రాష్ట్రంలోని చేతివృత్తుల పనివారికి, చేనేత కార్మికులకు చేయూతనందించే ప్రణాళికలు, కార్యరూపం దాల్చబోతున్నాయి. ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు అమలు జరిగేవిధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వడంకోసం చేనేత టెక్స్‌టైల్, ఐటీశాఖలమంత్రి కేటీ రామారావు ఉన్నతాధికారులతో డిసెంబర్ 7న చేనేత, హ్యాండీక్రాఫ్ట్స్ కమిషనర్ శైలజా రామయ్యర్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో చేనేత, హ్యండిక్రాప్ట్స్‌కు మునుపెన్నడు లేనంతగా చేయూత నిచ్చేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉన్నదని మంత్రి కెటి రామారావు తెలిపారు. చేనేత, హ్యండి క్రాప్ట్స్ శాఖలో అవసరమైన పలు నిర్ణయాలను మంత్రి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో గొల్కోండ( పాత పేరు లేపాక్షి) దుకాణాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు హ్యాండిక్రాప్ట్స్ కళాకారులకు రాష్ట్ర వ్యాప్తంగా పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి తెలియజేశారు. నిర్మల్ లోని కళాకారులకు ఒక కామన్ ఫెసిలిటి సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కేంద్రానికి అవసరం అయిన నిధులు, స్ధలం కేటాయింపు గురించి నిర్మల్ జిల్లా మంత్రి, స్ధానిక శాసన సభ్యులు ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఈ మేరకు తన నిధుల నుంచి ఈకేంద్రానికి అవసరమైన నిధులు ఇస్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హమీ ఇచ్చారు.
ఈ కేంద్రం ఏర్పాటుకు ప్రాథమిక అంచనా వ్యయం కోటిన్నర రూపాయలని మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ కేంద్ర నిర్మాణం పూర్తయ్యే లోపు సిద?ంగా ఉన్న భవనంలో ఈ కామన్ ఫెసిలిటి సెంటర్ ప్రారంభం చేయాలని అధికారులను అదేశించారు. వరంగల్ పట్టణంలో గోల్కొండ షోరూం ఏర్పాటుకు అవసరమైన 1500 గజాల స్ధలాన్ని కేటాయించాలని వరంగల్ నగర కమీషనర్ అమ్రాపాలిని అదేశించారు. మెదక్ లో మరో షోరూం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మెదక్ పట్టణంలో ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా జర్దౌసీ, ఝరీ వర్క్ షాప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని అ జిల్లా కలెక్టర్‌ను మంత్రి కోరారు. రంగారెడ్డి జిల్లాలోని ఎల్లమ్మ తాండలోని ఖాళీగా ఉన్న శిశు సంక్షేమ భవన్ గిరిజన హ్యండి క్రాప్ట్ కళాకారులకి అప్పగించాలని రంగరెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు.
హ్యాండిక్రాప్ట్స్‌లో యువతరానికి శిక్షణ ఇచ్చేలా సకల సౌకర్యాలతోకూడిన శిక్షణ సౌకర్యాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. శాశ్వత భవనం నిర్మాణం జరిగేంత వరకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భవనంలో ఈ శిక్షణ కేంద్ర పనులు ప్రారంభించేలా చూడాలని, ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.
హ్యండిక్రాప్ట్స్, చేనేత శాఖ కోసం కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి రావాల్సిన సహకారం, సౌకర్యాల విషయంలో ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని, వీటిని అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతామన్నారు.