టి. ఉడయవర్లు

tsmagazine

స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ఆత్మాను భూతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సృజనాత్మక చిత్రకారుడు డి. దొరైస్వామి. ఆయన తొలి దశలో వేసిన బిలవర్ణ చిత్రాల్లోనైనా, మలిదశలో గీసిన తైలవర్ణ చిత్రాల్లోనైనా, టెంపెరా బాణీ చిత్రాల్లోనైనా. అనంతర కాలంలో రూపొందించిన గ్రాఫిక్స్‌లోనైనా – నిరుపేదల బాధల గాధలే ఉన్నాయి. భావావేశమే కన్పిస్తుంది. కరువు కాటకాలు తదితర ప్రకృతి విలయాలు, కుట్రలు – కుతం త్రాలు తదితర సామాజిక రుగ్మతలను, అసమానతలను తన పద్ధతిలో ఎత్తిచూపారు. సామాజిక వాస్తవాలను అందరి దృష్టికి తేవాలనే కాంక్షతో ఆయన చిత్రాల్లో సంప్రదాయాన్ని పూర్తిగా అతిక్రమించకపోయినా, ఆత్మానుభూతిని స్వేచ్ఛగా వెల్లడించారు. దాదాపు ఆయన రూపొందించిన ప్రతి చిత్రం ఇందుకు ఉదాహరణే.
tsmagazine

కంటికి కన్పించని దాన్ని చూపడంతో పాటుగా అందులోని ప్రధానాంశాన్ని క్యాన్వాసు మీదకు తేవాలనే ఆయన ప్రయత్నించాడు. అయితే తాను ఉద్దేశించిన భావాన్ని మాత్రమే ప్రేక్షకుడి దృష్టికి తేవాలనే దొరైస్వామి కృషి చేశాడు తప్ప, తాను చూసిన ప్రతి అంశాన్ని ప్రేక్షకుడికి చూపాలనే దానికి ఆయన విముఖుడు.

పైగా దొరైస్వామి వాస్తవ రూపాలను వికృతీకరించి వ్యంగ్యంగా వేస్తారు. దీని వల్ల సంఘంలోని కరుణాత్మక సంఘటనలలోని ఆయా ఆకృతులెవరివో మనం శ్రద్ధగా పరిశీలిస్తే పట్టుకోవచ్చు. నిజానికి ఇలాంటి చిత్రకారులు భారతీయ చిత్రకళా రంగంలోనే చాలా తక్కువ మంది ఉన్నారు. మరీ తెలుగువారిలో అయితే బహుశా ఇలాంటి చిత్రకారుడు వీరొక్కరే.

”కరువు – కాటకాలు” అనే అంశంపై దొరస్వామి ఏర్పాటుచేసిన వ్యష్టి చిత్రకళా ప్రదర్శన సందర్శించినప్పుడు – ఒక చిత్రం రూపొందించడానికి ఆయన ఎంత శ్రమించాడో అర్థమైంది. ఏ చిత్రం వేసినా, తొలుత అది ఆయనకు నచ్చాలి. ఆ తర్వాతనే ఆయన దాన్ని అందరి ముందుకు తెచ్చేవాడు. అభిప్రాయాన్ని తీసుకునేవాడు. ఒక వేళ ఏదైనా ‘నమూనా’ తీసుకుని ఆయన బొమ్మవేసినా కూడా, ఆ నమూనా ఉన్నదున్నట్టుగా ఆయన చిత్రంలో కన్పించేది కాదు. అది ఆయనకు ఎలా కన్పిస్తుందో అలాగే వేసేవాడు.
tsmagazine

కాందీశీకుడు, కుట్ర, ‘తల్లీ-బిడ్డ’, చలికాలం, కుటుంబం, బంగ్లాదేశ్‌లో అత్యాచారం లాంటి ఏ వస్తువు తీసుకున్నా దానిని సమగ్రంగా చిత్రించాలని ఆశించాడు. రూప సంవిధానం నాటకీయత చూపేవాడు. తనకు నచ్చిన మార్గంలో కంటికి ఇంపైన వర్ణాలువాడి వాస్తవానికి కొంచెం దూరం జరిగినట్టు అన్పించినా, అపూర్వ పద్ధతిలో చిత్రాలు వేసేవాడు. వారి చిత్రాలలోని మూర్తులు, ఒకటి మరొక దాన్ని చూడవు. అన్నీ ప్రేక్షకుణ్ణే చూస్తాయి. ఆ మౌనమూర్తులు ఏవో రహస్య సంజ్ఞలతో మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.

”కరువు కాటకాలు” శీర్షికలోని అన్ని చిత్రాల్లో ”తల్లీ-బిడ్డ, జీవిత సమరం, అమాయకుల మరణం, దుక్కి” లాంటి చిత్రాలెన్నెంటిలోనో సర్వజనీన తద్వోతకమవుతుంది. మన అంతరంగాలను అతలా కుతలం చేసే కరుణాత్మక చిత్ర రచనలు చేయడంలో దొరైస్వామి దిట్ట.

తైలవర్ణ చిత్రాలెంత ఆలోచనాత్మకంగా వేశారో, గ్రాఫిక్స్‌ రూపకల్పనలోను వారి నైపుణ్యం ప్రేక్షకుల్ని విస్మయపరుస్తుంది. ఏ ప్రక్రియలో చిత్రమున్నా – అది విషయస్పోరకంగా, వాస్తవిక స్పర్శతో కూడి ఉంటుంది. ఒకవేళ ఆయన కాల్పనిక వస్తువుతీసుకున్న సందర్భాలలోను అతడిలో దక్షిన భారతీయ మూర్తులే, ఆకృతులే, వేషభాషలే కన్పిస్తాయి.
tsmagazine

దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం – 1926లో సికింద్రాబాద్‌లో జన్మించిన దొరైస్వామి పిన్ననాటి నుంచి బొమ్మలంటే ప్రాణం. తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని పలు వస్తువులతో ప్రారంభించి పక్షులు, జంతువులను చిత్రించడం ప్రారంభించాడు. కూడు గూడు లేక నిత్యం యాతనపడే దరిద్రనారాయణులను తన చిత్రాల్లో ప్రతిబిం బించాడు. ఇలాంటి చిత్రా ల్లో జడత జాడ ఉండకుండా చీమూ నెత్తురుతో చిత్రం ఉండాలని పదే పదే అదే చిత్రం వేసేవాడు. కథాపరమైన అభ్యాసం చేసి ఆయన సాధారణ జీవనానికి సంబంధించి న సందేశాన్ని సమకా లీన రీతిలో చెప్పాడు.

ఈ క్రమంలో అన్ని ప్రధానమైన అఖిల భారత చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. కేంద్ర లలిత కళా అకాడమీ ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. ముఖ్యంగా కేంద్ర లలిత కళా అకాడమీ 1972లో ఏర్పాటు చేసిన 25 సంవత్సరాల భారతీయ కళా ప్రదర్శనలో పాల్గొన్నారు. 1972లో ఇంగ్లాండ్‌లో నిర్వహించిన తృతీయ బ్రిటీష్‌ అంతర్జాతీయ ప్రింట్స్‌ ద్వైవార్షిక ప్రదర్శనలో, సమకాలీన భారతీయ మండలి 1974లో యుగోస్లోవియాలోని బూస్సెల్స్‌, వార్యకు వెళ్ళారు. అదే యేడాది అఖిల భారత సైన్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ సొసైటీ (న్యూ ఢిల్లీ) మొట్ట మొదటిసారి నిర్వహిచిన అంతర్జాతీయ గ్రాఫిక్‌ ఆర్ట్‌ ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్ర లలిత కళా అకాడెమీ 1975లో ఏర్పాటు చేసిన మూడవ త్రైవార్షిక భారతీయ ప్రదర్శనలోను పాల్గొన్నారు.
tsmagazine

ఈయన రూపులు దిద్దిన అనేక చిత్రాలను పలు దేశ, విదేశీ సంస్థలు, కళాభిమానులు సేకరించారు. వాటిలో ప్రధానంగా కేంద్ర లలిత కళా అకాడెమీ, ఆంధ్ర ప్రదేశ్‌ లలిత కళా అకాడెమీ, సమకాలీన కళా మ్యూజియం (హైదరాబాద్‌), సాలర్‌ జంగ్‌ మ్యూజియం (హైదరాబాద్‌), అధునికి జాతీయ గ్యాలరీ (న్యూ ఢిల్లీ), అకాడెమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (కొలకత్తా), ది కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌ (న్యూ ఢిల్లీ), వైట్‌ రోజ్‌ గ్యాలరీస్‌ బ్రాడ్‌ ఫోర్డ్‌ (ఇంగ్లాండ్‌), తరతరాల తెలుగు మ్యూజియం (హైదరాబాద్‌) శ్రీ చిత్ర ఆర్ట్‌ గ్యాలరీ (త్రివేండ్రం) చెప్పుకోదగినవి.
tsmagazine

1964 నుంచి నాలుగు సార్లు వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆనంతరకాలంలో 1967 నుంచి ఐదు సార్లు వ్యష్టి గ్రాఫిక్‌ చిత్రాల ప్రదర్శన నిర్వహించి చిత్రకళాభిమానుల ప్రశంసలు పొందాడు. 1954, 1971, 1976లోనే హైదరాడాద్‌ ఆర్ట్‌ సొసైటీ బహుమతులు తన చిత్రాలకు గెలుచుకున్నాడు. 1970లో స్వర్ణ పతకం అందుకున్నాడు. అంతేకాదు, 1965లో ఆఖిల భారత ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ సొసైటీ అవార్డు, 1970లో కలకత్తాలోని అకాడెమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ బహుమతి పొందాడు. ఇక ఆంధ్రప్రదేశ్‌ లలిత కళా అకాడెమీ బహుమతులు ఆయన చిత్రాలకు వరుసగా 1967, 1970, 1971, 1972, 1973లో వచ్చాయి. 1969లో స్వర్ణ పతకం గ్రహించాడు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టిస్ట్స్‌ కౌన్సిల్‌ 1973లో ఏర్పాటు చేసిన రెండవ అఖిల భారత గ్రాఫిక్‌ ప్రదర్శనలో, 1975లో అఖిల భారత, సమకాలీన మినియేచర్‌ ద్వైవార్షిక ప్రదర్శనలో, ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు దశాబ్దాల కళపై 1975లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో, 1976లో నిర్వహించిన తృతీయ అఖిల భారతీయ గ్రాఫిక్‌ ప్రదర్శనలో బహుమతులు వచ్చాయి.

ఇట్లా దొరైస్వామి ఇన్ని బహుమతులు గెలుచు కున్నాడంటే ఆయన ఏ వస్తువు తీసుకుని చిత్రం వేసినా అందులో పూర్తిగా నిమగ్నమై బాహ్య వాస్తవికతను పూర్తిగా కొట్టివేయకుండా అంతరంగిక అనుభూతిని వ్యక్తం చేసిన విధానమే కారణం. ఆయన వాడిన వర్ణాలు, వాటి మోతాదు, గీతల తీరు, రూపాల సరళత, నాటకీయత, వ్యంగ్యం ప్రేక్షకుడిని ఆయా చిత్రాలకు చేరువ చేస్తాయి. ఆయన చిత్ర రచనలు – రంగులలో సాగే కథలాంటివి.

నిరాడంబరుడు, పరిణత చిత్రకారుడు, పని రాక్షసుడైన డి. దొరైస్వామి అర్థాయుష్కుడైన తన యేభై ఒక్కటో యేటనే 1977 జూన్‌ 20వ తేదీన కన్నుమూశాడు.

Other Updates