పల్లెల ప్రగతికి చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమర్ధవంతంగా కొనసాగుతోంది. ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. 30 రోజుల్లో గ్రామాల్లో ఖచ్చితంగా మార్పురావాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించి, చేయిచేయి కలిపి ఆదర్శగ్రామాలను నిర్మించుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష. మన గ్రామాల మార్పుకు కథానాయకులు, మార్గదర్శకులు, విధాతలు మనమే కావాలి. మన చేతుల్లోనే మన గ్రామ భవిష్యత్తు ఉంది. గ్రామ పంచాయతీలకు అధికారాలు, నిధులను ప్రభుత్వం అందచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో పల్లెలు పచ్చదనం, పరిశుభ్రత వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.
జిల్లాలో ఈ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిగా చురుగ్గా సాగుతోంది. ఏళ్లతరబడి గ్రామాలను పట్టి పీడిస్తున్న సమస్యలను రూపుమాపేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యంతో ఇప్పటికే పల్లెల్లో మార్పులు కనిపిస్తున్నాయి. చెత్త, పొదలు, శిథిల భవనాల తొలగింపు.. విరిగిపోయిన విద్యుత్తు స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, వినియోగించని పాతబావుల పూడ్చివేత.. మురుగునీటి కాలువలను శుభ్రపర్చటం.. అవకాశం ఉన్న ప్రతి చోట వీలైనన్ని మొక్కల్ని నాటడం, కమ్యూనిటి, ఇనిస్టిట్యూషనల్, నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు పనులు ఇప్పుడు గ్రామగ్రామాన కనిపిస్తున్నాయి. ప్రజలు పల్లెలను స్వచ్ఛత దిశగా మార్చేందుకు పలుగు, పారా పట్టి ముందుకొచ్చాయి.. తమ వాడ.. తమ ఊరు బాగుకు ప్రతిన బూనుతున్నారు. మానవాళి మనుగడను శాసిస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తున్నారు. సేకరించిన వ్యర్ధాలను సిమెంట్, ఐటిసి పరిశ్రమలకు తరలించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించారు. ముళ్లపొదలను తొలగిస్తున్నారు, కాలువలను బాగుచేస్తూ గ్రామాల్లో పేరుకుపోయిన వ్యర్ధాల తుప్పును వదిలిస్తుండడంతో అభివద్ధివైపు పయనిస్తున్నాయి.
కలెక్టర్ ప్రతిరోజూ మండలాల్లో పర్యటిస్తూ అధికారులకు సలహాలు, సూచనలు అందచేస్తున్నారు. సేకరించిన ప్లాస్టిక్ పై నివేదికలు అందచేయాలని అధికారులను ఆదేశించారు. పల్లెల ప్రగతికి చేపట్టిన ఈ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుతో జిల్లాలోని అన్నీ గ్రామాలు పరిశుభ్రతను సంతరించుకుంటున్నాయి. కార్యాచరణ ప్రణాళిక ఆరంభంలో కొంత ఉదాసీనత కనిపించినా.. అధికారుల పర్యటనలతో కార్యక్రమం ఊపందుకుంది. జిల్లాలో పాడుబడిన బావుల్ని పూడ్చివేశారు. ప్రజలు పరిసరాల్లోనే కాకుండా ఇళ్లల్లోని వ్యర్ధాలను తడి పొడి చెత్తగా వేరు చేసి పొడి చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రహదారులకిరువైపులా ఉన్న పొదలను తొలగించారు. గ్రామ గ్రామాన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ఏర్పాటుకు స్థలాలను గుర్తిస్తున్నారు. కలెక్టర్ రజత్ కుమార్ షైనీ ఇంకుడు గుంతలపై ప్రత్యేక దష్టిసారించారు. ఇంకుడు గుంతలు ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు. మొక్కలను నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఇంటికీ అరేసి మొక్కలు చొప్పున పంపిణీ చేస్తున్నారు.
ర్యాలీలు, మానవ హారాలు..
విద్యార్థులు మేము సైతం అంటూ ముందుకొచ్చి శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగంతో వచ్చే అనర్థాలపై కలెక్టరు మండల కేంద్రాల్లో ర్యాలీలు, మానవ హారాలు నిర్వహించాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వేసేందుకు వీలుగా గ్రామంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్లాస్టిక్ వ్యర్థాలు వేయండని ఫ్లెక్సి ఏర్పాటు చేస్తున్నారు. సంవత్సరాల తరబడి రహదారుల వెంబడి పేరుకు పోయిన వ్యర్ధాల తొలగించి అందంగా మొక్కలు నాటుతున్నారు.
చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని దుకాణదారులకు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ప్రణాళికను కలెక్టర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రోజూ వీలైనన్ని గ్రామాలను సందర్శిస్తున్నారు. ప్రణాళికను పట్టించుకోని సిబ్బందిని విధుల నుండి తొలగిస్తానని ఆదేశాలు జారీచేశారు. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, గోడలపై విద్యార్థులచే పెయింటింగ్ వేయిస్తున్నారు. పెయింటింగ్‌కు అవసరమైన అన్ని పరికరాలను జిల్లా యంత్రాంగం ఉచితంగా అందచేస్తున్నారు.
ఎస్. శ్రీనివాస రావు