‘‘గ్రామసీమలే దేశానికి పట్టుగొమ్మలు’’ అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. గ్రామ స్వరాజ్యాన్ని ఆయన కాంక్షించారు. స్వాతంత్య్రమనేది అట్టడుగు నుంచే రావాలని, పంచాయతీలు పటిష్టం కావాలని ఆయన కోరుకున్నారు.
స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు పూర్తి కావస్తున్నా గ్రామాలలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి వున్నాయి. కనీసం గుక్కెడు మంచినీటికి కూడా నోచుకోని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయంటేనే గ్రామసీమ దుస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఉద్యమ నాయకునిగా తెలంగాణ లోని గ్రామసీమలన్నీ కలియతిరిగిన ఈనాటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు ఈ సమస్యలన్నీ తెలియనివి కావు. అంతేకాదు, ఈ సమస్యలకు పరిష్కారం కూడా తెలిసిన నాయకుడాయన. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను సాధించవచ్చు అని 1985లోనే ఆయన ఆచరణలో నిరూపించారు.
మెదక్ జిల్లా నంగునూరు మండలం లో వాగుకు అవతలివైపు వున్న గట్ల మల్యా, ఖాత, కొండంరాజుపల్లి, ఘనపురం, అక్కెనపల్లి గ్రామాలకు అప్పట్లో రహదారి సౌకర్యం, రవాణా సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజలు 13 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళవలసి వచ్చేది. ఈ దుస్థితిని స్వయంగా గమనించి, ఆనాడు సిద్ధిపేట శాసన సభ్యునిగా వున్న కె చంద్రశేఖర రావు ప్రజలందరినీ కులుపుకొని 13 కిలోమీటర్ల రహదారిని శ్రమదానంతో నిర్మించారు. ఆయన రాత్రింబవళ్ళు అక్కడే బసచేసి, ప్రజలతోపాటు తానూ మట్టితవ్వి, తట్టమోసి శ్రమదానం చేశారు. కేవలం పక్షం రోజుల్లోనే రహదారి నిర్మాణం పూర్తి చేశారు. వెనువెంటనే ఆ గ్రామాలకు ఎర్రబస్సు కూడా కదలివచ్చింది. దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న బాధలకు కెసిఆర్ చొరవతో పక్షం రోజుల్లో పరిష్కారం లభించింది. అప్పట్లో ఈ సంఘటన ఓ సంచలనంగా నిలిచింది. అంతేకాదు, ఆ తరువాత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసేందుకు ఇది స్ఫూర్తిగా నిలిచింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ప్రజల సంఘటిత శక్తిపై గల అపార నమ్మకం, అదే స్ఫూర్తితో స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఇప్పుడు ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర, సమీకృత అభివృద్ధి కోసం, ప్రజలను సంపూర్ణంగా భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమం రూపొందించారు. రానున్న నాలుగేళ్ళలో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం కింద 25 వేల కోట్ల రూపాయలను గ్రామాలకు కేటాయిస్తారు.
ముఖ్యమంత్రిగారు కూడా మళ్లీ పలుగుపట్టి, తట్టమోసి గ్రామాలలో కార్యక్రమాలకు నాందిపలికారు. ముఖ్యమంత్రి పిలుపుతో గ్రామాలన్నీ చైతన్యంతో కదలి ముందడుగు వేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముగ్దులైన ఎందరో దాతల భారీ విరాళాలతో ముందుకు వచ్చి గ్రామజ్యోతికి ఇంధనం అందిస్తున్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమం విజయవంతమై గ్రామాలకు మెరుగునివ్వాలని ఆశిద్ధాం.
హోం
»