governerనైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేయాలని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనా పథకాన్ని రూపకల్పన చేసింది. ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబరు 2వ తేదీన హైదరాబాద్‌ దోమల్‌గూడలో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ సమాజాన్ని జాగృతం చేస్తున్నాయని ప్రశంసించారు. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తే అవి తెలంగాణలోని యువతకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

నేటి యువతకు మార్గ నిర్ధేశం చేయడంలో జాగృతి ఎంతో ముందున్నదన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ చేసిన వారు కూడా ప్యూన్‌ ఉద్యోగానికి ఎగబడుతున్నారంటే లోపం ఎక్కడుందో కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విద్య సరైన విద్య కాదేమోననే అనుమానం వస్తుందని, యువకులకు ఉపాధి అవకాశాలు చూపించే విద్య అవసరమన్నారు. అందుకే విద్యావిధానంలో సమూల సంస్కరణలు తేవాల్సిన అవసరాన్ని ఆయన తెలియపరిచారు. నేడు సరస్వతి దేవి లక్ష్మిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య ఉపాధి చూపించక పోవడం వల్లనే నిరుద్యోగులు పెరిగిపోతున్నారని గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు యువజనులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకు రావడంతో నిరుద్యోగులకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్‌ పేర్కొన్నారు.

కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖా మంత్రి రాజీవ్‌ప్రతాప్‌ రూఢీ మాట్లాడుతూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారంతా ఎందుకు పెద్దవాళ్ళు కాలేకపోతున్నారని ప్రశ్నించారు. మనం ఏం చదువుకున్నామో చెప్పుకునేకంటే ఏం చేస్తున్నామో చెప్పుకోవడమే మంచిదనే అభిప్రాయానికి యువత వచ్చిందంటే యువతలో ఎంతపెద్ద మార్పు రాబోతుందో తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కులవృత్తుల విషయంలో నైపుణ్యం సంపాదించడం చేయాలన్నారు. ప్రొఫెసర్లుగా అన్ని రంగాల్లో ఎదగాలని అంటూ వడ్రంగిలో ప్రొఫెసర్‌, వెల్డింగ్‌లో ప్రొఫెసర్‌, ప్లంబర్‌లో ప్రొఫెసర్‌లు ఎందుకు ఉండరాదని ప్రశ్నించారు. మానవాళికి ఉపయోగపడే పనులలో నైపుణ్యం సంపాదిస్తే అది వ్యక్తిగతంగా యువకులకు ఉపయోగపడడమే కాకుండా, సమాజానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. జాగృతి సంస్థ ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టడంతో ఇది విజయవంతమవుతుందనే నమ్మకం ఏర్పడిందన్నారు. ఈ విషయంలో ఎంత డబ్బు వెచ్చించడానికైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో యువత పాత్ర కీలకమైందని అన్నారు. మానవ వనరుల అభివృద్ధితోనే సమాజాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. తమ సంస్థ ఇచ్చే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలలో శిక్షణ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ వస్తుందని తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్న యువజనులకు తమ జాగృతి సంస్థ ప్రైవేటు సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అందులో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ యువతకు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లయితే వారు స్వయం ఉపాధితో జీవితంలో స్థిరపడతారన్నారు. నిరుద్యోగ సమస్య తొలగిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండావిశ్వేశ్వరరెడ్డి, జితేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ, నాగేష్‌, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌, బీజేఎల్‌పీ నేత కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంటు సెంటర్‌ను కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీంట్లో షార్ట్‌టర్మ్‌, లాంగ్‌టర్మ్‌ శిక్షణలు ఉంటాయని తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనా పథకం ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ఈ శిక్షణ కోసం 32 వేలకోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలలోను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Other Updates