పలుకుల చిల్కవీవు, వరపాలక ముఖ్యుడవీవు, నీ కృషిన్‌
మొలకలనెత్తె నభ్యుదయ మూలములైన ప్రజాహితమ్ములున్‌
జలములనెత్తి పోయుటకు జన్మమునెత్తి భగీరథుండవై
వెలువడ జేసినావు ప్రతి వీటిని నీటిని చంద్రశేఖరా !

పంటపొలాలలో పసిడిపండగ జేతునంటచు దీక్ష, చే
కొంటివి సాగునీటికయి కొండగ గట్టుచునానకట్టలన్‌
మింటిని తాకునట్టి కృషి మేలొనరింపగ కర్షకాళికై
కంటివి స్వప్నముల్‌ జనుల కాంక్షలు దీర్పగ చంద్రశేఖరా!

నీతికి దారివేసితివి నిత్యము పౌరహితైక పాలనన్‌
చేతన నింపినావు నిజసేవలతో యువశేఖరుండవై
ఖ్యాతిని నిల్పినావు తెలగాణమునగ్రపథాన దీర్పుచున్‌
జోతలు నీకు యాగపరిశుద్ధ గుణాత్మక చంద్రశేఖరా !

గురువులపైన భక్తి, గుణకోవిద విద్య, వరేణ్య సాహితీ
గరిమ, సుపద్యరత్నముల గాంచెడి నేర్పు, కవీంద్ర సేవలున్‌,
వరములుగాగ నీయశము భావితరాలకు స్ఫూర్తినింపె, వా
గ్వరములు నీకొసంగినది బాసరమాతృక చంద్రశేఖరా !

నీకిల సాటియెవ్వరు? సునిశ్చితరీతిని సాగునీ పథం
బో? కమనీయకాంతులకు పూర్ణతనిచ్చెడి వెల్గుదారియౌ
మా కధినాయకుండవయి, మాన్యతవెల్గు శతాయుషంబులన్‌
నీకొసగంగ నీశ్వరుడు నిత్యము వెల్గుము చంద్రశేఖరా!
– డా|| అయాచితం నటేశ్వర శర్మ

Other Updates