రాష్ట్రంలోని ముస్లింలకు త్వరలోనే 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం జూన్ 27న రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముస్లిం యువతులకు, చిన్నారులకు కానులకు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. ”నేను మాట ఇస్తే కట్టుబడి ఉంటాను. ఇది మీ అందరికీ తెలుసు. ముస్లిం రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ కొన్ని రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. ఆ నివేదిక రాగానే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తీర్మానం చేస్తాం, ఆ తీర్మానాన్ని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళి అమలు చేయిస్తాం, రిజర్వేషన్ల అంశంలో మనం తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది” అని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పురోగతిలో దేశానికే కాదు, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
తెలంగాణలో ఇంతకు ముందు ఆచరించిన ‘గంగా జమున తెహజీబ్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని, అలాంటి సాంప్రదాయం మళ్లీ తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. ”అలాంటి సాంప్రదాయం మళ్లీ కనిపించే విధంగా ముందుకు నడుస్తున్నాం, అలాంటి ప్రయత్నం వల్ల ఇప్పుడు రాష్ట్రంలో మంచి వాతావరణం నెలకొన్నది” అని సిఎం అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో జూన్ 27న రాష్ట్రంలోని 200 మసీదుల వద్ద ప్రభుత్వ పరంగా దావతే ఇఫ్తార్ ఏర్పాటు చేశామని, లక్షల సంఖ్యలో ముస్లీంలు ఈ విందులో పాల్గొనడం చాలా సంతోషకరమని కేసీఆర్ అన్నారు. మైనార్టీ విద్యార్థులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3900 కోట్లతో రాష్ట్రంలో 120 రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పుతున్నామని, వాటిలో 71 స్కూళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. ప్రసంగం చివరలో ముఖ్యమంత్రి ‘ఈద్ ముబారక్’ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. —ఉపవాస దీక్ష విరమణ సమయంలో ముఖ్యమంత్రి ముస్లిం మత ప్రముఖులకు, మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఒవైసికి ఖర్జూర పండ్లు తినిపించారు.
గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణి:
రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని పేద ముస్లింలకు ప్రభుత్వం అందజేసిన మూడు జతల దుస్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌లను సీఎం కేసీఆర్ నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో, ఆ తర్వాత సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని నల్లగుట్ట, జామామసీదు వద్ద జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు.
ఈ విందు కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసన మండలి చైర్మన్, మంత్రులు, హైదరాబాద్‌లోని టర్కీ, ఇరాన్ దేశాల కాన్సులేట్ జనరల్స్, మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసి, ఎంబిటి నాయకులు, ముస్లిం మతపెద్దలు, టిఆర్‌ఎస్ సెకట్రరీ జనరల్ కేశవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిహెచ్‌ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్, డిజిపితో పాటు పోలీసు ఉన్నతాధికారులు, తదితరులుపాల్గొన్నారు.