చిత్రకారులకు--నిర్దిష్ట-దృక్పథం-అవసరంపల్లెపట్టులలోని స్త్రీపురుషుల నిత్యజీవితం, సుఖదు:ఖాలు, కోపతాపాలు, అందులోని శృంగారం  కె. లక్ష్మాగౌడ్‌ చిత్రాలలోని వస్తువు. ఇలా సరికొత్త కోణంనుంచి భారతీయ సంస్కృతిని తన చిత్రాలలో ప్రతిబింబించే సృజనాత్మక చిత్రకారుడు కె. లక్ష్మాగౌడ్‌ ఎప్పటికప్పుడు వివిధ చిత్రకళా ప్రక్రియలు చేపట్టి తనకొక విశిష్టస్థానాన్ని పదిలం చేసుకున్న నిత్యనూతన చిత్రకారుడు కూడా.

1940లో పుట్టిన లక్ష్మాగౌడ్‌ బరోడాలో అభ్యసించింది సంప్రదాయ చిత్రకళ అయినా, ఆయన బాల్యంలో మనస్సుపై ముద్రవేసిన అనేక సంఘటనల ఆధారంగా ఎన్నెన్నో చిత్రాలలో మానవకోటిని, జంతుజాలాన్ని కలగలిపి చిత్రించాడు. ఈయన చిత్రాలకు అంతర్జాతీయంగా సైతం ఖ్యాతి లభించింది. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయంలో సరోజినీనాయుడు స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసి ఎందరో వర్థమాన చిత్రకారుల గీతలు మార్చాడు.

ఈ నేపథ్యంలో ఆయన ఇష్టాగోష్టిలో దాదాపు యీ చిత్రాలన్నింటిలో ‘‘సెక్స్‌’’ వస్తువుకాదా? మరి మీ చిత్రాలు పిల్లలు తిలకించడానికి నిషేధమా అంటే` ‘‘అదేమీ లేదండీ, మన సంప్రదాయమే, కళే నా చిత్రాల్లో ఉంది. ‘‘సెక్స్‌’’ జీవితంలో భాగం కదా? అందుకని నిషేధం అక్కర్లేదు. పైగా నా చిత్రాల్లో ‘‘సెక్స్‌’’ ఫొటోగ్రాఫ్‌లాగా
ఉండదుకదా? కళాత్మక దృష్టినుంచి వాటిని గీశాను. సృజనాత్మకంగా తీర్చిదిద్దాను. అందువల్ల నా చిత్రాలు కొందరికే పరిమితమనే భావం సరైందికాదు. అందరూ నా చిత్రాలు తిలకించవచ్చు’’అన్నారు.

చిత్రకళారంగంలో శ్రీకారంచుట్టిన నాటినుంచీ మీరు తీసుకున్న వస్తువులో మార్పు ఉన్నట్టులేదు. అంతబలంగా మిమ్మల్ని ప్రేరేపించిన వారెవరు? అని ప్రశ్నిస్తే…

చిత్రకారులకు--నిర్దిష్ట-దృక్పథం-అవసరం2‘‘నేను పుట్టి పెరిగిన మా ఊరు`నిజాంపూర్‌లోని గ్రామీణులు. వారి బహిరంగ నిత్యజీవితం. అక్కడి మూగజీవులు నా చిత్రాల్లో ప్రతిబింబించారు. రేఖా విన్యాసంలో, వస్తుస్వీకారంలో చాలామంది ప్రభావం నాపై ఉంది. నేను దేశంలో అనేక ప్రాంతాలు తిరిగాను. ఎందరో చిత్రకారుల చిత్రాలు చూశాను. ముఖ్యంగా పికాసో, పాల్‌క్లీ చిత్రాలంటే నాకెంతో ఇష్టం. వారు మానవజీవితంలో చూసిన ప్రతి సన్నివేశాన్ని, అనుభవించిన కష్టసుఖాలను తు.చ. తప్పకుండా గీశారు. వారికి సమాజంపట్ల ఎంతో ఆప్యాయత ఉన్నట్లు వారి చిత్రాలు చూస్తే తెలుస్తుంది. చెడును బాగుచేయాలనే కాంక్ష కూడా వారి చిత్రాల్లో కనిపిస్తుంది. అందుచేత వారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈ యూరోపియన్‌ మాస్టర్ల ప్రభావం నాపై ఉండి తీరుతుంది. పోతే సమకాలీనులైన ఎం.ఎఫ్‌. హుస్సేన్‌, జెరాంపటేల్‌, సుజా, మాగురువు`కె.జి. సుబ్రహ్మణ్యంల ప్రేరణ సైతం నాపై ఉండి ఉంటుంది. అంతేకాదు నాకు గురుతుల్యులైన జగదీష్‌మిట్టల్‌ సొంత మ్యూజియంలోని లఘుచిత్రాలు ఎన్నోసార్లు నేను పదేపదే చూశాను. వాటి ప్రభావం నాపై ఉండవచ్చు. ప్రపంచం మొత్తంమీద జగదీష్‌ మిట్టల్‌ దగ్గర ఉన్నన్ని కళాఖండాలు బహుశా మరెవ్వరిదగ్గర ఉండిఉండకపోవచ్చు. ఈనాటికీ నేను ఆయన సొంత మ్యూజియంకు వెళ్ళి చిత్రాలు తనివితీరా చూస్తుంటాను. అందుకని వాటి ప్రభావం సైతం నాపై ఉండొచ్చునంటాను. అయినా నా పద్ధతి నాది, నా శైలి నాది, నా వస్తువు నాదే అంటాను. ఏమంటారు?

మ్యూజియం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. రాష్ట్రంలో చిత్రకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వపరంగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ప్రాంతంలో సరైన గ్యాలరీకూడా ఉన్నట్టు లేదు అంటే`
ఔను. నిజమే. రాష్ట్రంలో లలితకళా అకాడమీ లేకపోవడంవల్ల ఈ అనర్థం. తెలుగు విశ్వవిద్యాలయానికీ, కళకు సంబంధం లేదు. లోగడ అకాడమీ ఉన్నప్పుడు కేటాయించిన రెండు లక్షల రూపాయలు నేరుగా చిత్రకారులకు అందేవి. కానీ విశ్వవిద్యాలయం మాటవేరు. లోగడ అకాడమీలో గ్రాఫిక్స్‌ రూపొందించుకునే యంత్రాలు ఉండేవి. వాటిని సద్వినియోగం చేసుకోవలసి ఉంది. రాష్ట్రంలో మొత్తం వెయ్యిమంది చిత్రకారులుంటే హైదరాబాద్‌`సికిందరాబాద్‌ జంటనగరాల్లోనే సుమారు వందమందికిపైగా చక్కని చిత్రకారులు ఉండవచ్చు.

నిర్హేతుకంగా చిత్రాల ధరల నిర్ణయం, వ్యాపార ధోరణివల్ల చిత్రాల సృజనాత్మకతకు శ్రీకారం చుట్టడంకన్నా, నాసిరకానికి దారితీయడం లేదా’’ అని నిగ్గదీస్తే` ‘‘దీనికి రెండు రకాల సమాధానాలు చెప్పుకోవచ్చు. చిత్రాలు సరిగా లేకపోయినా చిత్రకారుడు మాత్రం ఆర్థికంగా బాగుపడతాడు కదా? కళకు అసలే ప్రోత్సాహంలేని పరిస్థితుల్లో చిత్రకారుడు పనిచేస్తున్న ఈ తరుణంలో సమకాలీన చిత్రకళను ఇలా లభించే ప్రోత్సాహం ఒకరకంగా మంచిదే. మరోవిధంగా ఒకవేళ కేవలం ధరనే దృష్టిలో పెట్టుకుని తమ గొప్పకోసం, పేరుకోసం చేసే సందర్భంలో అది తప్పకుండా నష్టానికి దారితీస్తుంది. వ్యక్తిగతంలో చిత్రకారుడికన్న కళకు, సమాజానికి దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుంతుంద’’న్నారు.

asయువ చిత్రకారులకు అనతికాలంలోనే గుర్తింపు లభించడంవల్ల వారి చిత్రాలకు ఎక్కువ రేట్లు పలకడం వల్ల వారి సృజనాత్మకత దెబ్బతినడంలేదా అని అడిగితే` ‘‘దానివల్ల దెబ్బతినదు. సమాజంలో చిత్రకారుడికి ప్రోత్సాహం ఉన్నది. అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ పాళ్ళలో ఉన్నదనుకోండి. యువచిత్రకారుడు దాన్ని చూసి జీవితంలో ఎదురయ్యే తారతమ్యాన్ని తెలుసుకోగలగాలి. చెడును కూడా అమ్మి డబ్బును చేసుకుని పైకి వస్తాననుకుంటే అది తప్పకుండా వారిని దెబ్బకొడుతుంది. ప్రస్తుతం ఒక సీనియర్‌ చిత్రకారుడి చిత్రాలకు బాగా గిరాకీ ఉన్నదనుకుంటే ఎంతోకాలం నుంచివారు పనిచేస్తున్నారు కాబట్టి, రకరకాలైన ఆటుపోట్లకు తట్టుకున్నారు కాబట్టిపైకొచ్చారని యువ చిత్రకారులు గ్రహించాలి. ఇవ్వాళ ఈ ధరకు ఫలానవ్యక్తికి లేదా గ్యాలరీకి ఆయన చిత్రం అమ్మాడంటే`ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు ఫలితం అనుభవిస్తున్నాడనుకోవాలి. ఇలాంటి స్థితిలో అది దెబ్బతీయదు. కేవలం దృష్టి ధరమీద, గ్యాలరీమీద ఉండి. ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ ఫలాన చిత్రం లక్షలాది రూపాయలకు కొన్నారు కాబట్టి తాను అంత ధరకు అమ్ముతానంటే ప్రయోజనంలేదు. ఎందుకంటే యువచిత్రకారుడు కళారంగానికి ఇంతకాలం ఏమి చేశాడు? అన్నది కూడా దృష్టిలో ఉంటుంది. ఏమైనా యువ చిత్రకారులు వృత్తిరీత్యా కష్టపడాలి. వారికి ఒక దృక్పథం ఉండాలి. సృజనవైపు, కొత్త టెక్నిక్‌వైపు, ప్రయోగంవైపు వారు దృష్టి మళ్ళించాలి.

గొప్ప చిత్రాలు సరే, నాసిరకం చిత్రాలు ఎక్కువ ధరకు కొనడం బాధాకరమైన విషయం కాదా? ఏమంటారు చెప్పండంటే` ‘‘నిజమే కాని. సమాజంలో దీన్ని మనం రూపుమాపడం కష్టం. చిత్రకళారంగంతో ఎంతోకాలంగా మీకు కూడా మంచి పరిచయం ఉంది కదా? మన ఇంప్రెషనిస్టులకాలంలో చూడండి. వారికి తిండిలేని స్థితి ఉంది. వారు పిల్లలకు కూడా కడుపునిండా పెట్టలేని దీనస్థితి. ఇవ్వాళ మనం వారిని గొప్ప కళాకారులుగా ఆరాధిస్తున్నాము. ప్రపంచప్రసిద్ధ చిత్రకారుడు గోగిన్‌ తొలి పర్యాయం ప్యారిస్‌లో చిత్రకళాప్రదర్శన ఏర్పాటు చేస్తే, ఒక విమర్శకుడు ఏమి వ్రాశాడో తెలుసా? మీ ఇంట్లో పిల్లలెవరైనా ఏడుస్తుంటే, గోగిన్‌ చిత్రకళా ప్రదర్శనకు తీసుకురండి, నవ్వుతారని. అంత పిచ్చిగా ఆయన బొమ్మలున్నాయని విమర్శలపాలైన గోగిన్‌ కళకే తన జీవితం అర్పించుకున్న వాడు. ఇవ్వాళ ప్రపంచంలో తలమానికమైన చిత్రకారుడుగా ఆయన కీర్తించబడుతున్నాడు. వారి చిత్రాలకు ఆనాడు గుర్తింపులేకున్నా, ఇవ్వాళవారి చిత్రాలు మ్యూజియంలలో అలంకరించారు. వారి కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే వారి తరంలో బాగా డబ్బులకు అమ్ముకున్న చిత్రకారుల నాసి చిత్రాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఏది మంచో చివరకి అదే మిగిలింది కదా?’’ అంటూ ముగించారు లక్ష్మాగౌడ్‌.

Other Updates