సంస్థానాలకు ఒక చరిత్ర ఉంది.
ఒక సంస్కృతి ఉంది. సంస్థానాల్ని కేవలం భౌగోళిక పరిధులకు సంబంధించినవిగానే పరిగణించకూడదు. వాటికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్లేయుల నుంచి విముక్తయిన తర్వాత భారతదేశంలో అనేక సంస్థానాల్ని విలీనం చేశారు. కానీ అంతకుముందు వాటి విల క్షణలతో అవి మనుగడలో సాగాయి. అవి చరిత్రలో, చరిత్ర నిర్మాణంలో భాగం. ఇప్పుడు 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ చెప్పుకోదగిన సంస్థానాలు ఉండేవి. వీటికి సంబంధించిన చరిత్రలోకి చూపు సారించాలి. ఇందుకోసం సంస్థానాల చరిత్ర, సాహిత్యం,
సాంస్కృతిక రంగాలకు సంబంధించిన రంగాల్లో పరిశో ధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. విజయన గరం, బొబ్బిలి, పిఠాపురం సంస్థానాలకు లభించిన ఆదరణ, గౌరవం, ప్రాచుర్యం తెలంగాణ సంస్థానాలకు దక్కలేదు. నిజానికి తెలంగాణలోనే సంస్థానాలు అధికం.
తెలంగాణ సంస్కృతివ్యాప్తిలో, సంఘ సంస్కరణలలో సంస్థానా ధీశుల పాత్ర చాలా విశేషమైంది. మరువలేనిది. కందుకూరి, గుర జాడలను సంఘ సంస్కర్తలుగా చాటిన ఆనంద గజపతి రాజును మనం మెచ్చుకోవచ్చు. తెలంగాణలో ఒక రాజు సంఘ సంస్కర్తగా వెలగొందిన విషయం చాలా మందికి తెలియదు. రెండవ రామేశ్వర రాయలును మనం తొలి తెలుగు సంఘ సంస్కర్తగా చెప్పుకోవచ్చు. వారి గురించి సురవరం ప్రతాపరెడ్డి 1930 సంవత్సరంలో గోల్కొండ పత్రికలో ‘తొలి తెలుగు సంఘ సంస్కర్త’ అనే పేరుతో వ్యాసం కూడా రాశారు. నిజాం సంస్థానంలో నిజాం నాణేలతో పాటు చెల్లుబాటు అయిన ఏకైక నాణెం ‘సూగురు సిక్కాలు’. వీటిని వనపర్తి సంస్థానాధీశులు వేయించారు. ఆసియా ఖండంలోనే మొదటి సైఫన్ సిస్టం గల ప్రాజెక్టును నిర్మించింది వనపర్తి సంస్థానా ధీశులే అని ఎంతమందికి తెలుసు?
ఇలాంటి విషయాలను భద్రపరచడం కోసమైనా తెలంగాణ సంస్థానాల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరముంది. నిజామాబాద్ జిల్లాలోని శిర్నపల్లి సంస్థానాధీశులు తవ్వించిన చెరువులే నేటి నిజామాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నవని ఎవరికి తెలుసు? ఇలా చరిత్ర మరుగున పడిన వాస్తవాలను వెలికి తీయాలన్న ఉద్దేశమే మన సంస్థానాల చరిత్ర రచనకు ప్రేరణ. తెలంగాణలో సంస్థానాలు అన్ని నిజాం సర్కారుకు సామంత రాజ్యాలే. వీటిలో కొన్ని బహమనీ సుల్తానుల కాలంలో ఏర్పడితే మరి కొన్ని బీజాపూరు నవాబుల కాలమందు, మొఘలు పాదుషాల కాలమందు ఏర్పడినాయి. తెలంగాణ సంస్థానాలను పాలించిన వాళ్ళలో స్త్రీలు కూడా ఉండటం గమనించదగ్గ విషయం. సాహిత్య రచనగానీ, సామాజిక ఉద్ధరణ గానీ, సాహిత్య పోషణ గానీ, సాహిత్య సముద్ధరణ చేసిన వాళ్ళలో ఆత్మకూరు, గద్వాల, వనపర్తి, పాపన్నపేట, శిర్నపల్లి సంస్థాన జమీందారిణులు పేర్కొనదగ్గవారు. తెలంగాణ సంస్థానాల్లో వనపర్తి, దోమకొండ, గద్వాల, ఆత్మకూరు, జటప్రోలు, ఆలంపురం, పాపన్నపేట, పాల్వంచ, రాజాపేట, నారాయణపురం పేర్కొనదగినవి. వీటితో పాటు నేటి రాయచూర్ జిల్లాలోని ఆనగొంది, గురుగుంట సంస్థానాలు ఆనాటి నిజాం సర్కార్‌లో అంతర్భాగం. ఈ సంస్థానాల చరిత్ర 1415 నుండి ప్రారంభమై 18 శతాబ్దం వరకు కొన్ని సంస్థానాలు పాలన చేస్తే, మరి కొన్ని 1948 సెప్టెంబర్ 17 వరకు పాలనను కొనసాగించాయి. ఈ సంస్థానాల చరిత్రను గమనిస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. చరిత్ర మరుగున పడిన వాస్తవాలు తెలిసి వస్తాయి. తెలంగాణ చరిత్ర అధ్యయనంలో విస్తృతికి తోడ్పడుతుంది.
సంస్థానాలు – కవి పండితులు:
తెలంగాణ కవి పండితులకు నిలయం సంస్థానాలకు ఆలయం. నాటి సంస్థానాలు కవులను, పండితులను ఘనంగా పోషించాయి. అనేక కావ్యాలు వెలుగు చూడటానికి దోహద పడ్డాయి. దోమకొండ, వనపర్తి, గద్వాల, ఆత్మకూర్, గోపాల్‌పేట, పాపన్నపేట, శిర్నపల్లి, అలంపూర్, మునగాల సంస్థానాధీశులు ఎందరో కవి పండితులను పోషించారు. వారిలో ముఖ్యలు ఎలకూచి బాలసరస్వతి, మానవల్లి రామకృష్ణ కవి, సురభి మాధవ రాయలు, కామినేని మల్లారెడ్డి, మల్లారెడ్డి దేశాయి, తిమ్మ భూపాలుడు, రాజాబహిరి గోపాలరాయలు, కృష్ణయ్య, ముష్ఠిపల్లి వెంకటభూపాలుడు, కాణాదం పెద్దన సోమయాజి, చింతలపల్లి ఛాయాపతి, తిరుమల బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు, సురపురము కేశయ్య, దీక్షితుల పాపయ్యశాస్త్రి, పెద్దసోమభూపతి, పుల్లగమ్మి వెంకటాచార్యులు, కొమఱ్ఱాజు వెంకట లక్ష్మణరావు, హోసదుర్గం కవుల కావ్యాలు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు.
కవులు వారి కావ్యాలు:
ఎలకూచి బాలసరస్వతీ – భర్తృహరి సుభాషితమును తెలుగులో అనువధించాడు. సురభి మాధవరాయులు చంద్రికా పరిణయం, మల్లభూపాలియం సురభివంశ చరిత్ర, సురపురం కేశవయ్య నిర్దోష్ట్య రామాయణము. తిరుమల బుక్కపట్టణం రంగాచార్యులు – గుణ రత్నాకర పద్మిని పరిణయం, శ్రీనివాసాచార్యులు – జాంభవతి పరిణయం, నంజరాజచంపువు, రాజశేఖర చరిత్రము, సురపుర వెంకటగురు చరిత్రము. దీక్షితుల పాపయ్యశాస్త్రి- చెంచునాటకం. తిరుపతి వెంకటకవులు -శ్రీనివాసా విలాసం కావ్యం. బోరవెల్లికాణాదమ పెద్దన – ఆధ్యాత్మ రామాయణము, ముకుంద విలాసము, మత్స్య పురాణము. చిన్న సోమభూపాలుడు-రతి రహస్యము. కామ సముద్రం అప్పలాచార్యులు – ఆంధ్రాష్టవది. తిరుమల కృష్ణమాచార్యులు – సుందరకాండ.
తిరుమల బుక్కపట్టణం బుచ్చి వెంకటాచార్యులు- వేదాంత కిరాతావళి, అభినవ శృంగార మంజరీభాణము, కళ్యాణపురంజనము, శృంగార సర్వస్వము. కొటికలపుడి వీరరాఘవాచార్యులు- భారతము (ఉద్యోగపర్వం). ముష్ఠిపల్లి రామభూపాలుడు- ఛందోముకుర సంస్కృత గ్రంథం. పురాణం దీక్షాచార్యులు – ఛందోముకురము. చెట్లూరి నారాయణాచార్యులు – ప్రతాప రుద్రీయము. పోకూరి కాశీపత్యావధాని – సారంగధరీయము. దీక్షితుల నర్సింహశాస్త్రి- లక్ష్మణ పరిణయము, తెలుగు సత్యనారాయణ వ్రతకల్పము, పారువేట పద్యములు, బహుజనపల్లి వెంకటాచార్యులు, వెంకటకృష్ణమాచార్యులతో కలిసి రాజలేఖ పుస్తకాన్ని రచించారు.
హోసదుర్గం శ్రీనివాసరాఘవాచార్యులు – వీరరాఘవీయ భూమిక, ఆచార్య వైభవము, స్వభావపద్ధతి. పాపయ్యశాస్త్రి- భారత సంగ్రహణము, భ్రమరాంభికా సంవాదము. విక్రాల నరసింహ్మాచార్యులు – భారతీస్తుతి, కళ్యాణి, మాలతీ మాధవము, కురుసంధానము, ధూతాంగదము, జగన్మోహన భావము. మాదిరాజు విశ్వనాథరావుతో కలిసి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి- విక్రమాంక దేవచరిత్ర, కర్ణసుందరీ నాటకాన్ని రచించారు. చెన్నకృష్ణకవి- యాదవ భారతీయం. వీరరాఘవాచార్యులు వీరరాఘవీయం. కామినేని మల్లారెడ్డి – షట్చక్రవర్తి చరిత్ర, పద్మ పురాణము, శివధర్మోత్తర ఖండము. కామినేని ఎల్లారెడ్డి, వాసిష్టము, లైంగ్యము. రాజారాజేశ్వరరావు- ఉర్దూ-తెలుగు నిఘంటువును రచించారు. బిజ్జుల తిమ్మభూపాలుడు-అనర్ఘరాఘవము. పెద్దమందడి వెంకట కృష్ణకవి – నిర్వచన మహాభక్త విజయము. మల్లారెడ్డి దేశాయి – గంగపుర మహాత్య్మము. వరదరాజు నందికేశ్వరశాస్త్రి – శివతత్త్వసుధానిధి, సేతు మహాత్య్మము.
సంస్థానాలు – సాహిత్య వికాసం :
తెలంగాణ సంస్కృతి నిర్మాణంలో ముఖ్యంగా సాహిత్యం వికాసంలో సంస్థానాల పాత్ర విశిష్టమైనది. ఆసఫ్‌జాహీలు నిర్వహించాల్సిన పనిని ఇవి నిర్వహించాయి. అనేక తాళపత్ర గ్రంథాలను భద్రపరిచారు. దక్షిణాంధ్రయుగంలో తంజావూరు, మధుర, పుదుక్కోట రాజ్యాలు పోషించిన పాత్రను తెలంగాణలో ఈ సంస్థానాలు పోషించాయి. తెలంగాణా సంస్థానాధీశుల్లో కొందరు కవి పండితులై కావ్యాలు వెలువరించారు. మరి కొందరు ఎందరో కవులను ప్రోత్సహించి కావ్యాలు వెలువడుటకు కారకులయ్యారు. స్వయంగా ముద్రణ యంత్రానలు తమ సంస్థానాల్లో పెట్టి ఆముద్రిత కావ్యాలు వెలుగులోకి రావటానికి కారకులైనారు. 1850లో వనపర్తి సంస్థానంలో, 1865లో గద్వాల సంస్థానంలో ముద్రణాయంత్రాలు స్థాపించారు. ఆ తరువాత ఆత్మకూరు సంస్థానంలో 18వ శతాబ్దం చివరలో స్థాపించారు. మానపల్లి రామకృష్ణ కవి ఆధ్వర్యంలో వనపర్తి సంస్థానాధీశులు 21 అముద్రిత కావ్యాలను ముద్రించారు. చిలుకూరి నారాయణరావు కురుమూర్తినాథ శతకాన్ని రచిస్తే వాటిని ఆత్మకూరు సంస్థానాధీశులు వారి సంస్థాన ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించారు. గద్వాల రాణి ఆదిలక్ష్మి దేవి ఎన్నో అముద్రిత కావ్యాలను తన ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించి తెలుగు సాహిత్య లోకానికి అందించింది. వనపర్తి, గద్వాల, ఆత్మకూర్ సంస్థానాధీశుల సంస్థానాల్లో వెలువడిన కావ్యాలు, పరిష్కరించిన గ్రంథాలు, ముద్రితమైన కావ్యాల పాత్ర తెలుగు సాహిత్యంలో చాలా విశేషమైంది.
సంస్థానాల సాంస్కృతిక సేవ :
తెలంగాణ సంస్కృతి వ్యాప్తిలో, సంఘ సంస్కరణలలో సంస్థానా ధీశుల పాత్ర చాలా విశేషమైంది. వనపర్తి, గద్వాల, దోమకొండ, ఆత్మకూర్, కొల్లాపూర్, శిర్నపల్లి, పాల్వంచ, నారాయణపురం, ఆందోల్, రాజాపేట సంస్థానాలు ఎన్నో సాంస్కృతిక అంశాలను చేపట్టాయి. సంస్థానాధీశుల పండుగలు, ఉర్సు, జాతరలు, పీర్ల పండుగలలో పరమత సహనాన్ని పాటించి అన్ని వర్గాల వారిని ఆదరించారు. కొందరు సంస్థానాధీశులు ఉర్దూ కవులను కూడా తమ ఆస్థానంలో గౌరవించి సత్కారాలను అందజేశారు. పండుగల సందర్భాలలో సాహిత్య పోటీలను ఏర్పరచేవారు. ఆ పోటీలకు సంస్థాన కవులే కాక ఇతర ప్రాంత కవులను కూడా ఆహ్వానించి సత్కారాలు, సన్మానాలు చేశారు. అలా సత్కారం పొందిన వారిలో ప్రముఖులు తిరుపతి వెంకట కవులు, చిలుకూరి నారాయణరావు. ఈ సంస్థానాధీశులు అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే ఆలయాలను మందిరాలను నిర్మించి జాతికి అందించారు.
డా|| గుంటి గోపి