పుష్కరాల ముగింపు సందర్భంగా జులై 25న రాష్ట్ర ప్రభుత్వం ముగింపు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించింది. శోభాయాత్రలు, గోదావరికి హారతులు కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాలలో గల గోదావరి తీరాలలో ప్రభుత్వం తరఫున మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారిని శోభాయాత్రగా గోదావరినది ఒడ్డుకు తీసుకొని వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి ఇచ్చి రాత్రి 7 గంటల ప్రాంతంలో పుష్కరాలను ముగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకిరణ్‌రెడ్డి, జోగురామన్న, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరికి హారతులిచ్చి వేడుకలను ముగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామి, మంత్రి ఈటల రాజేందర్ దంపతులు, చీఫ్‌విప్ కొప్పు ఈశ్వర్, ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. భారీగా శోభాయాత్ర నిర్వహించారు.
కాళేశ్వరంలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో శాసనసభాపతి మధుసూదనాచారి, స్థానిక శాసనసభ్యుడు పుట్ట మధు పాల్గొని గోదావరికి హారతి ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో రామాలయం అర్చకులు గోదావరికి హారతులిచ్చారు. మోతే పుష్కర ఘాట్‌లో పుష్కరాల చివరిరోజున డి.జి.పి. అనురాగ్‌శర్మ పుష్కరస్నానం చేశారు. పుష్కరాల ముగింపు రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఢల్లీిలోని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి ఘాట్ల వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు.
వరంగల్ జిల్లా మంగపేట పుష్కర ఘాట్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించారు. మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి, ఉమా చంద్రశేఖర స్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలోని ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.