tsmagazineరిజర్వాయరు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని మంత్రి ప్రకటించారు.వరంగల్‌, జనగామ, కరీంనగర్‌ జిల్లాల్లో కరవు పీడిత ప్రాంతాలకు ఈ రిజర్వాయర్‌ వరం అని ఆయన అన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ డివిజన్లో గౌరవెల్లి జలాశయం నిర్మాణానికి మంత్రి హరీశ్‌ రావు భూమిపూజ చేశారు.

పదవి వస్తే ఇంకా అణగి మణగి ఉండాలని, ప్రజలకు సేవకుడిలా పని చేయాలని తమ నాయకుడు కేసీఆర్‌ నేర్పారని మంత్రి అన్నారు. ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటామని ఆయన చెప్పారు.

”మీ బాధల్ని, కష్టాలను తొలగించడం మా బాధ్యత. మీ కలల్ని నిజం చేయడం మా బాధ్యత. మా పై విశ్వాసం ఉంచండి. కుటుంబంలో తల్లిదో మాట, తండ్రిదో మాట, అన్నదో మాట, అక్కదో మాట, చెల్లెదో మాట…ఉంటాయి.ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం” అని మంత్రి చెప్పారు.

ఎస్సాఆర్‌ ఎస్పీ నిండినా, నిండక పోయినా, వరద వచ్చినా, రాకపోయినా కాళేశ్వరం ద్వారా వరదకాలువ ప్రాజెక్టు ఒక్క ఏడాదిలోనే జీవకాలువగా మారనుందన్నారు. 1.4 టీఎంసీ వరద కాలువ ఉన్నప్పుడు 693 ఇండ్లు మునిగితే, ఇప్పడు 9 టీఎంసీలకు పెంచినా అదనంగా మునుగుతున్న ఇండ్లు 150 మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ట్టు హరీశ్‌ తెలిపారు. ఇప్పటికే 75 శాతం పూర్తయిందన్నారు.

మిడ్‌ మానేరు ప్రాజెక్టు నిర్మాణం 96 శాతం పూర్తి అయిందని ఆయన చెప్పారు. గౌరవెల్లి పూర్తి కాక ముందే ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా 80 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నదని అన్నారు. 75 కిలోమీటర్ల కాలువలో 73 కిలోమీటర్లు పూర్తయిందని చెప్పారు. వచ్చే వాన కాలానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు హుస్నాబాద్‌ కు వస్తాయని పేర్కొన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టులో 900 ఇండ్లు ముంపునకు గురవుతుంటే ఇందులో 700కు పైగా కుటుంబాలు ఒప్పుకోవడం జరిగిందని, మిగిలిన 220 కుటుంబాలతో మాట్లాడి ఒప్పిస్తామని మంత్రి తెలిపారు.

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని నీళ్ల మంత్రి హరీశ్‌ భరోసా ఇచ్చారు.

గత సర్కారు హయాంలో ఎకరాకు 2 లక్షలు ఇస్తే, తమ ప్రభుత్వం ఎకరాకు దాదాపు 7 లక్షలు చెల్లిస్తున్నామని చెప్పారు.

8 టీఎంసీల రిజర్వాయరులో చేపల ఉత్పత్తి చేపడితే పెద్ద ఎత్తున ఆదాయ వనరులు సమకూరుతాయని మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.మిడ్‌ మానేరు ప్రాజెక్టులో గత ప్రభుత్వం 7 ఏళ్ల కాలంలో 52 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేస్తే, తమ ప్రభుత్వం మూడేళ్లలో 4.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసిందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.గౌరవెల్లి రిజర్వాయర్‌ కోసం గతంలో చేసిన డిజైన్‌ వల్ల లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరివ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించారని, దీంతో ఈ జలాశయం సామర్థ్యం పెంచాలని సీఎం నిర్ణయించారని మంత్రి తెలిపారు. ప్రజా ప్రయోజనాల దష్ట్యా రీ డిజైన్‌ చేయించి 9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా చేశారని వివరించారు. దీంతో గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా కరువు పీడిత ప్రాంతాలలో లక్ష 60వేల ఎకరాలకు సాగు, తాగునీరు రెండు పంటలకు అందుతుందని మంత్రి చెప్పారు.

కరువు పీడిత ప్రాంతమైనందున వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా రెండేళ్లకు తాగునీరు సరఫరా జరుగుతుందని తెలిపారు.రిజర్వాయరులో చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందన్నారు.

రిజర్వాయరు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో భూగర్భ జలమట్టం పెరుగుతుందన్నారు. వ్యవసాయ బావులకు, గొట్టం బావుల కింద వ్యవసాయం ఊపందుకుంటుందని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. గౌరవెల్లి పాత జలాశయ ముంపు పరిధిలో 687 ఆవాసాలు ముంపునకు గురవుతుండగా వాటిలో 681 ఆవాసాలకు రూ.82.34కోట్ల పరిహారాన్ని చెల్లించారు.పాత ముంపు ప్రాంతాల పరిధిలోని సామాజిక ఆర్థిక మదింపు చేయగా ప్రాజెక్టు ప్రాంతం నుంచి 937 కుటుంబాలను గుర్తించారు. వారంతా వేర్వేరు ప్రాంతాలలో వ్యవసాయానికి, స్థిర నివాసం ఏర్పాటు కోసం ఆర్థిక తోడ్పాటు కావాలని కోరారు. పునరావాస కాలనీకి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. ఈ మేరకు భూనిర్వాసితులతో చర్చలు జరిపి కుటుంబానికి రూ.8లక్షల చొప్పున పునరావాస ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం చెల్లించింది.ఇందులో భాగంగా 707 నిర్వాసిత కుటుంబాలలో 553 కుటుంబాలకు రూ.44.24కోట్లను చెల్లించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్‌, జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామ రెడ్డి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌ , మాజీ ఎం.ఎల్‌.ఏ.చాడా వెంకటరెడ్డి, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Other Updates