tsmagazineరాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వస్తున్నసందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. అన్ని గ్రామ పంచాయితీలకు స్పెషల్‌ ఆఫీసర్లు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా 9200 మంది కొత్తగా నియామకాలు చేస్తున్నామని వెల్లడిుంచారు. స్పెషల్‌ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శులు గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దే కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. గ్రామాల్లో తమదృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి వీలుగా పంచాయితీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి విచక్షణాధికారాల ద్వారా వినియోగించడానికి జిల్లాకు రూ.కోటి చొప్పున 30 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. స్పెషల్‌ ఆఫీసర్లు, పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

”కొత్తగా వచ్చే స్పెషల్‌ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శులకు ప్రస్తుతం గ్రామం ఎలా ఉంది? మూడేళ్ల తర్వాత గ్రామం ఎలా ఉండాలి? మూడేళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసు కోవాలి? అనే విషయంపై కార్యాచరణ ఇవ్వాలి. వాటి అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. కొత్తగా నియామకమయ్యే గ్రామ కార్యదర్శులకు మూడేళ్లు ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది. వారికి ఏఏ పనులు చేయాలనే విషయంలో మార్గదర్శనం చేయాలి. తమకు అప్పగించిన పనిని ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయాలి. పని బాగా చేసిన వారిని రెగ్యులరైజ్‌ చేయాలి. పనితీరు బాగాలేని వారిని తొలగించాలి. గ్రామాల్లో చెట్లు పెంచడం, నర్సరీలు ఏర్పాటు చేయడం, స్మశాన వాటిక నిర్మించడం, డంప్‌ యార్డు ఏర్పాటు చేయడం, పన్నులు వసూలు చేయడం తదితర పనులకు సంబంధించి చార్ట్‌ రూపొందించాలి. ఆయా విభాగాల్లో వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

”రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసుకున్నాము. చిన్న గ్రామ పంచాయి తీల వల్ల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ మరింత తేలిక అవుతుంది. కోర్టు కేసుల నేపథ్యలో పంచాయితీ ఎన్నికలు ఆలస్యమవు తున్నాయి. ఆలోగా అభివృద్ధి పనులు కుంటు పడకుండా ఉండేందుకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమిస్తున్నాం. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికైన సర్పంచులకు కూడా అసెంబ్లీలో చేసిన చట్టం ప్రకారం విధులు, బాధ్యతలు అప్పగించాలి. గ్రామాల అభివృద్దిలో గ్రామ పంచాయితీల పాత్రను క్రియాశీలం చేయాలి” అని సీఎం సూచించారు.

పంచాయతీలకు నిధులు
గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిపారు. పంచాయితీల్లో తక్కువ వేతనాలతో పనిచేసే వారి జీతాలు పెంచి, పంచాయితీల ద్వారా గ్రామాభివృద్ది పనులు చేయాలని నిర్ణయించారు. పంచాయితీ లకు అవసరమైన నిధులు సమకూర్చడానికి మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ మండలానికి ఒక సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు ఏర్పాటు చేసి మురికి నీరును శుభ్రం చేయాలని వివరించారు. పంచాయితీలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించనున్నట్లు వెల్లడించారు. పంచాయితీలను బలోపేతం చేయడమెలా? గ్రామంలో పచ్చదనం పెంచడానికి, పరిశుభ్రత కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్పెషల్‌ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శుల సేవలను ఎలా వినియోగించుకోవాలి? గ్రామ పంచాయితీలకు ఉండే ఖర్చు లేమిటి? ఆదాయా లేమిటి? తదితర విషయాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామ సర్పంచ్‌ నర్సింహగౌడ్‌కు సీఎం స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారు. గ్రామ పంచాయితీకి వచ్చే ఆదాయం, కట్టే కరెంటు బిల్లు, సిబ్బందికి చెల్లించే వేతనాలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. పంచాయితీ రాజ్‌ సంస్థలు ప్రతీ ఏటా కట్టే కరెంటు బిల్లులు ఎంతుంటాయని ఎస్‌.పి.డి.సి.ఎల్‌. సిఎండి రఘుమారెడ్డిని ఆరా తీశారు. ఏటా రూ.600 కోట్ల బిల్లులు కడతారని ఆయన చెప్పారు. పంచాయితీలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే ఉన్నతస్థాయి విస్తత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ సమీక్షలో మంత్రులు జగదీష్‌ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, వివేకానంద, కాలె యాదయ్య, పైళ్ల శేఖర్‌ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజ్‌, టిఎస్‌ఐఐసి చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సీనియర్‌ అధికారులు వికాస్‌ రాజ్‌, అరవింద్‌ కుమార్‌, నీతూ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Other Updates