చరిత్ర
రచనా విధానంలో చారిత్రకులు ఆధారపడే ఆకారాల్లో ప్రధానమైనవి శాసనాలు. ఇవి ఆయా కాలాల్లోని రాజకీయ, చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, మత విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడతాయి. శాసనం అనేది ప్రాచీనకాలంనుండి ఉంది. ”శాస్యతే అనేన శాసనం” అనేది క్రమంగా రాజాజ్ఞ అనే అర్థంలో స్థిరపడింది. అన్ని శాస్త్రాల అధ్యయనాలకు వివిధ పేర్లు ఉన్నట్లే శిలలపైన, రాగిరేకులపైన లిఖించబడ్డ అక్షరాలను చదివి వాటిని విశ్లేషించే శాస్త్రాన్ని ”శాసన శాస్త్రం” (ఎపిగ్రఫి) అంటారు. ఈ శాసన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అంత సులభమేమీ కాదు.
ప్రాచీన కాలం నుండి నేటివరకు ఈ శాసనాల మీద పలువురు పండితులు కృషి చేసినారు. భారతదేశంలో పూర్వ చరిత్రను అధ్యయనం చేసి వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక శాఖను ఏర్పాటు చేసింది. దాన్ని పురా వస్తు శాఖ అంటారు. దాని ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర పురావస్తు శాఖలను ఏర్పాటు చేశాయి.
1914లో యాజ్దాని డైరెక్టర్‌గా నిజాం ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2 డిసెంబర్, 1964లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో శాసన శాఖను ప్రత్యేకంగా వేరు చేసి స్వతంత్రతను కల్పించింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామ గ్రామాలకు వెళ్ళి సర్వే నిర్వహించి, అక్కడ లభించే శిలా, తామ్రశాసనాలను సేకరించడం. సేకరించిన వాటిని పరిష్కరించి ప్రచురించడం. ఈ సర్వే నిర్వహిస్తున్న సమయంలో పురావస్తుశాఖ ఆయా రాజవంశాలకు చెందిన 7,478 శాసన ప్రతిబింబాలను సేకరించింది. వీటిలో 2,795 తెలంగాణ జిల్లాలకు సంబంధించినవి. ఇవి తెలంగాణ చరిత్రను నిర్మించడంలో ముఖ్య ఆధారాలుగా ఉన్నాయి. సేకరించిన శాసనాలను జిల్లాల వారిగా విభజించి ఐదు సంపుటాలను ప్రచురించింది. అవి 1. వరంగల్, 2. కరీంనగర్, 3. నల్లగొండ, 4. మెదక్, 5. మహబూబ్‌నగర్. ఇంకా నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సర్వే పూర్తయింది. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా సర్వే కావలసి ఉంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రగతి. 1915-16 నుండి 2011-2012 వరకు ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 66 సార్లు పురావస్తు శాఖ త్రవ్వకాలు జరిగినాయి. ఇన్ని సంవత్సరాల్లో వీరికి బహత్‌శిలా యుగం, నవీన శిలాయుగం, పూర్వ చారిత్రక యుగం, మధ్యయుగం నాటి కాలాల అవశేషాలు, శాసనాలు, దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు లభించాయి.
1979-83 మధ్యకాలంలో కరీంనగర్, కోటిలింగాలలో జరిపిన త్రవ్వకాల్లో పూర్వ శాతవాహన, శాతవాహనుల కాలాలకు సంబంధించిన అనేక చారిత్రక, సాంస్కృతిక అవశేషాలు బయల్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడివడ్డాక తెలంగాణ తన చారిత్రక మూలాల అన్వేషణలో భాగంగా ముందుకు సాగుతుంది. ఈ ప్రయత్నంలో ఆర్కియాలజీ శాఖ, పలువురు వ్యక్తులు తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు.
2016-17లో జరిపిన తవ్వకాలలో పురావస్తుశాఖ సిద్ధిపేట జిల్లాలో పాలమాకుల, నర్మెట్ట గ్రామాల్లో బృహత్‌శిలాయుగం నాటి అవశేషాలు వెలుగులోకి వచ్చాయి.
అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని పజ్జూరు, ఫణిగిరి గ్రామాల్లో పురావస్తుశాఖ త్రవ్వకాలు నిర్వహించింది. ఫణిగిరిలో చేసిన పరిశోధనల్లో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బయటపడిన మహాస్తూప వివరాలను అంచనా వేసి అది ఒక పారిభోగిక స్తూపంగా నిర్ణయించారు. పారిభోగిక స్తూపం అంటే బౌద్ధ సన్యాసుల వ్యక్తిగత వస్తువులు ఉన్నటువంటి, స్తూపంగా చెప్తారు. బౌద్ధ సన్యాసులు, భిక్షువులు ఈ ప్రాంతంలో అధికంగా ఉండేవారు. తెలంగాణాలో లభించిన మొదటి పారిభోగిక స్తూపంగా దీన్ని భావిస్తున్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతులను వెలికి తీసి విస్తృతస్థాయిలో మహోత్కృష్టమైన ఇక్కడి చరిత్రను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఆర్కియాలజీ & మ్యూజియమ్స్ శాఖ కృషి చేస్తుంది. ఈ క్రమంలో అనేక ఇతర సంస్థలు, వ్యక్తులతో కలిసి భవిష్యత్ కార్యా చరణ, ప్రాజెక్టులను రూపొందిస్తుంది. దీనివల్ల ఆయా సంస్థల సహకారంతో ఎంతో ఘనకీర్తి కలిగిన తెలంగాణ ప్రాంత చరిత్ర వెలుగులోకి వస్తుంది. పరిశోధక బృందంలోని నిపుణులైన శాసనకారులు, పరిశోధక విద్యార్థులు తమ వంతు ప్రయత్నంగా అనేక త్రవ్వకాలు జరిపి అక్కడ లభించిన శాసనాలు, చారిత్రక అవశేషాలను ఎప్పటికప్పుడు పత్రికాముఖంగా ప్రకటిస్తున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఈవిధమైన పరిశోధనలు పరిశీలనలు జరుగుతున్నాయి.
పురావస్తుశాఖ ఇపట్పికే వివిధ జిల్లాలకు చెందిన 2,795 శాసన ప్రతిబింబాలను విభజించుకుంది. దీని ద్వారా చారిత్రక తెలంగాణను పునర్ నిర్మించుకోవచ్చు. ఇప్పటివరకు 47 పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు ఎపిగ్రాఫికల్ సీరిస్ క్రింద ప్రచురించారు. ఇందులో వ్యక్తిగత శాసనాలు, కార్పస్ శాసనాలు, వార్షిక నివేదికలు, జిల్లాలవారి సంపుటాలు ఉన్నాయి.
తెలంగాణాలో శాసనాల పట్ల అవ గాహనతో, ఆసక్తితో శాసనాలను చదివిన మొదటి వ్యక్తి మద్రాసు ప్రెసిడెన్సీలో పనిచేసిన ప్లీట్. ఇతడు మద్రాసు నుండి ఈ ప్రాంతానికి వచ్చి హన్మకొండ శాసనాన్ని 1891లో చదివినాడు.
ఆ తరువాత మానవల్లి రామకృష్ణ కవి 1890- 1910 ప్రాంతంలో వనపర్తి రాజా ఆస్థానంలో ఉండి మహబూబ్‌నగర్ శాసనాలను సేకరించినారు.
1916-1918 ప్రాంతంలో శేషాద్రి రమణకవులు నల్లగొండ, వరంగల్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అనేక శాసనాలను సేకరించారు. వీరి కృషి తెలంగాణ చరిత్రకు ఆయువుపట్టు.
కంభంపాటి అప్పన్నశాస్త్రి వేయిస్తంభాల గుడి శాసనాన్ని అధ్యయనం చేసి 70 పుటల గ్రంథాన్ని వెలువరించారు.
తెలంగాణాలో కొమర్రాజు లక్ష్మణరాయ పరిశోధక సంస్థ ద్వారా కొమర్రాజు ‘తెలంగాణ శాసనాలు’ రెండు సంపుటాలుగా 1930, 32లలో వెలువరించారు.
స్టేట్ ఆర్కియాలజీ ఆధ్వర్యంలో ”కార్పస్ ఇన్స్‌స్క్రిప్షన్స్ ఆఫ్ తెలంగాణ” 4 సంపుటాలు వెలువడ్డాయి. మొదటి మూడు సంపుటాలకు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు ఎడిటర్‌గా వ్యవహరించగా, 4వ సంపుటం మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆధ్వర్యంలో వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ & మ్యూజి యమ్స్ ఏర్పడింది. ఈ శాఖలో శాసన పరిశోధన ప్రత్యేక విభాగం ఏర్పడి పరిశోధనలు నిర్వహించి పుస్తకాలు ప్రచురించింది.
ఉపాసికాయ బుద్ధ రక్షిషాయ దానం (వర్ధమానుకోట)
తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు వెలుగుచూసిన శాసనాల్లో మొదటగా శాతవాహనుల సిముఖుని నాణేలు, వాటిపై ఉండే లిపి మొదటిగా పేర్కొంటున్నారు.
- మొదటి సంస్కృత శాసనం విష్ణుకుండిన గోవిందవర్మ ఇంద్రపాలనగర శాసనం
- మొదటి ప్రాకృత శాసనం వర్ధమానుకోటలో లభించిన ఉపాసికాయ బుద్ధరక్షితాయ దాన శాసనం
- మొదటి పద్య శాసనం జినవల్లభుడి కుర్క్యాల శాసనం
- మొదటి గద్య శాసనం కొరవి శాసనంగా పేర్కొంటున్నారు.
- తెలంగాణ శాసనాల్లో భాష క్రమ పరిణామ దశలో అనేక మార్పులను పొందింది.
- మొదట శాసనాల్లో ప్రాకృత భాష ఉంది. అటు తర్వాత క్రమంగా శాసనాల్లో సంస్కృతం ప్రవేశించింది. ఎక్కువ ప్రాకృతం, తక్కువ సంస్కృతం నుండి తక్కువ ప్రాకృతం ఎక్కువ సంస్కృతం ఉన్న శాసనాలు వచ్చినవి. కాలక్రమంలో ప్రాకృతం పూర్తిగా అదృశ్యమైంది. సంస్కృతం- కన్నడ, కన్నడ – సంస్కృతం, కన్నడ – తెలుగు, తెలుగు – కన్నడ, సంస్కృతం – తెలుగు, తెలుగు – సంస్కృతం.. ఈవిధంగా శాసనాల్లో ఆయా రాజుల అధికార భాషానుగుణంగా భాష స్థిరపడింది. కొన్ని మరాఠీ శాసనాలు, పర్షియన్, ఉర్దూశాసనాలు కూడా ఈ ప్రాంతంలో లభించినాయి.
తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పాశ్చాత్యులు, ఉత్తర భారతీయులు, ఆంధ్ర ప్రాంతంవారు, తెలంగాణ వారు శాసనాలను పరిశోధించి తద్వారా ఇక్కడి చరిత్రకు మహోపకారం చేశారు.
హెచ్. కృష్ణశాస్త్రి, కృష్ణమాచారి, నీలకంఠ శాస్త్రి, జయంతి రామయ్య పంతులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, శేషాద్రి రమణకవులు, మండ నరసింహం, ఎన్. రమేశన్, ఆర్. సుబ్రహ్మణ్యం, గడియారం రామకృష్ణశర్మ, రాళ్ళబండి సుబ్బారావు, పి.వి. పరబ్రహ్మశాస్త్రి, బి.ఎన్.శాస్త్రి, ఇంగువ కార్తికేయ శర్మ, ఆదిరాజు వీరభద్రరావు, మారేమండ రామారావు, గొడవర్తి రామదాసు తదితరులు విశేషంగా కృషి చేశారు.
వీరందరు ప్రభుత్వ అధికారులుగానో, వ్యక్తిగత తృష్ణతోనో కృషి చేసి తెలంగాణ చరిత్రకు కొత్త వెలుగులు తీసుకువచ్చారు. ప్రస్తుత కాలంలో డి. సూర్యకుమార్, ఈమని శివనాగిరెడ్డి, కుర్రా జితేంద్రబాబు, హరగోపాల్ వంటివారు శాసనపరిశోధనలో విశేషంగా కృషి చేస్తున్నారు. సూర్యకుమార్ ‘ఆచంద్రార్కం’ పేరుతో 30 కొత్త శాసనాలను పరిచయం చేశారు.
ఈ విధంగా శాసనాల ద్వారా తెలంగాణాకు సంబంధించిన చరిత్రను ఒక క్రమపద్ధతిలో నిర్మించుకోవచ్చు. చరిత్ర నిర్మాణంలో అనేక ఆధారాలున్నా శాసనాలు పరమ ప్రామాణికాలుగా నిలుస్తున్నాయి. కచ్చితమైన కాల నిర్ణయం చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణాలో మరిన్ని పరిశోధనలు జరిగి మన పూర్వచరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు నలుదిశలకు వ్యాప్తి చెందాలని కోరుకుంటూ…..
డా||. భిన్నూరి మనోహరి