక్షేమానికి సంబంధించిన అనేక పనులను ప్రారంభించి సఫలమయ్యారు. వారు చేపట్టిన నిర్మాణాలలో గొలుసు చెరువుల నిర్మాణం, దేవాలయాల నిర్మాణాలు, కోటల నిర్మాణాలు ముఖ్యమైనవి. అలా వారు కట్టించిన కోటలలో గోలకొండ కోట కూడా ఒకటి.
నిజానికి ‘గోలకొండ’ అసలు పేరు. ‘గొల్లకొండ’. ఈ ప్రాంతంలో గొర్రెల కాపరుల సంచారం, అలాగే గొల్లవారు చాలామందే నివసించేవారని సమాచారం. సుమారు 1143వ సంవత్సరంలో మంగళవరం అనే ప్రాంతంలో గొర్రెలు కాస్తున్న ఒక గొర్రెల కాపరికి ఒక దేవతా విగ్రహం కనబడింది. ఆ విషయాన్ని కాకతీయ రాజులకు వారు చేరవేయడంతో వారు ఆ దేవతను మొక్కి అక్కడే మట్టికోట నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కోట ఓరుగల్లు కోటకు దీటుగా నిర్మించబడిన కోట. ఈ కోటను స్వాధీనపరచు కోవాలని ఎంతో మంది చక్రవర్తులు, రాజులు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
కాకతీయుల కాలాన్ని స్వర్ణయుగంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. ఎందుకంటే వారి కాలంలోనే అనేక మంది కళాకారులు చిత్రకారులు, శిల్పులు, తమ ప్రతిభకు తగిన గుర్తింపును పొందారు. విద్య, వ్యాపార, వ్యవసాయాది రంగాలకు మంచి ప్రాధాన్యత కల్పించి ప్రజా సంక్షేమమే తమ రాజ్య సంక్షేమంగా భావించేవారు కాకతీయులు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి దానికి తగ్గట్టుగా తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చేవారు కాకతీయ చక్రవర్తులు. కాలక్రమేణ గోలకొండ కోటకున్న ప్రాధాన్యత గమనించిన ఇతర రాజ్యాల రాజులు ఈ కోటను ఆక్రమించడానికి, తమ దండయాత్రను ముమ్మరం చేశారు. 1323వ సంవత్సరంలో మాత్రం గోలకొండ కోట గియాసుద్దీన్ తుగ్లక్ కొడుకు ఉలూమ్‌ఖాన్ చేతుల్లోకి మారింది. కాని కాకతీయ వారసులైన ముసునూరి నాయకులు తిరిగి రాజ్యాన్ని తమ చేజిక్కించుకొన్నారు.
1347వ సంవత్సరంలో బహుమనీ సుల్తానులకు, ముసునూరి నాయకులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం చాలాకాలంపాటు సుదీర్ఘంగా సాగింది. ఈ క్రమంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో కాకతీయ సామ్రాజ్యం కూడా పతనమయ్యే అవకాశముందని గ్రహించిన కాకతీయులు చివరికి బహుమనీ సుల్తానులతో సంధికి యత్నించి సఫలమయ్యారు. సంధిలో భాగంగా 300 ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల నాణేలతోపాటు గోల్కొండ రాజ్యాన్ని అజీమ్ హుమయూన్‌కు వారు అప్పగించారు. అప్పటి నుండి ఈ కోట బహమనీ సుల్తానుల ఆధీనంలోకి వెళ్ళింది.
1463వ సంవత్సరంలో దక్కనులో ఏర్పడిన తీవ్రమైన స్థానిక పరిస్థితులను చక్కదిద్దడానికి బహుమనీ సుల్దాన్ మహ్మద్‌షా బహుమనీ తన టర్కీ సైనికాధికారి సుల్తాన్ కులీకుతుబ్ మాలిక్‌ను దక్కను ప్రాంతానికి సుబేదారుగా నియమించి ఆ అల్లర్లను అణచివేయడానికి పంపించాడు. స్థానికంగా చెలరేగిన అల్లర్లను నైపుణ్యంతో అణచివేసిన కులీకుతుబ్ మాలిక్‌ను తన రాజ ప్రతినిధిగా, సుబే దారుగా శాశ్వతంగా నియమించి గోల్కొండ కోట కేంద్రంగా పాలన కొనసాగించని బహుమనీ ఆదేశించాడు. ఆ విధంగా ఈ కోటను బహుమనీ సుల్తానులు 1518వ సంవత్సరం వరకు పాలించారు.
1518వ సంవత్సరం నుండి 1687 వరకు అనగా 171 సంవత్సరాలు ఈ కోట కుతుబ్‌షాహీల పాలనలో వైభవాన్ని చవిచూసింది. కుతుబ్‌షాహీలు తుర్క మెనిస్తాన్ – ఆర్మేనియా ప్రాంతంలోని తుర్కమెన్ తెగకు చెందిన షియా ముస్లిములు. 1463వ సంవత్సరం నుండే కుతుబ్‌షాహీవంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ ముల్క్ బహుమనీ సుల్తానుల దగ్గర సుబేదారుగా పనిచేసాడు. స్వతంత్ర రాజ్య కాంక్షతో 1518వ సంవత్సరంలో బహుమనీ సుల్తానులపై కులీకుతుబ్‌షాహీలు తిరుగుబాటు చేశారు. అప్పటికే గోల్కొండ కోట ఎంతో పటిష్టంగా తీర్చిదిద్దబడింది. తిరుగుబాటు యుద్ధంలో కులీకుతుబ్‌షాహీలు విజయం సాధించి స్వతంత్య్ర రాజులుగా ప్రకటించుకున్నారు. అప్పటివరకూ మట్టికోటగా వున్న ఈ కోటను రాతి కోటగా తీర్చిదిద్దింది కుతుబ్‌షాహీలే. దాదాపు 10 కి.మీ. చుట్టు కొలతతో 12 అడుగుల ఎత్తయిన ప్రహరీగోడను ఆ రోజుల్లోనే వారు నిర్మించారంటే ఈ కోట ఏమాత్రం పెద్దదో, ఎంత పటిష్టత కలిగి వుందో మనం ఊహించవచ్చు.
దాదాపు 171 సంవత్సరాల పాటు అప్రతిహతంగా గోల్కొండ సామ్రాజ్యాన్ని సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ (1518-1543), జంషీద్ కులీకుతుబ్‌షా (1543-1550), సుభాన్ కులీ కుతుబ్‌షా (1550), ఇబ్రహీం కులీకుతుబ్ షా (1550-1580), మహ్మద్ కులీ కుతుబ్‌షా (1580-1612), సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా (1612-1626), అబ్దుల్లా కుతుబ్‌షా (1626-1672), అబ్దుల్ హాసన్ కుతుబ్‌షా (తానీషా-1672-1687) అనే ఎనిమిది మంది కుతుబ్‌షాహీలు వైభవంగా పాలించారు.
గోల్కొండ కోటపై 1636వ సం||లో మొదటిసారి మొఘలుల దండయాత్ర జరిగింది. రెండవసారి 1656వ సంవత్సరంలో దండయాత్ర జరిగింది. ఆ సమయంలో అబ్ధుల్లా కుతుబ్‌షా మొఘలులకు అపార ధనరాసులు సమర్పించి సంధి చేసుకున్నాడు. ఔరంగజేబు కన్ను దక్కనుపై పడటంతో ఈ కోట పాలన చేతులు మారింది. ఇతని పాలనా సమయంలో కోట చాలా వరకు ధ్వంసమయింది. కుతుబ్‌షాహీల కాలంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఆ సమయంలోనే గోల్కొండకు దీటుగా హైదరాబాద్ నగర నిర్మాణానికి నాంది పలికింది కుతుబ్‌షాహీలే. సాధారణంగా ఎలాంటి నిర్మాణాలయినా పునాదులతో ప్రారంభిస్తారు. అందుకు విరుద్ధంగా ఈ కోట నిర్మాణం మాత్రంపై భాగం నుండి నిర్మించుకుంటూ కిందికి వచ్చారు. గోల్కొండ కోటలో నాలుగు వేర్వేరు కోటల నిర్మాణాలున్నాయి. అలాగే 87 అర్థచంద్రాకారపు బురుజులున్నాయి. వీటన్నింటినీ కలుపుతూ దాదాపు 10 కి.మీ. వరకు ఎత్తయిన గోడ వుంటుంది. ఇప్పటికీ కొన్ని ఫిరంగులు చెక్కు చెదరకుండా తమ రాజసాన్ని ప్రదర్శిస్తున్నాయి.
కోటకు ప్రధాన ద్వారాలుగా 8 సింహ ద్వారాలున్నాయి. వీటన్నిటితోబాటు పొడవైన రాజ దర్బారులు, మసీదులు, దేవాలయాలు, అశ్వ గజశాలలు కోటలో కొలువైవున్నాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన గోల్కొండ కోట నిర్మాణానికి దాదాపు 62 సంవత్సరాలు పట్టింది. సింహ ద్వారాన్ని ఫతే దర్వాజ అని అంటారు. ‘ఫతే’ అనగా ‘విజయం’ అని అర్థం. ‘ఫతే దర్వాజ’ నుండే కోట లోపలికి ప్రవేశించవచ్చు. కోట మొత్తాన్ని కూడా కప్పుతూ కవచంలా వుంటే గోడ ‘బాలాఇసా గోడ’ దీనినే కర్టెెన్ వాల్ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడికి శత్రు సైనికులు చేరుకోవాలంటే మృత్యువుతో చెలగాటం లాంటిది. ఇక్కడి నుండే ఫతే దర్వాజా వరకు సైనికులు హెచ్చరికగా చప్పట్లు కొట్టేవారు. ఈ శబ్ధం కోట అంతా మారుమ్రోగి శత్రువుల రాకకు హెచ్చరికగా భావించేవారు.
ప్రతి ద్వారం దగ్గర ఒక ఇనుప దర్వాజా అమర్చబడి వుంది. ఒక్కసారి క్షుణ్ణంగా ఈ ద్వారాలను పరిశీలిస్తే అవి ఎంత పటిష్ఠమైనవో గట్టివో, ఎంతటి నైపుణ్యంతో అవి చేయబడ్డాయో అర్థమవుతాయి. వీటి ఎత్తు సుమారు 24 అడుగుల వరకు వుంటుంది. ఇక్కడి ప్రతి నిర్మాణాల్లో వజ్రపు ఆకారపు సముదాయాలు కనిపిస్తాయి. ఇది నాటి గోల్కొండ సామ్రాజ్యంలో వైభవంగా జరిగిన వజ్రపు వ్యాపారానికి చిహ్నంగా నిలుస్తాయని చరిత్రకారుల అంచనా. ఈ సముదాయం నుండే 300 మెట్ల వరకు పైకి ఎక్కితే ‘బారాదరి’కి చేరుతాం. 800 ఏళ్ళ నాటి ఈ నిర్మాణ కౌశలాన్ని చూస్తే ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ప్రతి కట్టడం పర్షియన్, ఇస్లామిక్ నిర్మాణ నైపుణ్యంతో ఉంటూ శిల్పుల అద్భుత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. ధ్వనికి ప్రతిధ్వని అనే భౌతిక శాస్త్ర సూత్రాన్ని పాటించి నిర్మించిన నిర్మాణాలు అద్వితీయం, అమోఘమనే చెప్పవచ్చు. గోల్కొండ కోటలో దాదాపు 5 మంచినీటి బావులున్నాయి. ఈ బావులన్నీ కూడా గ్రానైట్‌తో నిర్మించినవే. వీటి నిర్మాణాల కోసం వాడిన పనిముట్లు మనకు ఇప్పటికీ దర్శనమిస్తాయి. రాజ దర్బార్‌కు చేరుకోవడానికి ఈ కోటలో మూడు మార్గాలు వేర్వేరుగా నిర్మించబడ్డాయి. మొదటి దాని గుండా వెళితే మనం నేరుగా రాజ దర్బారు వరకు వెళ్తాము. ఈ దారిలోనే రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్నను అబ్దుల్ హాసన్ తానీషా బంధించిన చెరసాల వుంటుంది. ఈ చెరసాలలో రామదాసులవారు 12 సంవత్సరాలు బందీ కాబడ్డారు. ఈ కాలంలో రామదాసు, సీతారాములవారిని తలుస్తూ రాతి విగ్రహాలను చెరసాలలో చెక్కాడు. అవి నేటికి కూడా అతని భక్తికి ప్రతీకలుగా మనకు దర్శనమిస్తాయి. అలాగే రెండో దారి సేవకుల దారి ఈ దారిలో వెళ్తుంటే సైనికుల నివాస గృహాలు కనబడతాయి. ఇవన్నీ రాతి నిర్మాణాలే. ఈ దారిలోని మెట్లు కొంచెం తికమకగా వుంటూ శత్రువులకు అర్థంకానివిధంగా అయోమయంగా వుంటాయి. ఈ మెట్లు అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు సైనికుల స్థావర ప్రాంతానికి చేరుతాయి. దీంతో ఎక్కడో ఒక చోట శత్రువు పట్టుబడటం ఖాయం అయ్యేవిధంగా నిర్మించారు ఈ మెట్ల దారిని. ఈ సైనిక స్థావర ప్రాంతంలో ప్రతి యేడు సైనికుల ప్రవేశం జరిగేది. ఈ ప్రాంతంలో వున్న ఇనుప కడ్డీ సుమారు 240 కిలో బరువు కలది. దీన్ని ఎత్తి తక్కెడలో పెట్టగలవారిని మాత్రమే సైనికులుగా ఎంపిక చేసేవారు.
ఈ కోట కట్టడానికి ప్రధాన కారణం ఇక్కడి ఎల్లమ్మ తల్లి విగ్రహం. ఈ అమ్మకు ఆలయంగా ఈ కోటను అభివర్ణిస్తారు చరిత్రకారులు. అయితే కాలక్రమేణా కోట ప్రాంతంలో ముస్లిం రాజుల కాలంలో మసీదు నిర్మాణాలు కూడా జరిగాయి. కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళాపోషకులు, సాహిత్యాభిమానులు, వీరు పర్షియన్ సంస్కృతిని దక్కను ప్రాంతాలలో విస్తరించడమేగాక దక్కను భాషలైన తెలుగు, ఉర్ధూ భాషలను, సంస్కృతిని కూడా బాగా పోషించారు. కుతుబ్‌షాహీల కాలంలో కవులు చాలా వైభోగాలను చూశారు. కుతుబ్‌షాహీల కాలంలో అక్కన్న, మాదన్నలు పేరుగాంచిన కవులు వుండేవారు. వీరి విడిది గృహాలు కుతుబ్‌షాహీల దర్బారును ఆనుకునే వుండేవి. వీటికి దగ్గర ప్రాంతంలోనే కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి కాళీమాత దేవాలయం మనకు నేటికీ కనిపిస్తుంది. ప్రతియేడు ఇక్కడ బోనాల జాతర చాలా వైభవోపేతంగా జరుగుతుంది. ఆషాడమాసం ప్రారంభంలో హైదరాబాద్ నగరం అంతా వైభవంగా జరిగే బోనాల ఉత్సవాలు ఈ ప్రాంతం నుండే మొదలవుతాయి. అలాగే ఆఖరి బోనాలు కూడా ఇక్కడే ముగుస్తాయి. ఈ కోటలో రెండు మసీదులున్నాయి. ఒక్కటి నవాబు కట్టించింది. దీన్ని 1518వ సం||లో కట్టించారు. ఈ మసీదు మినార్‌లతో, బురుజులతో చాలా అందంగా వుంటుంది. ఈ నిర్మాణాన్ని ఇండో పర్షియన్ తరహాలో నిర్మించారు.
ఆ తరువాతి కాలంలో ఈ మినార్‌ల ఆధారంగానే చార్మినార్‌ను కూడా నిర్మించారని చరిత్రకారుల కథనం. ఇదంతా పర్షియన్ ఆర్కిటెక్చర్. మరో మసీదు ‘తారామతి మసీదు’. తారామతి కోసం కట్టిన మసీదే ‘తారామతి మసీదు’.
ఈ కోటలోని ముస్లిం మహిళలు నిత్యం చేసే నమాజ్ కోసం కట్టిందే ఈ ‘తారామతి మసీదు’. అలాగే కోటలో వున్న అనేక రాజమందిరాలు, రాణీ వాసాలు, ప్రత్యేక వసతి గృహాలు చాలా ప్రత్యేకమైనవి. ఇందులో భాగమతి మందిరం ఒక్కటే మొగలుల దాడి తరువాత కొంచెం కళ తప్పింది. కానీ వాటి ఆనవాళ్ళు మాత్రం పదిలంగా వున్నాయి. ఆరోజుల్లోనే రాణులకోసం స్నానపు గదులను బాత్‌టబ్స్ వంటివి నిర్మించారు. కోట బయట రెండు వేర్వేరు మండపాలు వున్నాయి. అవే ‘తారావతి, ప్రేమావతి’ మందిరాలు. కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చే మందిరాలే ఈ కళామందిరాలు. ఇక్కడి గోడలపై దీపాలను అమర్చడానికి దీపపు గూళ్ళను అమర్చారు. నాట్యకారుల నాట్య ప్రదర్శన వున్నంతసేపూ ఈ గూళ్ళు దీపాలతో వెలుగులు విరజిమ్మేవి. అలాగే రాజులు అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి రహస్య మార్గాలున్నాయి. ఈ రహస్య మార్గం గోల్కొండ నుండి చార్మినార్ వరకు వుంది. రాజ దర్బార్‌కు సమీపంగా ఆయుధ భాండాగారాలున్నాయి. వీటిలో మందుగుండు సామగ్రి, తోపులు భద్రపరిచేవారు. మందు గుండు సామగ్రిని భద్రపరచుటకు దాదాపు 150 గదులున్నాయి. ఇలాంటి అనేక విశేషాలు గోల్కొండ కోట నిండా అనేకం. ఇది దేశంలోనే ప్రత్యేకమైన కోట.
171 సంవత్సరాల పాటు అత్యంత వైభవానికి కళా పోషణకు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గోల్కొండ కోటపై 8 మాసాల సుదీర్ఘ పోరాటాన్ని ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు కొనసాగించి చివరికి 1687వ సం||లో ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. కుతుబ్ షాహీ వంశంలో చివరిరాజైన అబ్దుల్ హసన్ తానీషాను బంధించి ముందుగా బీదర్ జైలుకు తరలించి అనంతరం అతన్ని ఔరంగాబాద్ దగ్గరలోని దౌలతాబాద్ కారాగారంలో బంధించారు. 12 సంవత్సరాలు సుదీర్థ ఖైదు జీవితంలో విసిగిపోయిన కుతుబ్ షాహీ చక్రవర్తి అబ్దుల్ హాసన్ తానీషా చివరికి ఖైదీగానే మరణించాడు. జాన్ సఫర్ ఖాన్ గోల్కొండకు ఔరంగజేబు తరపున గవర్నర్‌గా నియమించబడ్డాడు. అతని పాలనలో కోట చాలా వరకు ధ్వంసానికి గురయింది.
‘గోల్కొండ కోట’లో పర్యాటకులకు ఆకర్షించడానికి సౌండ్ అండ్ లైట్ షోని తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రతినిత్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ద్వారా రూపొందించిన ఈ షో ద్వారా ‘గోల్కొండ కోట’ చారిత్రక వైభవాన్ని వేలాదిమందికి తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కోట వైభవాన్ని కాపాడటానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటి, రెండవ స్వాతంత్య్ర దినోత్సవాల్ని ఈ కోటలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. దీంతో ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖలు కోట రక్షణకు నడుం బిగించి కోటకు సంబంధించిన చారిత్రక వారసత్వ సంపదను కాపాడటానికి చర్యలు తీసుకొంటున్నారు. నిత్యం వేలాదిమంది సందర్శించే ‘గోల్కొండ కోట’ తెలంగాణ చరిత్రకు మణిహారం వంటిది.
కోటకు ప్రధాన ద్వారాలుగా 8 సింహ ద్వారాలున్నాయి. వీటన్నిటితోబాటు పొడవైన రాజ దర్బారులు, మసీదులు, దేవాలయాలు, అశ్వ గజశాలలు కోటలో కొలువై వున్నాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన గోల్కొండ కోట నిర్మాణానికి దాదాపు 62 సంవత్సరాలు పట్టింది.
శ్రీ నాగబాల సురేష్ కుమార్