రెండు వేల ఏండ్ల ఘన చరిత్ర కలిగి తెలంగాణా ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, వేములవాడ చాళుక్యులు, విష్ణు కుండినులు, కాకతీయులు, బహమనీ సుల్తానులు, గోల్కోండ నవాబులు, అసఫ్ జాహీలు, రాష్ట్ర కూటులు, ముసునూరి నాయకులు, మొఘలాయిలు, ఆయా ప్రాంతాలలో నాటి కాలానికి అనుగుణంగా వారి అవసరాలకు తగినట్టుగా నిర్మించిన అనేక కోటలు నాటి చరిత్రకు సాక్షీ భూతంగా నిలుస్తున్నాయి. ఒక్కో కోటది ఒక్కో రకమైన వైభవం. ఒక్కో కోటది ఒక్కో రకమైన విశేషత, విశిష్టత. కోట నిర్మాణానికి అంకురార్పణ జరిగినప్పటి నుండి ఆ కోట పతనావస్థకు దారి తీసినంత వరకూ ఆ కోట చరిత్రను సమగ్రంగా పరిశీలిస్తే ఒక రకమైన ఆనందం, ఉద్వేగం, ఉత్సాహం, కలుగుతాయి. ప్రతి కోటది ఘనమైన చరిత్రే. ఎన్నెన్నో యుద్ధాలకు, యుద్దతంత్రాలకు, అసమాన శౌర్యానికి, నైపుణ్యానికి, వివిధ రంగాలలోని లబ్ధ ప్రతిష్ఠులయిన వారి గొప్ప కౌశలానికి, శిల్ప సౌందర్యానికి, సాహీతీ కళావైభవాలకు, అనేకమైన చరిత్రాత్మక ఘట్టాలకు ఆ కోటలు వేదికలు అయ్యాయి. సైనికుల విన్యాసాలతో, నాట్య మయూరాల నవరస నర్తనలతో, రాణుల సౌందర్యపు గుబాళింపులతో, రాజుల వీరత్వానికి ప్రతీకలుగా నిలిచిన వైద్ధావోపేతమైన ఆ కోటలు నేడు కళా విహీనంగా మారిపోయాయి.దుండగుల చేతుల్లో చిన్నా భిన్నమయ్యాయి. సరియైన ఆలనాపాలనా లేకపోవడంతో కొన్ని కోటల్లో నేటికీ గుప్తనిధుల కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. మన గత కాలపు వైభవానికి ప్రతీకలుగా, సజీవ సాక్ష్యాలుగా మిగిలిన ఆ కోటల్ని పరిరక్షించడానికి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభించింది.
తెలంగాణా రాష్ట్ర సాహిత్య సాంస్కృతిక చరిత్రకు సజీవ సాక్ష్యంగా గొప్ప అవశేషంగా, అపురూప వరంగా మిగిలిన కోట ”రాయగిరి కోట”.
భువనగిరి జిల్లా కేంద్రానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని మల్లన్న గుట్టపై రెండు వేల ఏండ్ల క్రితం ఎంతో వైభవాన్ని చవిచూసిన ఈ కోటలో నేడు శిధిలాలు మాత్రమే నాటి వైభవానికి ఆనవాళ్ళుగా లభిస్తున్నాయి. చరిత్ర కారుల పరిశోధనలను అనుసరించి బహుశా ఈ కోట శాతవాహనుల కాలంలోనే నిర్మాణం జరిగి ఉంటుందని భావన. అనంతరకాలంలో విష్ణు కుండినులు కొంత కాలం ఈ కోట కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించి ఉంటారని, వారి తర్వాత రాష్ట్ర కూట రాజులు ఈ కోటను ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని ఏలి ఉంటారని అంచనా. రాయగిరి కోట సుమారు 28 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటం వల్ల కోటను పూర్తిగా తిరిగి చూడాలంటే కనీసం 3 రోజులు పడుతుంది. అది కూడా ఒక్కరు, ఇద్దరు కోట ప్రాంతానికి వెళ్ళలేరు. ఒక బృందంగా వెళితే మంచిది. కోట ప్రాంతంలో అడుగుడుగునా శిధిల ఆలయాల అవశేషాలు మనకు కనిపిస్తాయి. వినాయక విగ్రహాలు, నంది విగ్రహాలు, శివలింగాలు, దేవాలయ మంటపాల శిల్పాలు చెల్లా చెదురుగా అక్కడక్కడా పడిపోయి కనిపిస్తాయి.
మల్లన్న గుట్టకు ఉత్తరంలో ఒక చెరువు ఉంది. గతంలో ఇది బహుశా ఉత్తరవాహినిగా ప్రవహించిన వాగు అయి ఉంటుంది. ఉత్తర ప్రవాహం కలిగిన నదీ తీరాలలో బౌద్దులు ఆరామాలు నిర్మించుకోవటం, ఆవాసాలు నిర్మించుకోవటం, చేసేవారు. బౌద్దంలోని రెండు శాఖల్లో (అపరశైలీయ, రాజగిరీయ) రాజ గిరీయ శాఖకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ఈ కోట ప్రాంగణంలో లభించాయని చరిత్ర కారులు తెలియజేసారు. జైన మతం కూడా రాష్ట్ర కూట రాజుల కాలంలో కొంత వైభవాన్ని చవి చూసిందని, ఆ కాలంలోనే కోటలో జైన ఆలయాల నిర్మాణం జరిగి ఉంటుందని చరిత్రకారుల అంచనా. కోటలో మంచినీటి బావులు, కొలనులు ఉన్నాయి. అందులో తామరాకులతో నిండుగా ఉన్న చెరువు ఇప్పటికి మనకు కనువిందు చేస్తుంది. కోటలోని చిన్నచిన్న రాళ్ల గుట్టలో (రాళ్ల చెరికలో) స్వయంభూగా వెలిసిన లక్ష్మీనారసింహస్వామిని ఇప్పటికి చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కోట చుట్టూ రెండు వరుసల్లో 2 అడుగుల వెడల్పుతో 18 అడుగుల ఎత్తులో రాతి గోడలు నిర్మించిన ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. రాజ భవనాల తాలూకు పునాదులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సైనికులు, మంత్రులు, ఇతర రాజ పరివారపు నివాస కట్టడాల తాలూకు ఆనవాళ్లు మనకు కోటలోపల అక్కడక్కడా కనిపిస్తాయి. రెండు వేల ఏండ్ల క్రితం నాటి ఇటుకలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. ఇక్కడ లభించే ఈ ఇటుకలపై సమగ్ర పరిశోధన జరిగితే కోట నిర్మాణ కాలాన్ని సరిగ్గా అంచనా వేయడానకి వీలవుతుంది.
అనేక రాతి కట్టడాల అవశేషాలు మనకు రాయగిరి కోటలో లభిస్తాయి. కొన్ని రాతిశిల్పాలపై గజిబిజిగా చెక్కబడిన కొన్ని అక్షరాలు కనిపిస్తాయి. ఇంతటి విశాలమైన కోట పరిపూర్ణమైన నిర్మాణం జరిగిందా లేక కొంత భాగం మాతమ్రే నిర్మాణం జరిపి అలనాటి రాజులు పాలన కొనసాగించారా అన్న విషయం తెలియదు. ఉత్తర భాగంలో రాతిద్వారం ఉంది. అది కూలిపోయి సంపూర్ణ శిథిలావస్థలో మనకు కానవస్తుంది. కోటలో మొత్తం నాలుగు ప్రధాన ద్వారాలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో నిర్మాణం జరిగినా ప్రస్తుతం వాటి శిథిలాలు మాత్రమే మనకు కనిపిస్తాయి.
మల్లన్న గుట్టపై ఉన్న శివాలయంలో శివుడు మల్లన్నగా నేటికీ భక్తుల పూజలందుకుంటున్నాడు. చరిత్ర పరిశోధకులు అనేక విధాలుగా ”రాయగిరి కోట” గురించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వారి పరిశోధనలు ఫలించి ”రాయగిరి కోట” సంపూర్ణ చరిత్ర బయటికి వస్తే ”తెలంగాణ” చరిత్ర ఎంత గొప్పదో బయటి ప్రపంచానికి సంపూర్ణ సాక్ష్యంగా అందించడానికి వీలవుతుంది. ఆ దిశలో ప్రభుత్వం కూడా పరిశోధనలు కొనసాగిస్తే మంచింది. ”యాదగిరి క్షేత్రాన్ని” అభివృద్ధి పరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం ”రాయగిరి కోట”కు పర్యాటకులను ఆకర్షించడానికి కొన్ని వసతులు కల్పించి, రవాణా ఏర్పాట్లు చేస్తే మంచిది.
నాగబాల సురేష్ కుమార్