చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న పర్యాటక ప్రదేశాలకు నెలవుగా పేరొందిన క్షేత్రం కొలనుపాక. నల్గొండ జిల్లా ఆలేరు పట్టణానికి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రం జైన, శైవ, వైష్ణవ మతాలకు నిలయమై చరిత్ర పుటలకెక్కింది.
కొలనుపాక కొల్లిపాకగా తొలుత రాష్ట్రకూటుల నాటి ఒక శాసనంలో ప్రస్తావించబడింది. సంకర గడ్డారసురుడు అనే రాష్ట్ర కూట సామంత రాజుకు రాజధానిగా ఉన్న కొలనుపాక ఆనాడే జైన మతానుయాయులకు స్థావరమైందని పరిశోధకుల ఉవాచ.
క్రీ.శ. 973 తరువాత దక్కనును పాలించిన పశ్చిమ చాళుక్యుల కాలంలో కూడా కొలనుపాక ప్రాంతీయ రాజధానిగా ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
నల్గొండ జిల్లాలో ఉన్న అతి పురాతన, సుందర పర్యాటక క్షేత్రం కొలనుపాక.
హైద్రాబాద్ నగరానికి 60 కిలోమీటర్లు దూరంలో, వరంగల్ పట్టణానికి 50 కిలోమీటర్లు దూరంలోనూ ఉన్న ఈ క్షేత్రానికి పక్కగా ఆలేరు నది ప్రవహిస్తుంది. కల్యాణి చాళుక్యులకు రాజధాని కొలనుపాక. 11వ శతాబ్దానికి చెందిన ఈ రాజుల కాలంలోనే అనేక ఆలయాలు ఇక్కడ వెలిశాయి. కొలనుపాకలో దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి గాంచిన జైనాలయం ఉంది. ఈ ఆలయాన్ని ఏటా లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు. అలాగే ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం నాటి అనేక ఆలయాలు కూడా ఉన్నాయి. పదెకరాల విస్తీర్ణంలో ఉన్న జైనాలయాన్ని ఉత్తర భారతం నుంచి లక్షలాది మంది యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు. దేశంలో ఉన్న ముఖ్యమైన జైన క్షేత్రాలలో ఇది ఏడవదిగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ. 1767లో మొగలు చక్రవర్తి ఔరంగజేబు కుమారుడైన బహద్దూర్‌షా దగ్గర సుబేదారుగా పని చేసిన యూసఫ్‌ఖాన్ జైనాలయ ముఖ ద్వారాలను నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది. ఈ ఆలయంలో విలువైన 13 విగ్రహాలున్నాయి. మహావీరుని విగ్రహం ఫిరోజ్ రత్నాలతో అలంకరించబడి ఉంది. దీని విలువ కోట్ల రూపాయలలో ఉంటుందంటారు. అలాగే ఇక్కడున్న మరో విగ్రహం ఆదేశ్వర విగ్రహం. కునుటిరాయితో ఇది రూపొందించారు. దీనిపై వెండి కిరీటం ఉంది. ఇక్కడ ఈ ఆలయంలో మాణిక్యదేవుని విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. క్రీ.పూ. 680వ సంవత్సరంలో శంకర్ రాజు అనే చక్రవర్తి వజ్రాలతో కూడి ఉన్న మాణిక్య దేవుని విగ్రహాన్ని తన వీపుపై వేసుకుని సైన్యంతో తన రాజధానికి పయనిస్తున్న సమయంలో వీపుపై ఉన్న విగ్రహం కొలనుపాకలో పడిపోయిం దట. దాంతో ఆ రాజు భక్తిప్రపత్తులతో ఆ విగ్రహా న్ని అక్కడే ప్రతిష్టించి, పూజాదికాలు చేసినట్లు ఇక్కడ లభ్యమైన ఒక శాసనం ద్వారా అవగతమ వుతోంది. కొలనుపాకలో ఉన్న మరో ప్రసిద్ధ, ప్రాచీనాలయం సోమేశ్వర స్వామి ఆలయం. ఈ స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయం కాకతీయుల శిల్పకళారీతులను పుణికి పుచ్చు కున్నట్లుగా దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో శివలింగాన్ని పూజిస్తే పునర్జన్మ ఉండదంటారు. గర్భగుడిలో సోమేశ్వర లింగం అత్యంత తేజో విరాజమానమవుతుంది. ఈ లింగం నుంచే జగ ద్గురువు రేణుకాచార్యుల వారు అవతరించి వీరశైవ ధర్మాన్ని నలుదిశల్లో వ్యాప్తి చేసినట్లు తెలుస్తోంది. గణపతి దేవ చక్రవర్తి, అతని సోదరి మైలాంబ ఈ సోమేశ్వరాలయంలో సహస్రలింగేశ్వర ప్రతిష్ఠ చేసినట్లు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. ఏటా ఇక్కడ చైత్ర బహుళ తదియ నుంచి పంచమి వరకు బ్రహ్మూెత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర నలు మూలల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తారు.
కొలనుపాకలోని సోమేశ్వర స్వామి వారి దేవాలయ ముఖమంటపంలో పురావస్తు శాఖవారి ప్రదర్శనశాల ఉంది. ఈ ప్రదర్శనశాలలో వందలాది విగ్రహాలు, శిల్పాలు, శాసనాలు దర్శనమిస్తాయి. ఆరవ విక్రమాదిత్యునికి కాలానికి చెందిన ఆరు శాసనాలు ఇక్కడ ఈ ప్రదర్శన శాలలో పర్యాటకులు దర్శించడానికి వీలుగా పొందుపరిచారు. కాకతీయ, చాళుక్య రాజుల శిల్ప శైలి గురించి అధ్యయనం చేసేవారికి ఈ ప్రాంగణం ఓ అద్భుతమైన వేదిక.
కొలనుపాకలో చారిత్రకపరంగా ప్రాధాన్యం సంతరించుకున్న మరో ఆలయం వీరనారాయణ స్వామి ఆలయం. జగద్దేవుడి సేనాపతి అయిన నంది విగ్రహ సోమదండ నాయకుడు తన ప్రభువు రాజ్యాభివృద్ధినీ, క్షేమాన్ని కోరి కొలనుపాలో క్రీ.శ. 1105లో జదద్దేవ వీరనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి అష్టదిశల దిక్పాలకుల విగ్రహాలు ప్రతిష్ఠితమ య్యాయి. కొల్లూరు, పెంబర్తి, కొలనుపాక గ్రామాలను ఈ ఆలయానికి ఆనాటి పాలకులు అరణంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ ఆలయం కాకతీయులు, మొగలుల పాలనలో నిరాదరణకు గురై శిధిలావస్థకు చేరుకుంది.
అలాగే పల్లవ చాళుక్య, కాకతీయ కాలాల్లో నిర్మితమైన మరో శివాలయం విశ్వేశ్వరాలయం. కొలనుపాక సమీపంలోని రాఘవాపురంలో ఇది దర్శనమిస్తుంది. చనిపోయిన వారి అస్తికలను ఈ ఆలయంలోని కోనేటిలో కలిపితే కాశీలోని గంగానదిలో అస్తికలు కలిపిన పుణ్యం లభిస్తుందంటారు. కొలనుపాకలో బస చేయడానికి జైనాలయంలో అనేక గదులు అందుబాటులో ఉన్నాయి. అలాగే నిత్యాన్నపథకం సదుపాయం కూడా ఇక్కడ ఉంది. హైద్రాబాద్ నుంచి అత్యంత సులువుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.