tsmagazine
దేశంలోనే అత్యంత పిన్న వయస్సు రాష్ట్రం అయినప్పటికీ.. ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలతో యావద్భారతావనిని ఆకర్షిస్తోంది మన తెలంగాణా. గత నాలుగేళ్లుగా ఎన్నో వినూత్న, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణా ప్రభుత్వం… నూతన పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పన ద్వారా మరో ముందడుగు వేసింది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం రూపొందించిన పంచాయతీరాజ్‌ చట్టానికి బూజు దులిపిన సీయం కేసీఆర్‌… గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా నూతన పంచాయతీరాజ్‌ చట్టానికి రూపకల్పన చేశారు. సీయం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన నూతన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు.

పంచాయత్‌రాజ్‌ వ్యవస్థకు అంకురార్పణ..
స్వతంత్ర భారతదేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు ఆద్యునిగా బల్వంతరాయ్‌ మెహతాను చెప్పుకోవచ్చు. 1957 లో పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్న బల్వంతరాయ్‌ మెహతా నేత త్వంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ అధ్యయనానికి కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకే భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పునాది పడింది. 1959 అక్టోబర్‌ 2న దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రారంభించిన తొలిరాష్ట్రం రాజస్థాన్‌ కాగా… రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 1959 నవంబరు 1న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని మహబూబ్‌ నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాకు స్ధాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్‌ గా స్థానిక సంస్థలకు అంకురార్పణ జరిగింది. 1986లో బ్లాకు స్ధాయి వ్యవస్థను ఆంధ్ర ప్రదేశ్‌లో మండల పరిషత్‌లుగా మార్చారు.

నూతన పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పన
73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1994లో నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని రూపొందించింది. దాదాపు పాతికేళ్లుగా అదే చట్టాన్ని అనుసరిస్తున్నాం. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీయం కేసీఆర్‌… పంచాయతీరాజ్‌ సంస్థల బలోపేతంపైనా సుదీర్ఘ కసరత్తు చేశారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థపై పూర్తి పట్టు ఉన్న కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చెల్లప్ప లాంటి నిపుణులతో కమిటీ వేసి దాదాపు ఆరు నెలల పాటు పంచాయతీరాజ్‌ చట్టం రూపొందించేందుకు కసరత్తు చేశారు. ఆ తర్వాత పంచాయతీరాజ్‌ మరియు గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి జూపల్లి కష్ణారావునేతత్వంలో సీనియర్‌ మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, హరీష్‌ రావు, ఈటల, కేటీఆర్‌ లతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ రూపొందించిన పంచాయతీరాజ్‌ చట్టంపై వివిధ వర్గాల నుండి మంత్రి వర్గ ఉపసంఘం సలహాలు, సూచనలు తీసుకుంది. ఆ తరువాత తెలంగాణ గ్రామాల రూపురేఖలను మార్చే విధంగా పంచాయతీరాజ్‌ చట్టానికి మార్పులు, చేర్పులు చేసి సీఎం కేసీఆర్‌ కు అందజేసింది. నిపుణులు, న్యాయకోవిదులతో కూలంషంగా చర్చించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్భందీగా రూపొందించిన చట్టానికి శాసనసభ, మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.

పాలక వర్గమే సుప్రీం.. సర్పంచ్‌కు కార్యనిర్వహణ అధికారం
ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలకవర్గానికి పూర్తి స్థాయి అధికారాలు కట్టబెడుతూ చట్టంలో మార్పులు చేశారు. సర్పంచ్‌ కు పూర్తి కార్యనిర్వహణ అధికారాలు అప్పగించడంతో పాటు, ఉప సర్పంచ్‌ కు కూడా చెక్‌ పవర్‌ కల్పిస్తూ చట్టంలో మార్పు చేశారు. అధికారాలతోపాటు విధులకు సంబంధించి కూడా చట్టంలో పొందుపరిచారు. విధుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం పాలక వర్గాన్ని రద్దు చేయడం, సర్పంచ్‌ ను తొలగించడం లాంటి కఠిన చర్యలను కూడా చట్టంలో పేర్కొన్నారు. తద్వారా ప్రజలకు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ లతో పాటు పంచాయతీ సభ్యులు కూడా జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత చట్టం ద్వారా ఏర్పడింది. పంచాయతీ పాలక వర్గానికి సహాయకుడిగా మాత్రమే ఇకపై గ్రామ కార్యదర్శి ఉంటాడు.

సర్పంచ్‌ విధులు – తొలగింపు
గ్రామ అభివద్ధి నిధుల వినియోగం, మొక్కలు నాటడం, పారిశుద్ధ్య లోపం లేకుండా చూడడం సర్పంచ్‌ ప్రధాన విధులుగా చట్టంలో పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సర్పంచ్‌ పనిచేయాల్సి ఉంటుంది. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటుచేయడం కూడా పాలకవర్గం ప్రధాన బాధ్యతగా చట్టంలో పొందుపరిచారు. చెత్తచెదారాన్ని రోడ్డుపైన పడేస్తే 500 రూపాయలు జరిమానా విధించే అధికారాన్ని కూడా పాలకవర్గానికి చట్టం ద్వారా కల్పించారు. వరుసగా మూడు సార్లు గ్రామసభ నిర్వహణలో విఫలమైతే సర్పంచ్‌ను విధుల నుండి తొలగించేలా చట్టంలో పొందుపరిచారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించిన, ఆడిటింగ్‌ నిర్వహణలో విఫలమైనా, నిధులు దుర్వినియోగం చేసినా జిల్లా కలెక్టర్‌ సర్పంచ్‌ ను తొలగిస్తారు.

ట్రిబ్యునల్‌ ఏర్పాటు
పంచాయతీల వివాదాల పరిష్కారానికి నూతన పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ట్రిబ్యూనల్‌ ఏర్పాటు కానుంది. పాలకవర్గాన్ని రద్దు చేసినా, సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లను తొలగించినా ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు స్టే ఇచ్చే అధికారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రికి ఉండగా, ఇకపై రాజకీయాలకు అతీతంగా ముగ్గురు సభ్యులతో కూడిన ట్రిబ్యూనల్‌ మాత్రమే నిర్ణయం తీసుకోనుంది.

నూతన చట్టం ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభ విధిగా నిర్వహించాలి. ఏడాదిలో కనీసం రెండు గ్రామసభలైన మహిళలు, వద్ధులు, వికలాంగుల సంక్షేమంపై దష్టి పెట్టాలని చట్టంలోనే పొందుపరిచారు. గ్రామసభకు హాజరుకావల్సిన కోరంపై కూడా చట్టంలోనే స్పష్టత ఇచ్చారు. 500 లోపు ఓటర్లు ఉన్న పంచాయతీలో 50 మందిని కోరంగా పేర్కొన్నారు. అలాగే 500 – 1000 మధ్య ఉంటే 75, 1000 – 3000 మధ్య ఉంటే 150, 3000 – 5000 మధ్య ఉంటే 200, 5000 – 10000 మధ్య 300, 10000 పైన ఓటర్లు ఉంటే 400 మంది గ్రామసభకు హాజరు కావలసి ఉంటుంది. గ్రామసభ నిర్వహణను పూర్తిగా వీడియో, ఫోటోలు తీసి సమర్పించాలని చట్టంలో పేర్కొన్నారు. అలాగే గ్రామసభలో గ్రామంలోని అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది హాజరు కావలసి ఉంటుంది.

ప్రతినెల పాలకవర్గ సమావేశం
గ్రామంలో చేపట్టాల్సిన అభివద్ధి కార్యక్ర మాలపై చర్చించేందుకు ప్రతినెల పాలక వర్గ సమావేశాన్ని కొత్త చట్టం ద్వారా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు నెలలకు ఒకసారైనా మండల పంచాయతీ విస్తరణ అధికారి (ఈఓ పీఆర్డీ) ప్రతీ పంచాయతీని తనిఖీ చేయా లని చట్టంలో పేర్కొన్నారు. అలాగే ప్రతి నెలలో కనీసం ఐదు పంచాయతీలను జిల్లా పంచాయతీ అధికారి కూడా తనిఖీ చేయాలి. పంచాయతీలో జరుగుతున్న అభివద్ధి పనులపై సమీక్షించాలి.

పంచాయతీకి కో ఆప్షన్‌ సభ్యుల నియామకం
మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌ల తరహాలోనే గ్రామపంచాయతీల్లో కూడా ఇక నుండి కో ఆప్షన్‌ సభ్యులు ఉండనున్నారు. వివిధ రంగాలకు చెందిన వారిని కో ఆప్షన్‌ సభ్యులుగా నియమించుకోవడం ద్వారా వారి సలహాలు, సూచనలతో గ్రామ అభివద్ధిలో వేగం పెరుగుతుందనే ఆలోచనతో చట్టంలో ఈ అవకాశం కల్పించారు. ఒక రిటైర్డ్‌ ఉద్యోగి లేదా సీనియర్‌ సిటిజన్‌ ను కో-ఆప్షన్‌ సభ్యునిగా నియమించుకునే అవకాశం పాలకవర్గానికి ఈ చట్టం ద్వారా కలుగుతుంది. అలాగే గ్రామ మహిళాసంఘం అధ్యక్షురాలిగా ఎవరు ఉంటే వారు పంచాయతీ కో ఆప్షన్‌ మెంబర్‌గా ఎంపిక అవుతారు. అలాగే గ్రామ అభివద్ధి కోసం విరాళాలు ఇచ్చే ఎన్‌ఆర్‌ఐలుగాని, ఇతర ప్రముఖులను గానీ మూడో కో ఆప్షన్‌ సభ్యునిగా పాలకవర్గం నియమించుకునే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించారు.

వరుసగా రెండు సార్లు ఒకే రిజర్వేషన్‌
ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్‌ విధానంలోను నూతన చట్టం ద్వారా మార్పు చేశారు. రానున్న ఎన్నికల నుండి కొత్త రిజర్వేషన్‌ విధానం అమలుకానుంది. జనాభా ప్రాతిపదికన ఒకే రిజర్వేషన్‌ను వరుసగా రెండు ఎన్నికలకు వర్తింపచేయనున్నారు. అలాగే వందశాతం ఎస్టీ జనాభా ఉంటే ఆ గ్రామాన్ని పూర్తిగా ఎస్టీలకే రిజర్వ్‌ చేస్తారు.

స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటు
నూతన పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 49 ప్రకారం ప్రతి పంచాయతీలో నాలుగు స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పారిశుధ్యం, డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠథామాల నిర్వహణకు ఒక స్టాండింగ్‌ కమిటీ…. వీధి దీపాల నిర్వహణకు మరో కమిటీ , అలాగే మొక్కలు నాటడం, హరితహారం కోసం మరో కమిటీ , గ్రామంలో చేపట్టాల్సిన అభివద్ధి పనులకు సంబంధించి మరో స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.tsmagazine

లే అవుట్‌, భవన నిర్మాణ అనుమతులు
లే అవుట్‌ కోసం గ్రామ పంచాయతీలకు వచ్చే దరఖాస్తులను సంబంధిత హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేదా ఆర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీలకు వారం రోజుల్లోగా పంచాయతీలు విధిగా పంపించాల్సి ఉంటుంది. ఏ కారణంగా నైన వారం రోజుల్లోగా దరఖాస్తులను పంచాయతీ పంపకపోతే వాటిని పంపించినట్టుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో పొందుపరిచారు. అలాగే 30 రోజుల్లో సంబంధిత అథారిటీ కూడా లే అవుట్‌ పై నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో లే అవుట్‌ కు అమోదం లభించినట్లుగానే పరిగణించ డం జరుగుతుందని చట్టంలో నిబంధన పొందుపరిచారు. అలాగే జీ ప్లస్‌ టూ వరకు గ్రామపంచాయతీలు, ఆపైన నిర్మించే భవనాలకు హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేదా ఆర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ లు 15 రోజుల్లో విధిగా అనుమతి ఇవ్వడం లేదా తిరస్కరించడం చేయాలని చట్టంలో పేర్కొన్నారు. తద్వారా లే అవుట్‌, భవన నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నూతన పంచాయతీరాజ్‌ చట్టం అవకాశం కల్పించనుంది.

పంచాయతీలకు నేరుగా బడ్జెట్‌లోనే నిధులు
పంచాయతీలను బలోపేతం చేసే లక్ష్యంతో నేరుగా బడ్జెట్‌ లోనే నిధులను ప్రభుత్వం కేటాయించనుంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించనుండడంతో పంచాయతీలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. జనాభా ప్రాతిపదికన ప్రతి పంచాయతీకి కనీసం 5 లక్షల రూపాయలు ఏటా రాష్ట్ర బడ్జెట్‌ నుండి అందనున్నాయి. గ్రామాల్లో రోడ్లను పంచాయతీరాజ్‌ శాఖ నిర్మిస్తుండడం, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి ప్రభుత్వమే నీటిని ఉచితంగా సరఫరా చేయనుండడంతో పంచాయతీలపై వ్యయభారం గణనీయంగా తగ్గనుంది. ఆదాయం పెరగడం, వ్యయం తగ్గడంతో పంచాయ తీలు ఆర్థిక పరిపుష్ఠి దిశగా పయనించడం ఖాయంగా కని పిస్తుంది. ఎన్నో సంస్కర ణలతో… గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా రూ పొందించిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం ను పకడ్బందీగా అమలుచేయడం ద్వారా తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

చెన్నమనేని కళ్యాణ్‌

Other Updates