డా|| సామల సదాశివ బహుభాషా వేత్త. సంగీత సాహిత్యాలలో అనన్యమైన పాండిత్యం గలవారు. వారు రాసిన సంగీత ప్రధానమైన ‘స్వరలయలు’ గ్రంథానికే కేంద్రసాహిత్య అకాడమి పురస్కారం వరించింది. సదాశివ ఉర్దూ, ఫారసీ, హిందీ, మరాఠీ భాషా సాహిత్యాలను తెలుగు వారికి పరిచయం చేసినారు. ముఖ్యంగా వారు రాసిన ఉర్దూ సాహిత్య చరిత్ర. ఉర్దూ కవుల కవితా సామగ్రి. ఫారసీ కవుల ప్రసక్తి వంటి గ్రంథాలు ప్రామాణికమైనవని విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఈ గ్రంథాలు ఈనాడు తెలుగులో గజల్లు రాస్తున్న వారికి మార్గదర్శకాలుగా వున్నాయనడం అతిశయోక్తి కాదు.
ఇన్నింటిలో ప్రతిభ గల సదాశివకి చిత్రలేఖనంలో కూడా అభిరుచి వున్నదంటే సరిపోదు. సదాశివ చేయి తిరిగిన చిత్రకారుడు. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అంటే చిత్రకళ సదాశివ వ్యక్తిత్వంలోని మరో పార్శ్వం. ఒకే వ్యక్తికి ఇటువంటి అనేక పార్శ్వాలుండటం చాలా అరుదు. అటువంటి వారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అనాలి.
ఉర్దూలో పహేలూదార్ షక్షీయత్ అంటారు. పహేలూ అంటే పార్శ్వం, లేదా కోణం. షక్షీయత్ అంటే వ్యక్తిత్వం. ఒకే వ్యక్తిలో వివిధ పార్శ్వాలు దర్శనమిస్తే అది పహేలూదార్ షక్షీయత్ అవుతుంది.
సదాశివ తండ్రి సామల నాగయ్య పంతులు ఆదిలాబాదుకు దగ్గరిలోని తామ్సి గ్రామంలో సర్కారీ తహతానియా సదర్ ముదర్రీస్ (ప్రభుత్వ ప్రాథమిక ప్రధానోపాధ్యాయుడు)గా పనిచేసినారు. సదాశివ బాల్యం తామ్సిలోనే జరిగింది. అదే పాఠశాలలో పనిచేసే ఫారసీ పండితుడు రియాజుర్ రహమాన్ సదాశివకు చిన్న నాటనే ఫారసీ బోధించాడు. ఈ విషయాన్ని సదాశివ తమ ‘యాది’ గ్రంథంలో ప్రస్తావించినాడు.
తామ్సి గ్రామంలో పడిగెల రాజేశ్వరరావు అనే జాగీర్దారు వుండేవారు. వారి హవేలీలో నకాశీవాళ్లు చిత్రించిన చిత్రాలను చూసి, వారిలో నైపుణ్యాన్ని గమనించిన సదాశివకు చిన్ననాటనే చిత్రాలు వేయాలనే ప్రేరణ కలిగింది.
ఒకనాడు ఆదిలాబాదులో టూరింగ్ టాకీస్‌లో చూసిన నలదమయంతి సినిమాలోని దృశ్యాలను ఊదారంగు సిరాతో కాయితం విూద చిత్రించినాడు. ఆ చిత్రాలను చూసిన టీ. లక్ష్మయ్య అనే డ్రాయింగ్ మాస్టర్ ప్రోత్సహించి సదాశివతో మద్రాసు ఆర్ట్స్ కాలేజీ వాళ్లు నిర్వహించే డ్రాయింగ్ అండ్ పేయింటింగ్ పరీక్షలు రాయించినారు. ఆ తరువాత బొంబాయి జే.జే. ఆర్ట్స్ వారు నిర్వహించే లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు రాయడానికి హైదరాబాదు వెళ్లి చింతల నరసమ్మ పూట కూళ్ళ ఇంట్లో దిగి, సిటీ కాలేజీలో డ్రాయింగ్ పరీక్షలు రాసినట్లుగా సదాశివ తమ ‘యాది’ గ్రంథంలో ప్రస్తావించినారు.
సదాశివ వరంగల్‌లో చదువుతూ వున్న సమయంలో అనారోగ్య కారణాల వలన హాజరుశాతం తగ్గిపోయినందున పరీక్షలో కూర్చోనివ్వలేదని ఇంటికి తిరిగివచ్చినాడు. ఆ సమయంలో సదాశివ తండ్రి నాగయ్య పంతులు వాంకిడిలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ ఆ గ్రామస్తుల మన్ననలను పొందుతూ గ్రామస్తుల చేత, శిష్యుల చేత గయోపాఖ్యానం నాటకం వేయిస్తున్నారు. ఆ నాటకానికి కావలసిన తెరలు, వాటిపై రకరకాల దృశ్యాలను చిత్రించే అవకాశం సదాశివకు దక్కింది. ఆ విధంగా సదాశివ తన చిత్రకళకు మెరుగులు దిద్దుకున్నారు.
సదాశివ ఖైరతాబాదులోని కళాశాలలో టీచర్స్ ట్రెయినింగు చేస్తున్న సమయంలో ఆక్కడ దీన్‌దయాళ్ నాయుడు డ్రాయింగ్ మరియు క్రాప్ట్ టీచర్‌గా పనిచేసేవారు. అతను సదాశివ లోని చిత్రకళాభిరుచిని గమనించి మెళకువలు నేర్పినాడు. సదాశివ దీన్‌దయాళ్ నాయుడు ప్రియశిష్యుడైనాడు.
భారత కోకిల సరోజినీ నాయుడి మేనల్లుడు దీనదయాళ్ నాయుడు. అనగా సరోజిని నాయుడు భర్తయైన మేజర్ గోవింద రాజులు నాయుడు సోదర పుత్రుడు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్నందుకున్న తొలి తెలంగాణా కథానాయకుడు జైరాజ్ దీన్ దయాళ్ నాయుడి తమ్ముడే! అతని పూర్తిపేరు జైరాజ్ నాయుడు.
సదాశివ తైలవర్ణచిత్ర రచనలో చాలా సాధన చేసి పట్టుసాధించినాడు. సదాశివ చిత్రించే జలవర్ణ చిత్రాలు ప్రత్యేక శైలి గలవి. ఈ ప్రక్రియను వాష్ పేయింటింగ్ అంటారు. ఈ పద్ధతిలో ఒక్కొక్క బొమ్మ వేయడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. ఈ పద్ధతిలో సదాశివ వేసిన రెండు చిత్రాలు ఇప్పుడు మనకు అందుబాటులో వున్నాయి. ఈ పద్ధతిలో విఖ్యాత చిత్రకారులు అబ్దుల్ రహమాన్ చొగ్తాయి ప్రముఖుడు. మిర్జాగాలిబ్ గజల్లకు చొగ్తాయి వేసిన చిత్రాలతో నిండివున్న గ్రంథం పేరు మురఖ-యె-చొగ్తాయి. ఈ గ్రంథం ఆనాడే 100 రూ.ల వెలతో అతిఖరీదైన పుస్తకంగా పేరు పొందింది. డా|| దాశరధి గాలిబ్ గీతాలు గ్రంథంలా బాబు చొగ్తాయి పద్ధతిలోనే రేఖా చిత్రాలు వేసినారు. అన్నట్లు సదాశివకి బాపుకి ఆత్మీయ అనుబంధం వుండేది. బాపు చేతిలో సదాశివ రాసిన ‘మలయమారుతాలు’ గ్రంథం ఎల్లప్పుడూ వుండేది. తాను చదువుతూ ఇతరులను కూడా చదవమని బాపు ప్రోత్సహించేవారు.
సదాశివ రూప చిత్రాలు (పొట్రెయిట్) వేయటంలో కూడా గొప్ప ప్రతిభ గల వారని తెలుపుటకు సదాశివ వేసిన తమ తల్లిగారి రూపచిత్రంతో వున్న ఫోటో ఒకటి పాలపిట్ట పత్రికలో ప్రచురితమైంది చూడవచ్చు. ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, సదాశివ వద్ద తైల వర్ణ చిత్రాలు గీయటం నేర్చుకున్నారని సదాశివ ‘యాది’ గ్రంథం వలన తెలుస్తున్నది.
అయితే ఈ గురు శిష్యులిద్దరికీ ఆత్మీయ అనుబంధముండేది. వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగేవి. శుభకార్యాలకు ఆహ్వానాలు పంపుకొని క్షేమ సమాచారం తెలుసుకొనేవారు. రాజయ్య, సదాశివ చేత తనగురించి ఉర్దూలో ఒక వ్యాసం రాయించుకున్నారు. కాళోజీ నారాయణ రావు ఎనభై ఎనిమిదవ జన్మదినం రోజున ‘కాళోజీ నా గొడవ – కవితలు” అనే గ్రంథావిష్కరణ సభలో సదాశివ, కాపు రాజయ్య కలుసుకున్నారు. ఈ ఇద్దరు మిత్రుల అపురూప ఫోటోగ్రాపు ఒకటి 4 సెప్టెంబర్ 2013వ తేదీ ”నమస్తే తెలంగాణ” పత్రిక ”చెలిమి”లో ప్రచురితమైంది. అప్పటికే ఈ ఇద్దరు కొన్ని రోజుల తేడాతో స్వర్గస్థులైనారు.
సదాశివ ఏదేని గ్రంథం రాయబూనినప్పుడు ఆ సంఘటనల చిత్రాలను స్వయంగా వేసుకునేవారు. సదాశివ రాసిన ‘నిరీక్షణ’ కావ్యానికి సంబంధించిన చిత్రం. ‘విశ్వామిత్రము’ అనే కావ్యానికి గాను వివిధ భంగిమల్లో రామలక్ష్మణులు. అహల్య చిత్రాలు కూడా వేసినారు. కొన్ని ఉర్దూ షేర్ల ఆధారంగా వేసిన రెండు వాష్ పేయింటింగ్స్ కూడా వున్నాయి. అవి అబ్దుల్ రహమాన్ చొగ్తాయి పద్ధతిలో వేసినవి. సదాశివ వేసిన చిత్రాలు చాలామటుకు ఎవరో ఒకరు తీసుకొని వెళ్లినందున అవి దొరకలేదు. దొరికినంతమటుకు పాఠకుల కోసం ప్రచురిస్తున్నాము.
సదాశివ చిన్ననాటి నుండే విస్తృతంగా చిత్రాలు వేసినారు. చిత్రకళకు సంబంధించిన పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనారు. కానీ సదాశివ వేసిన తొలినాటి చిత్రాలు ఈనాడు అలభ్యము. ఆ చిత్రాలను పదిలపరచకపోవడమే కారణమ నుకోవాలి. అయితే దీన్‌దయాళ్ నాయుడు సదాశివను చక్కని చిత్రకారునిగా తీర్చిదిద్దినారనుట వాస్తవం.
సదాశివ వరంగల్‌లోని కాలేజీయేట్ హైస్కూల్లో చదువుకున్నారు. అక్కడే సదాశివకు చుక్కా రామయ్య సహాధ్యాయి. ఈ ఇద్దరు బాల్యమిత్రులకు 1998వ సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసినారు. ఎన్నో యేండ్లకు తిరిగి అక్కడ కలుసుకున్నారు. ఆనాడు డాక్టరేటు పొందిన వారిలో సదాశివ, చుక్కా రామయ్య గార్లిద్దరే ధోవతీ నేహ్రూషర్టు మీద దర్శనమిచ్చినారు.
వరంగల్‌లోని కాలేజీయేట్ హైస్కూల్లో పిళ్లే దీనదయాళ్ నాయుడు డ్రాయింగ్ మాస్టర్లుగా వుండేవారు. పిళ్లే వద్ద సదాశివ కొంత మినియేచర్ పేయింటింగ్ నేర్చుకున్నారు. కానీ దీన్ దయాళ్‌నాయుడు వద్దనే సదాశివకు చనువు అధికంగా వుండేది. తరువాత హైదరాబాదు ఖైరతాబాద్‌లోని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో చేరిన సదాశివకు అక్కడ తిరిగి దీనదయాళ్ నాయుడు సాంగత్యం లభించింది. దీనదయాళ్ నాయుడుకు అక్కడికే బదిలీ అయింది. పాత శిష్యుడైన సదాశివను తోడ్కొని హైదరాబాదులోని గొప్ప గొప్ప చిత్రకారుల ఇండ్లకు వెళ్లి వారి చిత్రలేఖనాన్ని గమనించే అనుమతిని దయచేసేవారు. తరచుగా గోల్డెన్ త్రెషోల్డ్‌కు తీసుకొని వేళ్లేవారు. తమ కళాశ్రమంలో కూడా కూర్చోబెట్టుకొని చిత్రకళలోని మెళకువలు తెలుసుకొమ్మనే వారు. సాధారణంగా చిత్రకారులు తమ చిత్రరచన సమయంలో ఎవరినీ లోపలికి అనుమతించరు. సాహిత్యంలో ఏకసంతాగ్రాహులున్నట్లే చిత్రలేఖనంలో కూడా వుంటారని భావిస్తారు.
దీనదయాళ్ నాయుడు సదాశివపై చూపిన శిష్యవాత్సల్యాన్ని యాదిగ్రంథంలో స్మరించుకున్నారు. సదాశివ దీనదయాళ్ నాయుడు శిష్యునిగా రాటుదేలిన తరువాత వేసిన చిత్రాల్లో పరిపక్వత కనిపిస్తుంది. ఆ కాలంలోనే సదాశివ
ఉత్తమ చిత్ర కారునిగా పేరు సంపాదించినారు. కనుకనే సిద్ధిపేట నుండి కాపు రాజయ్య సదాశివ నివశించే కాగజ్‌నగర్ వచ్చి వారింట్లో కొన్నాండ్లు అతిథిగా వుండి తైలవర్ణ చిత్రాలు చిత్రించడంలోని మెళకువలు నేర్చుకున్నారు.
సదాశివ మంచి చిత్రకారుడిగా రాణిస్తూనే రచయితగా, కవిగా విస్తృతంగా రచనలు చేస్తూ ఆనాటి మహాపండితుల ప్రశంసలందుకున్నారు. ఈ సాహిత్య వరివస్యలో అధికమైన సమయాన్ని వెచ్చిస్తూ మెల్లిమెల్లిగా చిత్రకళను తగ్గిస్తూ వచ్చినారు.
ఏది ఏమయినా సదాశివ గొప్ప చిత్రకారుడు అనుటకు ఈ రెండు మూడు చిత్రాలే నిదర్శనంగా చెప్పవచ్చు.
(11మే 2019 సదాశివ 91వ జయంతి)
– సామల రాజవర్ధన్