-యాసా వెంకటేశ్వర్లు
వరంగల్ అర్బన్ జిల్లా ఐనఓలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదర్శ పాఠశాలగా రూపుదిద్దుకుంది. ఒకప్పుడు మూసివేయబడిన స్థాయి నుండి ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే స్థితికి చేరి నర్సరి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్న ఏకైక పాఠశాలగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఆరేళ్ల క్రిందట ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులు తక్కువగా ఉండడంతో మూసివేయగా, గ్రామస్తులంతా సంఘటితమై మూసి ఉన్న ప్రభుత్వ పాఠశాలను తెరిపించుకోవాలనే ఉద్దేశ్యంతో శాసనసభ్యులు, అప్పటి విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2015లో పాఠశాలను తిరిగి పునః ప్రారంభించుకున్నారు. ఏడాదికి పాఠశాల అభివృద్ధికి కేవలం రూ.3,000లు ఖర్చుల నిమిత్తం ప్రతి విద్యార్థి చెల్లించేలా తీర్మానం చేసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పాఠశాల అభివృద్ధి చెందుతున్నది. ఈ పాఠశాలలో 489 మంది విద్యార్థులు ఉండగా, పదవ తరగతిలో మొదటి బ్యాచ్ 2018-19 సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. అలాగే మండలంలో ఫస్ట్ ర్యాంక్ 9.8 జి.పి.ఎ. సాధించారు.
ప్రస్తుతం 9 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 8 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, ఇద్దరు డిప్యూటేషన్ ఉపాధ్యాయులతో ముందుకు వెళుతున్నది. అలాగే పాఠశాలలో ఎస్.ఎస్.ఎ. గ్రాంట్స్‌తో 4 గదులను నిర్మించడంతో పాటు, టాయిలెట్స్, ఇతర మరమ్మతులు చేసి బోర్‌వెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు శానిటేషన్ కిట్స్, స్నాక్స్ అందించడం జరుగుతున్నది. ప్రభుత్వం నుండి 3 స్కావెంజర్ సేవలు బడికి ఉపయోగపడుతున్నాయి. గ్రామ సర్పంచ్ ఆడేపు దయాకర్ 4 సి.సి. కెమెరాలను, 5 రూంలు, 4 షెడ్స్ ఏర్పాటు చేశారు. బాల వికాస ఆధ్వర్యంలో డిజి క్లాస్, బెంచీలు 14 సెట్స్, లైబ్రరికి కావలసిన పుస్తకాలు, మెటీరియల్ అందజేశారు. అలాగే పేరెంట్స్ కమిటి ప్రతి తరగతిలో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు రెండు అదనపు తరగతి గదులు, ఆర్.ఓ.ఆర్. వాటర్ ప్లాంట్, ప్రత్యేక తరగతుల నిమిత్తం 8 మంది ప్రైవేట్ టీచర్లను పాఠశాలకు అందిస్తున్నారు. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం కల్పించడం జరిగింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి ఆధ్వర్యంలో పాఠశాల ప్రస్తుతం అభివృద్ధి బాటలో నడుస్తూ మూసివేత నుండి ‘నో అడ్మిషన్స్’ బోర్డు పెట్టే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగింది. వీరందరి కృషితో స్వచ్చ్ పాఠశాల అవార్డు, ఉపాధ్యాయులు ఎస్. మదన్‌మోహన్ రెడ్డి 2018-19 సంవత్సరములో ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఈ సంవత్సరంలో బెస్ట్ ఎంప్లాయర్‌గా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధిస్తున్న ఏకైక పాఠశాలగా మండలంలో గుర్తింపు పొందింది. పాఠశాల సాధిస్తున్న ప్రగతి తెలుసుకుని పలుమార్లు విదేశీయులు పాఠశాలను సందర్శించారు.