వర్షర్తువులో అమా పల్లె అందం చూడాలి
బతుకమ్మ పండుగ నాడు
పట్టు చీరకట్టుకొని
ఒంటినిండా నగలు పెట్టుకొని
అలంకరించుకున్న మాపల్లె
ఆకాశంనిండా మేఘాలు
సరస్సులో ఆడుకుంటున్న రాజహంసల్లా,
విరిసిన ఇంద్ర ధనువుపై సప్తవర్ణాలు
మా పెరట్లోని పందిట్లో పూచిన మల్లె పువ్వులు
సాయంవేళల్లో
ఎర్ర ఎర్రగా పసుపు పచ్చగా
రంగు రంగుల్లో పూచిన
యౌవనంలో మిసమిసలాడే రుద్రాక్షపూలు
కన్నెల అందాల కన్నుల్లా,
వర్షర్తువులో మా పల్లె
అందంగా
రసనిష్సందంగా
పొలాల్లోకి గలగలపారేకాల్వలు
జలాలతో కళకళలాడే చెరువులు
ఇంతింత పాల పొదుగులతో
పచ్చిక మేస్తున్న పాడియావులు
తడి పొలాన్ని కొమ్ములతో కుమ్ముతూ
రంకె వేస్తున్న నల్లని మూపురాల ఆబోతులు
కొండ్రదున్నుతున్న కోరవిూసాల రైతులు
పశువుల మందలను
కంచెల్లోకి తోలుకు పోయే
పశువుల కాపరులు
వేణుగోపాల స్వామి ఆలయంలో
అర్చన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు
పెడుతున్న పట్టెనామాల ఆచారి పంతులు
వర్షర్తువులో చినుకుపడగానే
మా పల్లె చందం మనసు మురిసే అందం
అందమైన భామలా ఆనంద సీమగా,
మధుర కావ్యంలా మనోజ్ఞలోకంగా
వర్షర్తువులో మా పల్లె మా పల్లె

Other Updates