ఓరుగల్లు కోట చరిత్ర 8వ శతాబ్ధం నుండి 13వ శతాబ్దం వరకు కొనసాగింది. ఓరుగల్లు కోట వరంగల్ రైల్వే స్టేషన్‌కు 2 కి.మీ. దూరంలోనూ, హన్మకొండ నుండి 12 కి.మీ. దూరంలోనూ ఉంది. ప్రస్తుతం నాటి ఘన చరిత్రకు ఆనవాళ్ళుగా మిగిలిన కొన్ని అవశేషాలు మాత్రమే ఇక్కడ కానవస్తాయి. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ వరంగల్ కోట ‘కీర్తి తోరణం’ ‘ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా వాడుకలో వుంది. ఈ కోట 15 మంది కాకతీయ చక్రవర్తుల పాలనలో క్రమ క్రమంగా దుర్భేద్యమైన కోటగా అద్భుత నిర్మాణాలతో నిర్మించబడి కొన్ని వందల ఏళ్ళపాటు ఎంతో వైభవంగా కొనసాగింది. చివరికి ప్రతాపరుద్రుడు (1289-1323)తో ఈ కోట చరిత్ర అంతం అయింది.
శ్రీ నాగబాల సురేష్ కుమార్
శత్రువుల బారి నుండి ప్రజలను, రాజ్యాన్ని కాపాడుకోవడానికి శత్రుదుర్భేద్యంగా వారు మొత్తం 7 కోటలను నిర్మించారు. వరంగల్ శివారు ప్రాంతం గీసుకొండతో పాటు గావిచర్ల, కొండా వెంకటాపురం, కట్టమైసమ్మ ప్రాంతాలలో ఆ కోటల ఆనవాళ్ళు అందుకు నిదర్శనంగా ప్రతిబింబిస్తాయి. వరంగల్ ప్రాంతం చుట్టూ వున్న 8 కి.మీ. మట్టికోట, 5 కి.మీ. రాతి కోట నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కోట గోడ చుట్టూ నిర్మించిన 18 అడుగుల లోతైన కందకం శత్రువులు కోటలోనికి రాకుండా కాపాడేది. అందులో 10 అడుగుల నీరు ఉండేది. శత్రువులను చీల్చివేయడానికి మొసళ్ళు సిద్ధంగా ఉండేవి. ఆ కందకం మట్టితో పూడుకుపోయి నేడు పిచ్చి మొక్కలకు నిలయంగా ఉంది. మట్టి కోటకు నాలుగు దిక్కులా వున్న ప్రధాన ద్వారాలను కలుపుతూ కాకతి గణపతి దేవుడు ఖిల్లా వరంగల్ చుట్టూ 15 మీటర్ల ఎత్తయిన రాతి గోడను నిర్మించారు. ఈ ద్వారాలకు రెండు వైపులా ఉన్న గోడలపై సైనికులు ఆయుధాలతో పహారా కాస్తూ శత్రువులపై దాడికి సిద్ధంగా ఉండేవారు. మర ఫిరంగులు అమర్చటానికి వీలుగా కోటగోడలపై అనేక చోట్ల ప్రత్యేక బురుజులు ఏర్పాటు చేశారు.
ఖిల్లా వరంగల్‌కు 5 కి.మీ. పరిధిలో శత్రుదుర్భేద్యంగా ఎత్తయిన రాతి గోడలను నిర్మించారు. అవతలి భాగంలో రాతి మట్టి అగడ్తలను ఏర్పాటు చేశారు. రాతి కోటకు నాలుగువైపులా నాలుగు ప్రధాన ద్వారాలను కాకతీయరాజులు ఏర్పాటు చేశారు. ఈ ద్వారాలను కలుపుతూ శాపకొండ దర్వాజ. సత్తుకొండ యుద్ధశాల వున్నాయి. కాకతీయుల కాలంలో ఎంతో వైభవోపేతంగా వెలిగిన వరంగల్ కోట నేడు పిచ్చిమొక్కలతో, ముళ్ళ పొదలతో నిండిపోయి నాటి ప్రాభవానికి దూరమయింది. ‘రాజులు మారినా రాజ్యాలు చెక్కు చెదరొద్దు – యుగాలు పోయినా తమ పేరు ప్రజలు మరువొద్దు’ అన్నది ఓరుగల్లు రాజుల ఆకాంక్ష. దానికి తగ్గట్టుగానే ఓరుగల్లు కోట అందాలు నేటితరం వారిని కూడా అబ్బురపరుస్తుంటాయి. కానీ, కాలం మారినకొద్దీ వారు అపురూపంగా పెంచి పోషించిన కళాసంపద క్రమంగా కనుమరుగవుతున్నట్టనిపిస్తోంది. ఓరుగల్లు కోట ప్రణాళికాబద్ధ నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాకతిగణపతిదేవ చక్రవర్తి ప్రారంభించాడు. 1199వ సంవత్సరంలో ఆయన కోట నిర్మాణాన్ని ప్రారంభించగా ఆయన కుమార్తె రాణీ రుద్రమదేవి అప్రతిహతంగా కోట నిర్మాణాన్ని కొనసాగించి పూర్తి చేశారు.
అద్భుతమైన శిల్ప సంపదకు, అందమైన అనేక రాతి కట్టడాలకు నిలయంగా నిలిచిన ఈ కోటలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి కాకతీయ కీర్తి తోరణాలు. దేశంలో ఏ కోటలో లేని విధంగా ఈ కోటలో నిర్మించబడిన ఈ కీర్తి తోరణాలు కాకతీయ ప్రభువుల శిల్పకళా పోషణకు దర్పణంగా కనిపిస్తాయి. ఈ కోటలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి శివాలయం, ఏకశిల గుట్ట, గుండు చెరువు, ఖుష్ మహల్‌లు నేటికీ నిలిచి ఉన్నాయి. ఈ కోటకు మూడువైపులా మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికీ మనం చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసింది. దీనిని ‘ధరణి కోట’ అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండో ప్రాకారంలో వున్నది ‘రాతి కోట’ ఇది గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడింది. ‘రాతి కోట’కు పెద్ద పెద్ద ఏక శిల రాతి ద్వారాలున్నాయి. ఈ ద్వారాల ఎత్తు సుమారు 30 అడుగులు వుండి పూర్తిగా ఏకశిలతో నిర్మితమయ్యాయి.
వరంగల్ కోట ప్రాంతానికి కూతవేటు దూరంలో 17 స్నానాల బావులున్నాయి. ప్రస్తుతం అందులో నాలుగు బావుల ఆనవాళ్ళు మాత్రమే మనకు దర్శనమిస్తాయి. అక్కాచెల్లెళ్ళ బావి, కోడిపుంజు బావి, భోగం బావి, గుర్రాల బావిగా పిలవబడే ఆ నాలుగు బావులు కోట పరిసర ప్రాంతాలలో వుండటం వలన మాత్రమే అవి మనకు కనిపిస్తాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన బావి 4 అంతస్తుల బావి. కోటకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బావికి ‘రాణీ రుద్రమ బావి’ అని పేరు. ఈ బావి నాలుగు అంతస్తులతో అనేక స్నానపు గదులతో నిర్మించబడింది. ఆ గదులు రాణిగారి స్నానపు గదులుగా చెప్పబడుతున్నాయి. గతంలో రాణీ వాసపు స్త్రీలు ఈ బావిలోనే స్నానం చేసేవారు. ఈ గదులను ఆనుకుని దుస్తులు మార్చుకోవడానికి బావి దిగువ భాగంలోనే అందమైన రాతి నిర్మితమైన మరికొన్ని రాతి గదులున్నాయి.
కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కి.మీ. విస్తీర్ణంలో సువిశాలంగా వ్యాపించి పండ్లు, పూల తోటలతో అనేక రాజభవనాలతో అద్భుత కళాకాంతులతో శోభిల్లుతుండేది. కోట పై భాగంపై నిలబడి ఏ వైపు చూసినా రెండు మైళ్ళ పొడవునా నీటి ఫౌంటైన్స్‌తో పాటు అందమైన తోటలు విరివిగా కనబడేవట. తోటల పెంపకంలో భాగంగా మామిడి, అరటి, పనస తోటల పెంపకం ఎక్కువగా వుండేది. వరంగల్ కోటలోని నగరం మొత్తం పేటలుగా విభజించబడి వుండేది. అక్కలవాడ, భోగం వీధి, వలిపాలెం, మేదరవాడ, పెహరీవాడ లాంటి పేర్లతో వివిధ కులాలకు సంబంధించిన వాడలు, పేటలు కోటలో ఉండేవి. అదేవిధంగా ఆయా వర్గాలకు సంబంధించిన దేవాలయాలు, నివాస భవనాలు, పూట కూటి ఇండ్లు ఈ కోటలో ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
కాకతీయులు – జైనులుగా ఉన్నప్పుడు అనేక జైన దేవాలయాలు కోట ప్రాంతంలో కట్టించారు. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ హన్మకొండ, గట్టురాళ్ళ గుట్టపైన మనకు కనిపిస్తాయి. ఇప్పటికీ జైన తీర్థంకరుల విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. అదే గుట్టపై పద్మాక్షి దేవాలయం కూడా ఉంది. గుట్ట వద్ద అనేక జైన విగ్రహాలు విరిగిన శకలాలుగా ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. అనంతర కాలంలో కాకతీయ రాజులు శైవమతాన్ని స్వీకరించిన తరువాత హన్మకొండలో అద్భుతమైన వేయి స్తంభాల దేవాలయాన్ని నిర్మించారు.
ఓరుగల్లు తివాచీల తయారీకి ప్రసిద్ధి. ఓరుగల్లు రాజ్య విశేషం ఎంత ప్రసిద్ధిగాంచిందంటే మహారాణి రుద్రమదేవి కాలంలో జెనివాకు చెందిన ప్రపంచ పర్యాటకుడు మార్కోపోలో వరంగల్ కోటలోని విశేషాలను తెలియజేస్తూ ”కాకతీయుల రాజ్యంలో అద్భుతమైన, శ్రేష్ఠమైన వస్త్రాలు నేస్తారు. ప్రపంచంలో ఈ వస్త్రాలను ధరించని రాజ వంశస్తులు ఎక్కడాలేరు” అని అన్నాడు.
ఇంతటి ఘనకీర్తి కలిగిన కాకతీయుల రాజధాని ఓరుగల్లు కోటలో నాలుగు కాకతీయ తోరణాలు సమాన దూరాలలో ఠీవీగా నేటికీ నిలిచి వున్నాయి. ఈ తోరణాల మధ్య అనేక శిల్పకళాఖండాలు ఖండితమై మనకు దర్శనమిస్తాయి. ప్రతి శిల్పం ఒక గొప్ప కళాఖండంగా కనిపిస్తుంది. నున్నటి నల్లటిరాతిపై ఎంతో సున్నితంగా చెక్కిన ఎన్నెన్నో అద్భుత శిల్పాలు నాటి శిల్పుల అద్భుత ప్రతిభకు తార్కాణంగా నేటికీ నిలిచి ఉన్నాయి. ఆ శిల్పాలను స్పర్శించి ఆ శిల్పుల ప్రతిభను స్మరించుకొని అద్భుత అనుభూతికి లోనవుతాం. ఓరుగల్లు కోటలోని మహత్తర కట్టడాలలో స్వయంభూ శివాలయం ఒకటి. క్రీస్తు శకం 1162లో గణపతి దేవచక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. భూభాగం నుండి చూస్తే పుష్పాకారంలోని పైకప్పు నక్షత్రాకారంలో పోలినట్లు నల్లటి రాతితో నిర్మింపబడింది ఈ ఆలయం. గర్భగుడిలోని శివలింగం ఇతర దేవాలయాల్లోని శివలింగంకన్నా భిన్నంగా వుంటుంది. ఖండాలై పడివున్న చతుర్ముఖ శివలింగం ఈ ఆలయంలోని మూలవిరాట్. ఇది భూమికి అతి తక్కువ ఎత్తులో వుంది. పానవట్టం గుండ్రంగా వుంటుంది. రక్షణ ద్వారం వద్ద గల వీరభద్ర స్వామి విగ్రహం ఆకర్షణగా కనిపిస్తుంది. ఆలయంలో ఓ పక్క శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. యేటా శివరాత్రి మహోత్సవాల సందర్భంగా నగరం నలుమూలల నుంచేకాక ఇతర ప్రాంతాలనుండి కూడా వేలాది భక్తులు అశేషంగా తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
కాకతీయ తోరణాలకు దగ్గరలోనే ఐదు ఎకరాల సువిశాల స్థలంలో విస్తరించిన ‘కుష్ మహల్’ కట్టడం పొడవు సుమారు 90 అడుగులు, 45 అడుగుల వెడల్పు – 30 అడుగుల ఎత్తుతో ఈ రాతి కట్టడం చూడగానే ఆకట్టుకుంటుంది. దర్బారు పైకప్పును కొనదేలిన ఆర్చీలు మోస్తున్నట్లుగా ఉండి, ఆర్చీల మధ్యన కర్ర దూలాలు నిర్మించబడ్డాయి. నిజానికి పైకప్పును మోస్తున్నది ఈ రాతి దూలాలే. పెద్ద ప్రమాణంలో కనిపించే ఈ ఆర్చీలు మందిర అందాన్ని పెంచుతున్నాయి. ఆర్చీలముందు దర్వాజా లాంటి ఆర్చీ, దానిపైన అందమైన అల్లికలతో కూడిన కిటికీలు దర్బార్ శోభను మరింత పెంచాయి. దర్బారులోకి ప్రవేశించగానే ప్రాంగణం మరింత అందంగా కనిపిస్తుంది. నిజానికి ఈ మహల్ నిర్మాణం రెండంతస్తుల్లో ఉంది. ఇందులోని రెండు వరుసల్లో ఉన్న స్తంభాలు మూడు పొడవాటి హాల్‌లను ఏర్పరుస్తున్నాయి. కింద, పైనున్న గదులు రాచ కుటుంబీకులకు చల్లని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి. ఈ మహల్ గోడలు చాలా వెడల్పుగా ఉండి బలిష్టంగా నిర్మించబడ్డాయి. అవి సుమారు 77 డిగ్రీలవాలుతో ఉండి కిందికి వేలాడుతున్నట్లుగా కన్పిస్తాయి. ఎత్తయిన ఈ భవనం పై భాగానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభూ దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ ఖుష్ మహల్‌లోనే భద్రపరిచారు. దర్బారు మధ్యలో అందమైన నీటి కుండం ఉంది. ఆనాడు రాచవర్గ ప్రజలకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేది కాబట్టే, ఈ మహల్‌కు ‘ఖుష్ మహల్’ అని పేరొచ్చింది.
కాకతీయ ప్రభువులు కళాపోషకులు, వారి పాలనలో అటు సాహిత్య పోషణ, ఇటు కళా పోషణ సమ స్థాయిలో సాగింది. అందుకే ఎందరెందరో గొప్ప గొప్ప సాహితీ వేత్తలు, సంగీత, నృత్య, శిల్ప కళాకారులు తమ అద్భుత ప్రావీణ్యాన్ని కాకతీయ సామ్రాజ్యంలో ప్రదర్శించారు. వారి అద్భుత ప్రదర్శనలు ఈ ‘కుష్‌మహల్’లోనే కొనసాగేవట.
ఓరుగల్లు రాజుల నిర్మాణాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి ఏకశిల గుట్ట గురించి. ఈ గుట్ట ఒక పెద్ద బండరాయి వలె వుంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీన్ని ఒంటికొండ అని కూడా పిలుస్తారు. ఇది ఓరుగల్లు కోటలోని ఏకశిలా పార్కు పక్కన వుండే ఎత్తయిన కొండ. మెట్ల ద్వారా ఈ గుట్టమీదికి సులభంగా ఎక్కవచ్చు. ఈ గుట్టమీద శిధిలావస్థకు చేరుకున్న ఓ గుట్ట వుంది. అంతేకాకుండా శత్రువుల రాకను పసిగట్టడానికి నిర్మించిన పహారా భవనం ఉంది. లోపల నుండి ఉన్న మెట్ల ద్వారా ఈ భవనం పై భాగానికి వెళ్ళవచ్చు. గుట్టకింద పార్కు పక్కన ఒక అందమైన చెరువు కూడా వుంది, దాన్ని గుండు చెరువు అని పిలుస్తారు. ఇంత పెద్ద కొండ కోటలో ఉండటం వల్ల దీన్ని ఏకశిలా నగరంగా కూడా పిలిచేవారు.
క్రీ.శ. 750 నుండి 1323 వరకు అంటే 573 సంవత్సరాల పాటు తెలుగు జాతిని ఏకం చేయటంతో పాటు గొప్ప వైభవాన్ని చవిచూసిన వరంగల్ కోటకు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కోటను పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.