ఈ జాతరల నిర్వహణకై రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ సుమారు 85 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఆయా గిరిజన సాంప్రదాయ పెద్దల అధ్వర్యంలో జరిగే ఈ జాతరలలో గిరిజనులు, గిరిజనేతరులు కలిసి సుమారుగా కోటిన్నర మంది పాల్గొంటారు. రాష్ట్రంలోని మొత్తం గిరిజనుల సంఖ్య సుమారు 35 లక్షలు కాగా అంతకు మరో మూడు రెట్లు గిరిజనేతరులు ఈ గిరిజన జాతర్లలో పాల్గొనడంతో తెలంగాణలో గిరిజన జాతరల విశిష్టత స్పష్టమౌతున్నది. భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ఆశించినట్లు గిరిజనేతరులు గిరిజనులతో మమేకమౌతున్నారని విశదమౌతున్నది. ఇంతగా గిరిజనేతరులు గిరిజనుల సంస్కృతితో మమేకం కావడం ఆసియా ఖండంలో మరే ప్రాంతంలో జరగడం లేదని నిరూపితమైంది. ఇది ప్రపంచ సంస్కృతిలో కూడ ప్రశంసించదగిన విశేషం.
సేవాలాల్ జయంతి:
గిరిజన పెద్దలు, నాయకుల అధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల నిర్వహణకై రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేస్తుంది. 1739లో అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జన్మించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 1780-90 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం గుండా ప్రయాణించి తెలంగాణ ఉత్తర సరిహద్దు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని లంబాడీలు సేవాలాల్ జయంతి నిర్వహణ ద్వారా తమ భక్తి ఉనికిని పెంచుకుంటున్నారు.
నాంచారమ్మ జాతర:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామ పరిసరాల్లో ఉన్న ఎరుకలబండ దగ్గరున్న నాంచారమ్మను రాష్ట్రమంతటా ఉన్న ఎరుకుల గిరిజనులు బోనాలతో వచ్చి ఆరాధించి ఆనందోత్సాహాలతో జాతర జరుపుకుంటారు. ప్రతి యేటా వైశాఖ పౌర్ణమినాడు జరిగే ఈ జాతరకు ప్రభుత్వం రూ.5.00 లక్షలు కేటాయించింది.
మేడారం జాతర:
రెండేళ్ళకు ఒక్కసారి సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతుంది. ఈ జాతరలో 8 రాష్ట్రాల నుంచి గిరిజన, గిరిజనేతర భక్తులు 1.25 కోట్ల మంది పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ నందకుమార్ సాయి, ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తదితర ప్రముఖులు 2018లో ఈ జాతరను సందర్శించారు. సమ్మక్క-సారలమ్మలు, వారి పరివారం, వస్తువులు, సాంప్రదాయాలు, మతం-కళలు తదితర విశేషాలతో 2018లో గిరిజన సంక్షేమ శాఖ మేడారంలో గిరిజన మ్యూజియం స్థాపించింది. వసతి గృహాలను కట్టించింది. ఇంకా పలు శాఖలు పలు ప్రజోపయోగాల కల్పన చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూశాయి. ఈ జాతర ప్రపంచ జాతరలన్నింటికంటే పెద్దది.
జంగుబాయి జాతర:
ఆదిలాబాద్ జిల్లాలోని కోటపరండోలిలో ఏటా జంగుబాయి జాతర జరుగుతుంది. గోండులు, వారితో కలిసి ఉండే గిరిజనులు, గిరిజనేతరులు వేలాదిగా పాల్గొనే ఈ జాతరలో మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కారణంగా మరాఠీ ప్రాంత గోండులు కూడా వేలాదిగా పాల్గొని కుల సాంప్రదాయక సభలు జరుపుతారు. స్థానికంగా పారే ఒక సెలయేరుకు ఇరు ప్రక్కల భక్తులు గుడారాలు వేసుకొని సాంప్రదాయం ప్రకారం నిద్రలు చేస్తారు.
నాగోబా జాతర:
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్‌లో ఏటా నాగోబా జాతర ఘనంగా జరుగుతుంది. గోండులు, పర్దానుల్లో మెస్రం వంశీయుల అధ్వర్యంలో జరిగే ఈ జాతరలో వేలాది మంది గోండులు, పర్దాన్‌లు, తోటీలు, నాయకపోళ్ళు, కోలాములు, ఇతర గిరజనేతర ప్రజలు పాల్గొంటారు. సాంప్రదాయక సభలు, దర్బారు నిర్వహిస్తారు. కొత్త కోడళ్ల భేటీ ప్రత్యేకం. దర్బారులో ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరించటానికి ప్రయత్నిస్తామని మాటిస్తారు.
కుమ్రం భీం వర్ధంతి:
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రతి ఏటా దసరా పండుగ తరువాత వచ్చే పౌర్ణమినాడు గోండు గిరిజనులు కుమ్రం భీం వర్ధంతిని స్ఫూర్తిదాయక సాంప్రదాయక పండుగగా జరుపుకుంటారు. ఉట్నూరులో ఉన్న సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ వర్ధంతి పండుగకు ప్రభుత్వం ప్రత్యేకంగా సుమారు రూ.20.00 లక్షలు ఖర్చు చేస్తుంది.
గాంధారి మైసమ్మ జాతర:
మంచిర్యాల దగ్గర గాంధారి ఖిల్లాలో స్థానిక నాయకపోడ్ గిరిజనుల ఆధ్వర్యంలో ఏటా జరిగే మైసమ్మ జాతరలో గిరిజనేతరులు కూడా వేల సంఖ్యలో పాల్గొంటారు. గిరిజన సంక్షేమ శాఖ ఈ జాతర నిర్వహణకై 5 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఈ జాతరలో పాల్గొని ఖిల్లా ప్రధాన ద్వారం దగ్గర మైసమ్మకు పూజలు నిర్వహించిన దేవాదాయ శాఖామాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మౌలిక వసతుల కల్పనకై రూ.50.00 లక్షలు తమ ప్రభుత్వం విడుదల చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
భౌరాపూర్ జాతర:
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి సంవత్సరం నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలోని భౌరాపూర్ చెంచుపెంటలో సాంప్రదాయకంగా భ్రమరాంబ జాతర జరుగుతున్నది. ఈ జాతర నిర్వహణకై గిరిజన సంక్షేమ శాఖ ఏటా రూ.10 నుంచి 15 లక్షలు ఖర్చు చేస్తుంది. శివుడికి పార్వతి, గంగ అనే భార్యలున్నారని హిందువులు భావించగా చెంచు గిరిజనులు తమ మల్లన్న స్వామికి (శ్రీశైలం మల్లికార్జునుడు) తమ ఆడపడుచు భ్రమరాంబ భార్య అయ్యిందని నమ్ముతూ ఆ కారణంగా ఆ స్వామిని తమ అల్లుడుగా భావిస్తూ శివరాత్రి నాడే జాతర జరుపుతారు. 40 కి.మీ. దూరం అటవీ అంతర గర్భంలో ఉన్న ఈ భౌరాపూర్ జాతరలో వేలాదిమంది గిరిజనులు, గిరిజనేతరులు పాల్గొని భ్రమరాంబ దేవికి మొక్కులు చెల్లించుకుంటారు.
ఫూలాజీ బాబా జయంతి:
ఆసిఫాబాద్ జిల్లాలోని పట్నాపూర్ గ్రామంలో ఆంధ్ గిరిజనులు తమ ఆరాధ్య గురువైన ఫూలాజీ బాబా జయంతి వేడుకలను ప్రతి ఏటా ఆగస్ట్ 30వ తేదీన ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతరలో గోండు, కోలామ్, పర్దాన్, తోటి, లంబాడీ తదితర గిరిజనులు, గిరిజనేతరులు, మహారాష్ట్ర తదితర సరిహద్దు రాష్ట్రాల భక్తులు కూడా వేలాది మంది పాల్గొంటారు. 2018 నుంచి ఫూలాజీ బాబా జయంతి నిర్వహణకై ప్రభుత్వం రూ.5 లక్షలు కేటా యిస్తున్నది. ఇంకా ఆంధ్‌ల సిరాళ్ జాతరకు, నాయకపోళ్ళ లక్ష్మీదేవర జాతరకు, చెంచుల సలేశ్వరం, లొద్ది జాతరలకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నది. ఇలా రాష్ట్రంలో అందరు గిరిజనులకు సంబంధించిన ప్రధాన జాతులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం బహుశా భారతదేశంలోనే అరుదైన విషయం.
-డా|| ద్యావనపల్లి సత్యనారాయణ