గాలి వేగం, నీలి మేఘం, చినుకు జారింది, చిత్తడి చేసింది, సిద్దిపేటలో చిన్న పాయ పుట్టింది. పరిసరాలతో జోడు కట్టింది. పది జిల్లాలలో పరుగు పెట్టింది. శిరమెత్తుతూ చిందులేసింది. వంకలన్నీ కలిశాయి, వాగుగా మారాయి. శిగాలూగుతూ సాగాయి. ఒకటే జోరు, ఒకటే హోరు. అది తెలంగాణ వేరు, జై తెలంగాణ పేరు. వాగు పరుగు తీసింది. వడివడిగా ఉరకలెత్తింది. నదిలా మారి నాట్యమాడింది. అందరి మదిలో మారాము చేసింది. పాషాణ హృదయాలు పవిత్ర సాలగ్రామలయ్యాయి. ప్రత్యర్థి శిబిరాలు కుప్పకూలాయి. ఊడలేసిన చెట్లు ఊసిపడ్డాయి, జాడలే లేకుండ జరిగిపోయాయి. ఒప్పుకున్న వారు నిప్పులా నిలిచారు, తప్పుకున్నవారు బతికిపోయారు. తలవంచిన వారు మంచివాళ్లయ్యారు. తలలెత్తుకుని మరీ తిరగగలిగారు. ఠలాయించిన వారు ఠారెత్తిపోయారు. మొరాయించినవారు మోసమైపోయారు. సిద్దిపేట వాగు ప్రజా ప్రవాహ వేగమయ్యింది, ‘దేశం’ దేశమే ఆగమయ్యింది!!
నాయకుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన తీరు ఒక పాఠ్యాంశంలాంటిది. బహుముఖ వ్యూహరచన, తెలంగాణ అస్తిత్వ ప్రతీకల విస్తృత వినియోగం, సరికొత్త ఉద్యమ ప్రతీకల ఆవిష్కారం అనే మూడు దశలతో పాటు తెలంగాణ పోరాటంలో మరో కీలక ఘట్టం – రాజకీయం.
గమ్యాన్ని ముద్దాడడం ఎంత ముఖ్యమో, దాన్ని సాధించడానికి ఉపయోగించే మార్గం కూడా అంతే ముఖ్యం అన్నారు పెద్దలు. తెలంగాణ గమ్యమేమిటో, తన అంతిమ లక్ష్యమేమిటో కేసీఆర్‌కు మొదటే సుస్పష్టంగా తెలుసు. విచిత్రమూ, విశేషమూ ఏమిటంటే… ఏ మార్గంలో అయితే తెలంగాణను సాధించగలమో కూడా కేసీఆర్ ముందే గుర్తించగలగడం. సాధారణంగా బహు విఖ్యాతులైన నాయకులు కూడా గమ్యాన్ని నిర్దేశించుకోగలరు గానీ, దాన్ని సాధించే మార్గాన్ని ఎంచుకోవడంలో పొరబడతారు. చివరికి అడుగులు తడబడి ఆగమై సగంలోనే ఆగిపోతారు. ప్రపంచ చరిత్ర నుంచి మన స్వాతంత్య్ర సమర యోధుల దాకా ఇలాంటి ఉదాహరణలెన్నో కనిపిస్తాయి. కానీ కేసీఆర్ ఇలాంటి తప్పులో కాలేయలేదు.
ఇదీ అసలు లాజిక్
తెలంగాణ తేకపోతే, మోసపుచ్చితే, గోసపెడితే నన్ను రాళ్లతో కొట్టండి అని ముందే స్పష్టంగా చెప్పిన కేసీఆర్, కేవలం రాజకీయ మార్గం ద్వారా మాత్రమే తెలంగాణ సాధ్యమనీ అంతే ముందుగా, అంతే సుస్పష్టంగా ప్రకటించారు. పైకి ఇది చిన్న ప్రకటనలా కనిపించినా, దీని వెనక ఎంతో తర్కం దాగి ఉంది. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నాటికి, అంటే 2000 సంవత్సరం దరిదాపుల్లో గ్లోబలైజేషన్ ఉధృత స్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ‘నాకేంటి? నాకేం లాభం?’ అని ఆలోచింపజేసే వినియోగతత్వం వేళ్లూనుకోవడం మొదలైంది. ఆర్థిక, విద్యా సంస్కరణలు జోరుగా సాగుతున్నాయి. పెరుగుతున్న విద్యా, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వనరుల అభివృద్ధికి ప్రజలు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఆకర్షితులు కావడం మొదలైంది. వామపక్ష భావజాలానికి, విప్లవ – ఆయుధ సంస్కృతికి కాలం చెల్లిపోవడం ప్రారంభమైంది. సంపద సృష్టి, సంపదను కూడగట్టడం ప్రజల, ప్రభుత్వాల ధ్యేయంగా మారింది. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమం నుంచి నేపాల్‌లో మావోయిస్టు పోరాటం దాకా ప్రపంచవ్యాప్తంగా అనేక సాయుధ పోరాటాలు వైఫల్య సంకేతాలను ఇచ్చాయి. నేపాల్ వంటి కొన్ని చోట్ల సాయుధ పార్టీలు ఏకంగా ఎన్నికల రాజకీయానికే సిద్ధమయ్యాయి. మార్క్సిస్టు – మావోయిస్టు భావజాలానికి కేంద్రమైన చైనా కూడా సంస్కరణల బాట పట్టింది. ఈ నేపథ్యంలో భారత్ వంటి ‘బలమైన కేంద్ర ప్రభుత్వం’ ఉన్న దేశంలో పాలకులను, పోరాటాల ద్వారా ధిక్కరించి కాకుండా, రాజకీయం ద్వారా మెడలు వంచి మాత్రమే అనుకున్నది సాధించడం సాధ్యం. అపారమైన రక్షణ సామగ్రి, బలగాలు కలిగిన ప్రభుత్వాలు, సాయుధ పోరాటాలను ‘శాంతి భద్రతల పరిరక్షణ’ పేరుతో సులభంగా అణిచివేస్తున్న తరుణంలో లక్ష్యసాధనకు శాంతియుతమైన రాజకీయం మినహా మరో మంచి మార్గం ఏముంటుంది! అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ వేళ్లూనుకున్న భారత్‌లో రాజకీయ అనివార్యతను సృష్టించడం అనుకున్నది సాధించగలమని కేసీఆర్ మొదటే అంచనాకు వచ్చారు. అందుకే ఎన్నికల రాజకీయం ద్వారా మాత్రమే తెలంగాణను సాధించగలమని ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పోదురు బడాయి.. 19 ఎంపీ సీట్లతో తెలంగాణ వస్తుందా? అని వెక్కిరించిన వారున్నారు. అవహేళన చేసిన వారున్నారు. పరిహాసాలాడిన వారున్నారు. జరిగేదా పోయేదా అని సందేహపడ్డ సంశయాత్ములూ ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చింది. ఎలా?
అటా, ఇటా, ఎటో చెప్పు!
తన వ్యూహంలో భాగంగానే కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను ఉద్యమ పార్టీగా అభివర్ణించారు. అనేక విఫల ప్రయోగాలతో విసిగిపోయి ఉన్న జనం ముందు కేసీఆర్ ‘తెలంగాణ రాజకీయం’ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అది మామూలు పౌరుడు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఉద్యోగి కావచ్చు, జర్నలిస్టు కావచ్చు, పార్టీ కావచ్చు… సమీకరణం చాలా సింపుల్. నువ్వు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒకటి తేల్చాలి, ఏదో ఒకటి చెప్పాలి. గత 14 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాన్ని ఈ ఒక్క అంశం చుట్టే తిప్పడం ద్వారా తెలంగాణ అనుకూలురు – తెలంగాణ వ్యతిరేకుల మధ్య కేసీఆర్ నిర్దిష్టమైన విభజన తేగలిగారు. ఈ గీత స్పష్టమైన కొద్దీ ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష కూడా పెరుగుతూ వచ్చింది. గీతకు ఇటు వైపు ఉండే వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ సంఖ్యకు అనుగుణంగానే ఇతర తెలంగాణ వ్యతిరేక, తటస్థ పార్టీల్లో ఉన్న నేతలు కూడా, అనివార్యంగా టీఆర్‌ఎస్‌లో చేరక, జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఆకాంక్షతో కొందరు, మనుగడ కోసం మరికొందరు, పదవుల కోసం ఇంకొందరు. ఏదైతేనేం తెలంగాణ రాజకీయం పరిపుష్టమైంది. ఇదే ఊపులో కేసీఆర్, స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులను, ప్రాంతీయ నేతలను, చిల్లరమల్లర పార్టీలను, తనతో కలుపుకొని బలమైన రాజకీయ ఉద్యమాన్ని నిర్మించారు. దీనికి సమాంతరంగా వామపక్ష భావజాలంతో జనజీవన స్రవంతిలో ఉన్న వారిని రాజకీయాల్లో ప్రోత్సహించి కొత్త తరం నాయకులను తయారు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయంలో, ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రమే ప్రధాన పార్టీల ప్రధాన ఎజెండాగా మారక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఉద్యమంతో ఉన్నవారు మిగిలిపోయారు. పదవుల కోసం పోయినవారు పోయినవారి జాబితాలో చేరిపోయారు.
ముగ్గులోకి కాంగ్రెస్
సాధారణంగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపు ఓటములు, పదవులు, అధికారమే అంతిమ లక్ష్యం. అందుకోసం అవి ఏమైనా చేస్తాయి. దీన్ని కేసీఆర్ యుక్తిగా వాడుకున్నారు. 2004 నాటికి దేశంలో కేంద్రంలో అధికారం చేపట్టగలిగిన పార్టీలు రెండే రెండు. ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. ఈ రెండూ అనుకుంటే తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యం. అధికారంలో ఉన్న బీజేపీ అప్పటికే తెలంగాణకు అనుకూలత ప్రకటించింది, కానీ సంకీర్ణ అనివార్యతల వల్ల ఇవ్వలేకపోయింది. ఇక మిగిలింది కాంగ్రెస్. 2004 నాటికి రాష్ట్రంలో, కేంద్రంలో పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి, అధికారం కోసం ఆవురావురంటున్న కాంగ్రెస్‌ను కేసీఆర్ యుక్తిగా తెలంగాణ ముగ్గులోకి లాగారు. అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని ఆ పార్టీ నేతలతో ఒప్పందం చేసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలితో ప్రకటన చేయించారు. ఆమె మెడలో గులాబీ కండువా కప్పారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అధికారం వస్తే చాలు అనుకునే దశలో ఉన్న కాంగ్రెస్ అన్నింటికీ సరే అంది. తెలంగాణకు సై అంది. దీంతో కేంద్ర స్థాయిలో తెలంగాణ ఏర్పాటు ప్రధాన రాజకీయ ఎజెండాగా మారిపోయింది.
జాతీయ తెలంగాణ
జాతీయ పార్టీ అయిన కాంగ్రెసే తెలంగాణకు సై అనడం దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల, పార్టీల, సమాచార సాధనాల దృష్టిని ఆకర్షించింది. ఈ లోగా ఎంపీగా ఎన్నికైన కేసీఆర్, తెలంగాణ కోసం తనకిచ్చిన మంత్రిత్వ శాఖను (షిప్పింగ్)ను కూడా వదులుకుని, ఏ శాఖా లేని మంత్రిగా ఉండిపోవడానికి సిద్ధపడడం తెలంగాణ కాజ్‌ను వ్యాప్తి చేసింది. ఢల్లీిలోనే మకాం వేసిన ఆయన చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న పార్టీల మద్దతును కూడగట్టారు. ఇంగ్లిష, హిందీ, ఉర్దూ భాషల్లో అద్భుతమైన ప్రావీణ్యం ఉన్న ఆయన తెలంగాణ డిమాండ్ ఎందుకు, ఎలా న్యాయ మైనదో ఇతర జాతీయ, తటస్థవాద పార్టీలకు చాటి చెప్పారు. తమది వేర్పాటు వాదం కాదని, ఏర్పాటు వాదమని విడమరచి వివరించారు. దీంతో జాతీయ స్థాయిలో రాజకీయం, పార్టీలు తెలంగాణ అనుకూల-వ్యతిరేక శిబిరాలు చీలిపోయాయి. సీపీఎం, తృణమూల్ వంటి కొన్ని పార్టీలను మినహాయిస్తే ఎక్కువ పార్టీలు తెలంగాణకు మద్దతు ప్రకటించాయి.
చిట్టచివరికి సోనియా-మన్మోహన్ సారథ్యంలోని కాంగ్రెస్ ఆధిక్య యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడానికి బీజేపీ సహకరించింది. చిట్టచివరికి కుట్రలు, కుతంత్రాలు, బల ప్రయోగాలు, మీడియా వ్యతిరేక ప్రచారాలు, పెప్పర్ స్ప్రేలు, పిప్పర్‌మెంటు ప్రకటనలు దాటుకుని, కాంగ్రెస్- బీజేపీ చేతుల మీదుగానే, ఎన్నికల రాజకీయం ద్వారానే, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే తెలంగాణ ఏర్పడిరది. కేసీఆర్ ముందే ఊహించినట్టు, కేసీఆర్ ముందే ప్రకటించినట్టు జరిగింది.
ఉద్యమ-పార్టీ
సాధారణంగా పార్టీలు ఉద్యమాలు చేయవు. రాజకీయం చేస్తాయి. ఉద్యమాలు పార్టీలను నడిపించవు. ఉద్వేగాలను పుట్టిస్తాయి. అందువల్ల ఉద్యమ-పార్టీ అన్నది పరస్పర విరుద్ధమైన అర్థాలున్న రెండు పదాలు ఏర్పడిన చిత్రమైన పదబంధం. తెలంగాణ ఉద్యమం అందించిన అనేక కొత్త పదాల్లో ఉద్యమ పార్టీ కూడా ఒకటి. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ద్వారా ఉద్యమ విజయాలు సాధించవచ్చని నిరూపించిన అపూర్వ సందర్భమిది.