cmతాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో, తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో సామూహిక గృహప్రవేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆ రెండు గ్రామాలలో కలయతిరిగి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామస్థుల ఆనందంలో పాలుపంచుకున్నారు. గృహనిర్మాణం ప్రారంభంనుంచి, గృహప్రవేశాలదాకా అన్నీతానై ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తూ నిర్మించిన ఆ రెండు గ్రామాలను చూసి, లబ్ధిదారుల ఆనందాన్నిచూసి కె.సి.ఆర్‌ పరవశించారు.

ఒకే ముహూర్తంలో రెండు గ్రామాల్లో సామూహికంగా గృహప్రవేశాలు నిర్వహించడంతో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో పండుగ వాతావారణం నెలకొంది. బంధుమిత్రులు, ఆడపడుచుల సందడితో, నూతన వస్త్రాలు ధరించి ప్రతి కుటుంబం ఇళ్లలో పాలుపొంగించి గృహప్రవేశం చేయడం కన్నుల పండుగగా సాగింది. పౌరులందరికీ బ్యాంకు ఖాతా పాస్‌ పుస్తకాలు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ లబ్దిదారులకు ఎల్‌.ఈ.డి బల్బులు, ఫ్యాన్లు కూడా పంపిణీచేశారు. ఈ రెండు గ్రామాల్లో సి.సి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, వైఫై కేబుల్‌, వీధుల్లో విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేయడంతో రాత్రివేళలో ఈ రెండు గ్రామాలు విద్యుత్‌ కాంతులతో కళకళలాడాయి. పేరుకు గ్రామాలైనా, పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సకల సౌకర్యాలతో విలసిల్లుతున్నాయి.

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో పేదలకు ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇచ్చిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ సామూహిక గృహప్రవేశాలు డిసెంబరు 23న అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ గృహప్రవేశాలను ముఖ్యమంత్రి ఆరోజు ఉదయం 7.15 నిముషాలకు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం 7.53 గంటలకు ఈ రెండు గ్రామాల ప్రజలు తమతమ ఇళ్ళలోకి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా నర్సన్నపేటలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

తొలుత ఎర్రవల్లి గ్రామ సమీపంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన కల్యాణ మండపాన్ని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ప్రారం భించి అక్కడ నిర్వహించిన పూజాకార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలలో ముఖ్యమంత్రి పర్యటించి, కొందరి గృహాలకు వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు గ్రామాలలో కలియతిరిగి ప్రతిఒక్కరినీ పలుకరించారు. ఎర్రవల్లి గ్రామ రచ్చబండ వద్ద కూర్చొని అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించారు.

అనంతరం ఎర్రవల్లి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు రెండింటినీ నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన కిరాణా దుకాణాలు, సెలూన్లు, చికెన్‌ షాపులు, తదితర వ్యాపారులకు నగదు రహిత లావాదేవీల నిర్వహణకు అవసరమైవ స్వైపింగ్‌ యంత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు.

రాష్ట్రానికే ఆదర్శం కావాలి

”ఎర్రవల్లి, నర్సన్నపేట ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేటటువంటి ఆదర్శ గ్రామాలుగా ఎదగాలి. స్వయంపాలిత, స్వయం శాసిత, స్వయంసమృద్ధ, స్వయం సహాయ గ్రామాలుగా ఎవరిమీదా ఆధారపడకుండా ఈ ఊరికి ఊరే, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుకొని ముందుకుపోయి ఆదర్శంగా నిలవాలి. ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉండి, బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు ఇది ఒక శిక్షణా కేంద్రాలుగా ఈ గ్రామాలు తయారు కావాలి” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు.

ఎర్రవల్లి, నరసన్నపేటలలో సామూహిక గృహప్రవేశాల సందర్భగా ఎర్రవల్లిలోని కల్యాణ మండపం వద్ద జరిగిన సభలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణలోని అన్ని గ్రామాలు ఈ విధంగా అభివృద్ధిచెందాలని ఆకాంక్షించారు. ”చాలా ఐకమత్యం సాధించాం. ఒక ఇంచుకూడా నేను పక్కకు జరగనన్నవారు వారి జాగను, వందల గజాల జాగను ఇతరుల ఇంటికోసం ఇవ్వడం కండ్లారా చూశాం. చాలా చైతన్యం వచ్చింది. మళ్లీ ఒకరోజు ఊరందరికీ సామూహిక భోజన కార్యక్రమం ఏర్పాటుచేసుకొని ముందుకు పురోగమించే లక్ష్యాలను నిర్దేశించుకొని మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం వుంది” అని గ్రామస్థులకు సి.ఎం చెప్పారు.

”ఇప్పటివరకూ మనం ఎక్కింది ఒక మెట్టు మాత్రమే. చక్కటి గ్రామం నిర్మించుకున్నాం. ఇంకా కొన్ని పనులు కావల్సి వుంది. మనమందరం కూడా కష్టపడి శ్రమదానంతోటి వాటన్నింటినీ చేసుకుందాం. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు, గ్రామ ప్రతినిధులకు, ఇక్కడున్న ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు” అని ముఖ్యమంత్రి చెప్పారు.

నగదురహిత గ్రామాలు

నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా ఎర్రవల్లి, నర్సన్నపేటలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ సందర్భంగా ప్రకటించారు. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, సిద్ధిపేట జిల్లాకి ఆదర్శంగా నిలిచేవిధంగా నీటిపారుదల శాఖా మంత్రి టి.హరీష్‌ రావు సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీం పూర్‌ గ్రామాన్ని మొట్టమొదటగా నగదురహిత లావాదేవీల గ్రామంగా మార్చి మార్గదర్శకులయ్యారని సి.ఎం చెప్పారు. సిద్ధిపేట జిల్లాలోనే మరో రెండు గ్రామాలు నగదురహిత లావాదేవీల గ్రామాలుగా ఏర్పడటం సంతోష దాయకమన్నారు. ఈ కార్యక్రమం అదు??తంగా విస్తరించి, నగదు రహిత లావాదేవీల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో వుండాలని సి.ఎం పిలుపు నిచ్చారు. ఈ సందర??ంగా స్వైప్‌ మిషన్లు పంపిణీచేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టి. హరీష్‌ రావు, ఎ. ఇంద్రకరణ్‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, జెడ్‌.పి ఛైర్‌ పర్సన్‌ రాజమణి మురళీయాదవ్‌, కలెక్టర్‌ వెంకట్రామ్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ హన్మంతరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ రెండు గ్రామాల ప్రత్యేకతలు

దేశంలోనే ప్రప్రథమంగా పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు

ఎర్రవల్లి, నర్లన్నపేట రెండు గ్రామాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు సుమారు 600

అందరికీ సమానంగా ఒక్కొక్కరికి 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం

అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు, లైటింగ్‌ ఏర్పాటు

మిషన్‌ భగీరథ పథకం క్రింద ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు

వెయ్యిమందికి సరిపడే కల్యాణ మండపం, భోజన శాల నిర్మాణం

ప్రతి కుటుంబానికి రెండు గేదెలు, 10 కోళ్ళ పంపిణీ

హరితహారం క్రింద ప్రతి ఇంటికీ 5 మొక్కలు పంపిణీ

పచ్చదనం వెల్లివిరిసేలా రహదారులకు ఇరువైపులా మొక్కలు

జలసంరక్షణ కోసం ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు

అధునాతన సౌకర్యాలలో భాగంగా ప్రతి ఇంటికీ ఇంటర్‌ నెట్‌ సేవలు

2800 ఎకరాలలో రైతులు సామూహిక పంట సాగు

2800 ఎకరాలలో 100 మంది రైతులకు బిందుసేద్యం పరికరాలు

మిషన్‌ కాకతీయ క్రింద 5 చెరువులు, కుడ్లేరు వాగుకు చెక్‌ డ్యాం నిర్మాణం

విత్తనోత్పత్తి కింద ఈ రెండు గ్రామాల్లో సోయాబీన్‌ అధిక దిగుబడి

Other Updates