1947 జూన్ 11వ తేదీన తనకు స్వతంత్రం లభించిందని నిజాం ఒక ఫర్మానా విడుదల చేశాడు. దీనికి ప్రజా మద్దతు లేదని తెలుసుకున్న నిజాం భారత ప్రభుత్వంతో సంధిచర్యలను ప్రారంభించాడు. రాయబారాల నిమిత్తం ఒక ప్రతినిధి వర్గాన్ని ఢిల్లీకి పంపించాడు. 1947 ఆగస్టు 15 నాటి పరిస్థితులలో ఎలాంటి మార్పు ఉండదని భారత ప్రభుత్వం ఖండితంగా చెప్పింది. అంటే విదేశీవ్యవహారాలు, రవాణా, సైన్యం భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. బ్రిటీష్ వారి హయాంలో కొనసాగిన విధానమే ఇది. అసలు హైదరాబాద్ విషయమై ఇంత రాద్ధాంతం జరుగవలసిన అవసరమే లేదు. కేంద్రంలో ఎంత ఔదార్యంగల ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం లభిస్తుందని అనుకోరు… చారిత్రకంగా కానీ, భౌగోళికంగా కానీ ఈ వాదన ఆచరణ సాధ్యంకానిది. భారత ప్రభుత్వం దేశ విభజనకు సంబంధించిన వివిధ సమస్యలతో తలమునకలై ఉండటం వల్ల హైదరాబాద్‌కు ఈ అవకాశం వచ్చింది. యథాతథ ఒడంబడికపై నిజాంను సంతకం పెట్టనీయకుండా రజాకార్లు నానా రభస చేశారు. చివరికి ఇది ప్రధాని ఛత్తారీ రాజీనామాకి దారితీసింది. ఛత్తారీ స్థానంలో లాయక్ అలీ ప్రధాని అయ్యాడు.
లాయక్ అలీ నాలాయక్ పనులు:
లాయక్ అంటే తెలివైనవాడని అర్థం. కానీ ఈ లాయక్ అలీ మాత్రమే అన్ని నాలాయక్ (తెలివిలేని) పనులే చేస్తుండెడివాడు. అధికారం స్వీకరించగానే లాయక్ అలీ ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇరవై కోట్ల రూపాయల రుణం ఇచ్చింది. విభజన సమయంలో పాకిస్తాన్‌కు ఇవ్వలేదని ఆస్తుల విలువ యాభై అయిదు కోట్ల రూపాయల విషయంలో పాక్‌తో మంతనాలు జరుగుతుండగానే ఈ చర్య కేంద్ర ప్రభుత్వానికి మరింత ఇబ్బంది కలిగించింది. ఆ రోజుల్లో రాజ్యం నడిపింది నిజాంకాదు. లాయక్ అలీ అంతకన్నాకాదు. ఇత్తె హాదుల్ ముసల్మీన్ నాయకుడు ఖాసిం రజ్వీ.
1947 డిసెంబర్ 4వ తేదీన రోజు మాదిరిగా నిజాం తన కారులో కింగ్‌కోఠినుంచి సంధ్యా వేళలో నమాజుకు బైల్దేరాడు. సూర్యుడింకా అస్తమించలేదు అన్ని వాహనాలు రోడ్డుకు ఎడమ వైపుగా వెళితే నిజాం నవాబు కారు కుడివైపుగా వెళుతుంది. అది ఆయన ప్రత్యేకత. ఆల్ సెయింట్స్ స్కూల్ వద్దకు నిజాం కారు రాగానే ఒక గ్రెనేడు పెద్ద శబ్దం చేస్తూ పేలింది. కారు తలుపుకి తగిలి అది పడిపోయింది. నిజాంకు ఏ హాని జరగలేదు.
యధారీతి ఒడంబడిక నామమాత్రమే. దీన్ని నిజాం ప్రభుత్వం ఎన్నడూ ఖాతరు చేయలేదు. 1947 సెప్టెంబర్ 18న ముస్లిం శరణార్థులకు మాత్రమే రాష్ట్రంలో ప్రవేశం లభిస్తుందని నిజాం ప్రభుత్వం ఫర్మానా విడుదల చేసింది. ప్రతీకార వాంఛతో వచ్చిన శరణార్థుల రజాకార్ల సాయంతో రాష్ట్రంలో నానా భీభత్సం సృష్టించారు. తమ మానప్రాణ రక్షణ కోసం రాష్ట్ర ప్రజలు రాష్ట్రం విడిచి పరిసర రాష్ట్రాలలో తలదాచుకున్నారు.
నిజాం ప్రభుత్వం జాతీయ పత్రికల మీద తీవ్ర ఆంక్షలు విధించింది. దక్కన్ క్రానికల్, ఇమ్రోజ్, ఫయాం, డెయిలీ న్యూస్ రాసే సంపాదకీయాలను, విమర్శలను, విలేఖరులు పంపే వార్తలను ముందుగా సెన్సార్‌కు పంపాలని 1948 ఫిబ్రవరి 8న ఒక ఉత్తర్వు మలువడింది. గోల్కొండ పత్రిక దాదాపు రెండు మాసాలు సంపాదకీయాలు రాయడానికి అనుమతించలేదు. ముందుముల నరసింగరావు సంపాదకత్వంలో మలువడే ప్రసిద్ధ పత్రిక రయ్యత్ ఈ క్రూర నిర్బంధ విధానాల దాడికి ఆగిపోయింది. 1948 ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో గాంధీజీ మృతిపై సంతాపసూచకంగా అఖిల పక్ష సభ జరిగింది. ఈ సభలో మాట్లాడుతూ నిజాం పాదాలు కడిగేందుకు బంగాళఖాతం, అరేబియా సముద్రపు జలాలను ఉపయోగించడం జరుగుతుంది. దక్కనుకు చెందిన ఆసఫియా పతాకం ఢిల్లీలోని ఎర్రకోటపై రెపరెపలాడేరోజు ఎంతో దూరంలో లేదు అని రజాకర్ల నాయకుడు ఖాసిం రజ్వీ పలికిన తీరే రజాకర్లు ఎంతగా బరితెగించి ఉన్నారో చెప్పడానికి నిదర్శనం.
ఉర్దూ పత్రిక ఇమ్రోజ్ ఎడిటర్ షోయబుల్లాఖాన్‌ను 1948 ఆగస్ట్ 22న హత్య చేసిన సంఘటన చివరకు చరిత్ర మలుపు తిప్పింది. ముస్లిం ప్రయోజనాఢిల్లీకు వ్యతిరేకంగా రాసినవారి చేతులు నరుకుతామని రజ్వీ హెచ్చరించిన వారానికే ఈ హత్య జరిగింది. షోయబుల్లాఖాన్‌ను కాల్చిచంపే ముందు హంతకులు ఆయన చేతులు నరికేశారు. ఇది దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. హైదరాబాద్‌పై పోలీసు చర్య జరపడానికి చివరకు నెహ్రూ అంగీకరించారు.
చివరి ఘట్టం:
హైదరాబాద్ సంస్థానంలోని విపరీత పరిస్థితులు కుదుటపడేవరకు న్యాయస్థానాలకు హాజరుకాలేమని న్యాయవాదులు నిర్ణయించారు. భారత దేశంలో సహాయ నిరాకరణోద్యమ సమయంలో పూర్తిగా విజయవంతం కాని కోర్టు బాయ్‌కట్ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో సంపూర్ణంగా జరిగింది. స్వామీ రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రెస్ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో ఎదుర్కోమని సలహా ఇచ్చింది. ఈ ఉద్యమ కాలంలో 14 వేల మంది వాలంటీర్లు అరెస్టయ్యారు. 15 వేల మంది విద్యార్థులు పాఠశాలలో బాయ్‌కట్ చేసారు. ఆరు వేల మంది గ్రామోద్యోగులు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వానికి ఎక్సయిజు ఆదాయం తగ్గించడానికి అయిదు లక్షలపైగా తాటి, ఈత చెట్లను సమూలంగా నరికివేశారు. నిజాం ప్రభుత్వానికి ఏటా వసూలయ్యే లెవీ ధాన్యాన్ని సమయానికి రాకుండా చేశారు. ఇత్తెహాదుల్ ముసల్మిన్‌కు చెందిన రజాకర్లు నానాటికి బలపడుతూ శిక్షణ శిబిరాలు నడపడం, ప్రదర్శనలు జరపడం వంటివి ఎక్కువ చేశారు. వారి వాలంటీర్లు యూనిఫారం ధరించి కత్తులతో పట్టణాలలో పెద్ద పెద్ద గ్రామాలలో వాడవాడలా తిరిగేవారు. నిష్కారణంగా ప్రజలను హత్య చేసేవారు. వారి ఆస్తులను లూటీ చేసేవారు. దహనకాండకు ప్పాడేవారు. రాష్ట్ర ప్రజలు రాష్ట్రం వెలుపలికి ప్రాణాలు చేతపట్టుకొని వలసపోయినారు. ఆర్థికంగా, సాంఘికంగా ఇతర విషయాలలో ఇబ్బందుల పాలయ్యారు. వారి జీవితం దుర్భరమైంది. నిజాం నిరంకుశ పాలన బద్దలయ్యే రోజురానే వచ్చింది.
1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రంపైన పోలీసు చర్య జరిపింది. ఇది ప్రతిఘటన లేని పురోగమనంగా నడిచింది. 17వ తేదీన పూర్తయింది. వారం రోజుల్లోనే భారత సేనలు నిజాం ఆటకట్టించాయి. యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాటు చేయబడ్డ రజాకార్ సంస్థ బండారం బయటపడింది. అది పేకమేడలా కూలిపోయి అతీగతీ లేకుండా అంతర్ధానమై పోయింది. 17 సెప్టెంబరు తెలంగాణ చరిత్రలో విముక్తి దినంగా నిలిచిపోయింది.