ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులకు విందు
రాష్ట్రంలో డిసెంబరు 25న క్రిస్‌మస్ పండగను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్ బల్బులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. క్రైస్తవ సోదరులు ప్రముఖ చర్చిలలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు జరిపారు. పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించడంతో పాటు పేద క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం వైపున నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అన్ని జిల్లాల్లోను మంత్రులు, అధికారులు పేద క్రైస్తవులకు తమ చేతులు మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రముఖ చర్చి మెదక్‌చర్చిలో ప్రార్థనలు జరపడానికి వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవులు తరలివచ్చారు. మొట్టమొదటిసారి క్రిస్‌మస్ పండగను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తుండడంతో క్రైస్తవులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిజాం కళాశాలలో విందు..
క్రైస్తవులకు పర్వదినమైన క్రిస్టమస్ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిజాం కళాశాల మైదానంలో డిసెంబరు 20వ తేదీన విందు ఇచ్చారు. ఈ విందులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 50 మంది అనాథ పిల్లలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందజేశారు. క్రిస్‌మస్ కేక్ కట్‌చేసి బిషప్‌లు, పాస్టర్లకు తినిపించారు. విందుకు ముందుగా సీఎం కేసీఆర్ క్రిస్‌మస్ పండగ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. క్రైస్తవ సోదరులందరికీ సీఎం పండగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్ సోదరులకు సంబంధించి ఎలాంటి సమస్యలనైనా తాము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. క్రిస్టియన్‌లు చాలామంది వారి పవిత్ర పుణ్యక్షేత్రమైన జెరూసలెం వెళ్ళాలని ఆశిస్తారని, కానీ ఆర్థిక స్థోమత లేక వెళ్ళలేక పోతారన్నారు. అలాంటి విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందన్నారు. స్మశాన వాటికల విషయంలోను ప్రభుత్వం స్థలాల కేటాయింపు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణంలో మనమందరం కలిసి పనిచేయాలన్నారు. దళిత క్రిస్టియన్‌ల విషయంలో తానే స్వయంగా ప్రధానమంత్రికి లేఖ రాస్తానన్నారు. అందరికీ జీసెస్ కరుణ ఉండాలని, అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడుగురికి నగదు పురస్కారంతో పాటు శాలువా, మెమెంటోలు ముఖ్యమంత్రి అందచేశారు.