ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ సూచన
వ్యవసాయ రంగం సామాజిక, ఆర్థిక తీరు మారాలంటే మేక్ ఇన్ ఇండియా మాదిరిగా గ్రో ఇన్ ఇండియా కార్యక్రమం అవసరమని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారు . హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అన్సారీ మార్చి 5న అఖిల భారతీయ కిసాన్ సంఘ్ (ఏ.ఐ.కె.ఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు.
వ్యవసాయానికి భారీ పెట్టుబడులు కావాలని, 2022 సంవత్సరం నాటికి ప్రతి రైతుకు నీరందించాలన్న ప్రధానమంత్రి కల నెరవేరాలంటే ఒక్క నీటిపారుదల రంగానికే 3 లక్షల కోట్ల రూపాయలు అవసరమని, కానీ తాజా బడ్జెట్‌లో క్రేంద్ర జలవనరుల శాఖకు 4,232 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని ఉప రాష్ట్రపతి తెలిపారు. ఇలాంటి కేటాయింపుల వల్ల ప్రధాని కల సుదూర స్వప్నంలా కనిపిస్తోందన్నారు.
1995 నుంచి దేశంలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇతర రంగాలతో పోల్చితే ఇది 47 శాతం అధికమని అన్సారీ తెలిపారు. పంటల సాగుకు రైతుల పెట్టుబడులు పెరుగుతుండగా, ఆదాయం మాత్రం తగ్గుతోందని ఆయన చెప్పారు. రైతులు అభివద్ధి చెందాలంటే సన్న, చిన్నకారు రైతులకు సక్రమంగా పంట రుణాలు అందేలా చూడాలన్నారు. ఎ.ఐ. కె.ఎస్ అధ్యక్షుడు ప్రభోద్ పాండా కూడా మాట్లాడారు.
ఉపరాష్ట్రపతికి సి.ఎం విందు
రాష్ట్రానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ గౌరవార్థం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మార్చి 5వ తేదీ రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్ లో విందు ఏర్పాటుచేశారు. ఈ విందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు హైదరాబాద్ విచ్చేసిన అన్సారీకి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహాన్, నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, తదితరులు ఘన స్వాగతం పలికారు.
తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి అన్సారీ మార్చి 6న నగరంలోని చారిత్రక కుతుబ్ షాహి సమాధులను సందర్శించారు. ఆయన అక్కడ గంటపాటు గడిపి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. అన్సారీ వెంట గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం, ఆగాఖాన్ ఫౌండేషన్ ఛైైర్మన్ అబేద్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
అదే రోజు బేగంపేట విమానాశ్రయం నుంచి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తదితరులు వీడ్కోలు పలికారు . ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ చార్మినార్ జ్ఞాపికను బహూకరించారు.