bathukammaతెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల అంశం ప్రస్తావనకు వస్తే అన్నింటికన్నా ముందుగా అందరినీ కదిలిస్తుంది బతుకమ్మ. తెలంగాణ సిద్ధించిన తర్వాత మూడోయేటే గిన్నిస్‌బుక్‌లో స్థానాన్ని పొందింది మన బతుకమ్మ. తీరొక్క పూలతో విభిన్న పరిమాణాలలో భాద్రపద అమావాస్యనుండి ఆశీయుజ శుద్ధ నవమి వరకు (తొమ్మిది రోజులు) పూల బాటలుగా వాడవాడలా కొలువుదీరాయి బతుకమ్మలు. ఈ సారి అక్టోబర్‌ 8న హైదరాబాద్‌ లాల్‌ బహదూర్‌ స్టేడియం సాక్షిగా 9292మంది ఆడబిడ్డలు ఆడిపాడంగా వాన చినుకులు తమ వర్షామోదాన్ని కురిపించాయి. వర్షాన్ని సహితం లెక్కజేయకుండా 20 అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ ముక్కోటి దేవతలు ఉయ్యాలో… బంగారు రథమెక్కి ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలందరూ ఒక్క గొంతుకతో పాడినపాట, జై తెలంగాణ నినాదాలతో, పటాకుల మోతలన్నీ గిన్నిస్‌బుక్‌లో అక్షరాల సాక్షిగా ధ్వనించాయి.

ఒక భారతీయ పండుగ ఉత్సవాన్ని ఇంత భారీ స్థాయిలో జరుపుకోవడం ఇదే ప్రథమం అని గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ ప్రతినిధులు ప్రకటించారు. 2015లో ఓనం పండుగను కేరళ వనితలు తమ ఆటపాటలతో గిన్నిస్‌బుక్‌ రికార్డులలో తమ కీర్తిని చాటితే, దాన్ని మన తెలంగాణ మహిళలు 2016లో అధిగమించారు. చిన్నపిల్లలు, బడిపిల్లలు, కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థినులు, పండు ముత్తయిదువలు వయోభేదం లేకుండా 9292మంది మహిళలు ఎంతో క్రమశిక్షణగా బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. జోరుగా వర్షం కురుస్తున్నా కూడా వేస్తున్న అడుగులలో లయ తప్పనీయలేదు.

పదకొండు నిమిషాల ఏడు సెకన్లపాటు 20 అడుగుల చుట్టూర, 12 అడుగుల వృత్తంలో, 35 వరుసలలో, ఒక్కో వరుసకు రెండువేలమంది ఆడబిడ్డలు ఆడిపాడారు. గిన్నిస్‌బుక్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు స్టేడియంలోకి వచ్చిన మహిళలను లెక్కించగా 10,029 మంది వచ్చినట్టుగా లెక్కతేలింది. మహా బతుకమ్మ చుట్టూ చేరి ఆడిపాడిన ఆడబిడ్డల సంఖ్య మాత్రం 9,292గా నమోదయింది. 2015లో ఓనం వేడుకలో 5211 మహిళలు ఆడిపాడి రికార్డును సాధించారు. ఈ రికార్డును దాటి మరో సరికొత్త రికార్డును సృష్టించారు మన తెలంగాణ ఆడబిడ్డలు. ఈ రికార్డును కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే సాధించినా కూడా, గిన్నిస్‌బుక్‌ ప్రతినిధులు మరో ఐదు నిమిషాలు స్టాప్‌వాచ్‌ ఎలక్ట్రానిక్‌ కౌంటింగ్‌, స్టిక్కర్లు తీసుకున్న మహిళల సంఖ్యలను పోల్చిచూసి, సరిచేసి ఆడిట్‌చేసి రికార్డును లెక్కించారు. ఈ ప్రక్రియలో మన ఆడబిడ్డలు 11 నిమిషాల 7 సెకన్లపాటు గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డుల ప్రతినిధులనే ‘ఔరా’ అనేటట్టు చేశారు.

Other Updates